మెడిక‌ల్ కాలేజీల‌పై టీడీపీ విష ప్ర‌చారం సిగ్గుచేటు

కాలేజీల‌ను పూర్తి చేయ‌లేని అస‌మ‌ర్థుడు సీఎం చంద్ర‌బాబు

పే ఫర్ ప్రాజెక్ట్ (పీపీపీ) కింద మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు

మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ధ్వ‌జం
 
తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ డాక్ట‌ర్స్ వింగ్ అధ్య‌క్షులు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు

17 మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి వైయ‌స్ జ‌గ‌న్ పక్కా ప్ర‌ణాళిక‌

ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిధులు ఇచ్చేలా నాబార్డుతో ఒప్పందం

నిర్మాణానికి డ‌బ్బుల్లేవంటే ఆయ‌న తెచ్చిన‌ రూ.2 ల‌క్ష‌ల కోట్ల అప్పులు ఏమైన‌ట్టు? 

వైయస్ఆర్‌సీపీ హ‌యాంలోనే 5 మెడిక‌ల్ కాలేజీల్లో క్లాసులు ప్రారంభం

క్లాసులు ప్రారంభించ‌డానికి అనువుగా పులివెందుల, ఆదోని కాలేజీలు 

అయినా ఎన్ఓసీ ఇవ్వ‌డానికి ఆసక్తి చూపించని చంద్ర‌బాబు 

వైయస్ఆర్‌సీపీ డాక్ట‌ర్ల విభాగం అధ్య‌క్షులు డిమాండ్ 

తాడేప‌ల్లి: రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు సీఎంగా వైయస్ జగన్ పక్కా ప్రణాళికను అమలు చేస్తే, కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు వాటిని ముందుకు తీసుకువెళ్ళకుండా కుట్రతోనే సేఫ్ క్లోజ్ పేరుతో మూసేశారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్న ఈ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు తనకు కావాల్సిన వారికి వీటిని కట్టబెట్టి జేబులు నింపుకునేందుకు దిగజారిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పీపీపీ మోడల్ అంటేనే పే ఫర్ ప్రాజెక్ట్ అని, ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గంపగుత్తగా ప్రైవేటు వారికి అమ్మేస్తూ, అలాంటిదేమీ లేదని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...

● చంద్ర‌బాబు ఎయిమ్స్‌ని కూడా ప్రైవేటుప‌రం చేస్తాడేమో..?

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఈ 15 నెల‌ల కాలంలో వైద్యారోగ్య‌ రంగాన్ని పూర్తిగా భ్రష్టుప‌ట్టించారు. మెడిక‌ల్ కాలేజీల ఆస్తుల‌ను అప్ప‌నంగా ప్రైవేటు వ్య‌క్తుల‌కు ప‌ప్పు బెల్లాల‌కు క‌ట్ట‌బెట్టేస్తున్నారు. పండ‌గ‌ల సంద‌ర్భంగా షాపింగ్ మాల్స్ ప్ర‌క‌టించే మెగా సేల్స్ మాదిరిగా ప్ర‌భుత్వ ఆస్తుల‌ను త‌న వారికి ధారాద‌త్తం చేయ‌డ‌మే చంద్ర‌బాబు ఉద్యమంగా పెట్టుకున్నారు. పీపీపీ మోడ‌ల్ పేరుతో ప్రైవేటుకు ఆస్తులు దోచిపెట్ట‌డాన్ని కూడా మంత్రులు సిగ్గులేకుండా గొప్ప‌గా ప్ర‌చారం చేసుకుంటున్నారు. విద్య‌, వైద్యం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, టూరిజం, రోడ్లు, ఆరోగ్య‌శ్రీ, ఆల‌య, వ‌క్ఫ్ భూములు, అదీ ఇదీ అని తేడా లేకుండా చంద్ర‌బాబు అన్ని ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెట్టేస్తున్నాడు. అన్నీ ప్రైవేటుకి ఇచ్చేట్ట‌యితే ప్ర‌భుత్వం ఉన్న‌దెందుకు?  మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుకి దారాద‌త్తం చేస్తుంటే ద‌ళిత కుటుంబంలో పుట్టి గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్‌గా ప‌నిచేసిన హోంమంత్రి అనిత స‌మ‌ర్థించ‌డం దారుణం. మంత్రి ప‌ద‌విని కాపాడుకోవ‌డానికి తాప‌త్ర‌య ప‌డ‌టం ఆమె దిగ‌జారి ప్ర‌వ‌ర్తించ‌డం సిగ్గుచేటు. పీపీపీ మోడ‌ల్ అద్భుతంగా ఉండేట‌ట్ట‌యితే ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్(ఎయిమ్స్‌) ని కూడా పీపీపీ మోడ‌ల్‌లోకి కేంద్రం ఎందుకు మార్చ‌డం లేదు. చంఢీఘ‌ర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పీజేఎంఈఆర్, ల‌క్నోలో ఉండే ఎస్‌జేపీజేఏ అనే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌, జిప్‌మ‌ర్, నిమ్స్‌, నీలోఫ‌ర్‌, ఉస్మానియా వంటి ప్ర‌తిష్టాత్మ‌క వైద్య విద్యాసంస్థ‌ల‌ను పీపీపీ మోడ‌ల్‌లో ప్రైవేటుకు ఇచ్చేయ‌లేక‌నే ప్ర‌భుత్వాలు నిర్వ‌హిస్తున్నాయా?  చంద్ర‌బాబుకి అవకాశమిస్తే మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ని కూడా ప్రైవేటుప‌రం చేసేస్తాడు. పులివెందుల‌, ఆదోని మెడిక‌ల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసుకుని క్లాసులు మొద‌లు పెట్ట‌డానికి సిద్దంగా ఉన్నాయ‌ని టీడీపీ భ‌జ‌న ప‌త్రిక ఈనాడే రాసింది. కానీ వాటికి ఎన్‌వోసీ ఇవ్వ‌డానికి చంద్ర‌బాబుకి మ‌న‌సు రాలేదు. కాలేజీల‌ను అమ్మేసి లంచాలు పుచ్చుకోవ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా చంద్ర‌బాబు పీపీపీ మోడ‌ల్ తెర‌పైకి తెచ్చాడు. చంద్ర‌బాబు చెప్పే పీపీపీకి "పే ప‌ర్ ప్రాజెక్టు" అని అర్థం. ఒక్కో ప్రాజెక్టుకు రేటు క‌ట్టి అమ్మ‌కానికి పెడుతున్నాడు. 

● హోంమంత్రి అనిత‌నే అరెస్ట్ చేయాలి..? 

సోష‌ల్ మీడియాలో విష ప్ర‌చారం చేసే వారిమీద కేసులు పెట్టి జైల్లో వేయాల‌ని ఈ ప్ర‌భుత్వం చెబుతోంది. అలా వేయాల్సి వ‌స్తే ఆ జైల్లో ముందుగా రాష్ట్ర హోంమంత్రి అనిత‌నే పెట్టాలి. పనులు మొద‌లు పెట్టిన నాటి ఫొటోలు తీసుకొచ్చి ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. మెడిక‌ల్ కాలేజీల విష‌యంలో ఆమె చేస్తున్న ప్ర‌చారానికి ఖ‌చ్చితంగా ఆమెను, ఆమెతోపాటు పీపీపీకి మ‌ద్ద‌తిస్తున్న  వైద్యారోగ్య‌శాఖ మంత్రిని అరెస్ట్ చేయాలి. మెడిక‌ల్ కాలేజీల సేఫ్ క్లోస్ పేరిట కూట‌మి ప్ర‌భుత్వం జీవో ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా సేఫ్ క్లోజ్ వ్య‌యం రూ.100 కోట్లు అంటూ జ‌న‌వ‌రి 13, 2025న ఈనాడులో వార్తలు రాశారు. ఆ వార్త‌లోనే గ‌త వైయస్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక ప్ర‌కారం 2024-25 విద్యాసంవ‌త్స‌రం నుంచి ప్రారంభించాల‌నుకున్న త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌కు త‌గ్గ‌ట్టు ల్యాబ్‌లు, త‌ర‌గ‌తి గ‌దులు, హాస్ట‌ళ్ల నిర్మాణాలు పూర్తి చేశార‌ని రాశారు. 2025-26 లో ప్రారంభించాల‌నుకున్న వాటిల్లో మాత్రం ప‌నులు ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్నాయ‌ని ఈనాడు  రాసుకొచ్చింది. వాస్త‌వాలు ఇలా ఉంటే హోంమంత్రి అనిత మాత్రం కాలేజీలే క‌ట్టలేదంటూ పిల్ల‌ర్ల ద‌శ‌లో ఉన్న ఫొటోలు చూపించి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. ఏలూరు, నంద్యాల‌, రాజ‌మండ్రి, మ‌చిలీప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, పాడేరు మెడిక‌ల్ కాలేజీల్లో ఇప్ప‌టికే క్లాసులు మొద‌లైన విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియ‌ద‌నుకున్నారా?  గూగుల్ మ్యాప్ ఫొటోలు తీసుకొచ్చి మెడిక‌ల్ కాలేజీలు పూర్తి చేయ‌లేద‌ని హోంమంత్రి అనిత ప్ర‌చారం చేస్తున్నారు. ఆఖ‌రుకి నిర్మాణం పూర్తి చేసుకుని క్లాసులు జ‌రుగుతున్న రాజ‌మండ్రి మెడిక‌ల్ కాలేజీని కూడా పూర్తి కాలేద‌ని చెప్పారు. 

● మెడిక‌ల్ కాలేజీలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసిన వైయ‌స్ జ‌గ‌న్ 

నిధులకు ఇబ్బంది లేకుండా రూ. 8450 కోట్ల‌తో 17 మెడిక‌ల్ కాలేజీల‌ను ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేసే విధంగా గ‌త వైయస్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం రూట్ మ్యాప్ సిద్దం చేసింది. నాబార్డు నుంచి కొంత‌సాయం, కేంద్రం నుంచి స్పెష‌ల్ అసిస్టెన్స్ కింద కొంత నిధులు అందేలా ఆర్థిక వెసులుబాటును కూడా సిద్ధం చేసి కూట‌మి ప్ర‌భుత్వానికి అప్ప‌జెబితే వాటిని పూర్తి చేయ‌లేక ఏకంగా మెడిక‌ల్ కాలేజీల‌నే 15 నెల‌లుగా పక్కకుపెట్టేశారు. ఇప్పుడు కొత్తగా మెడిక‌ల్ కాలేజీ ఆస్తుల మీద క‌న్నేసి పీపీపీ మోడ‌ల్ పేరుతో ప్రైవేట్ వ్య‌క్తులకు లాంగ్ లీజ్ కింద ధారాదత్తం చేయాల‌నే కుట్ర చేస్తున్నారు. ఒకప‌క్క దేశ జీడీపీ క‌న్నా ఏపీ ఎక్కువ వృద్ధి రేటు సాధించింద‌ని ప్ర‌చారం చేసుకుంటున్న సీఎం చంద్ర‌బాబు, ఇంకోప‌క్క 15 నెల‌ల్లోనే దాదాపు రూ.2 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశాడు. ప్ర‌తి మంగ‌ళ‌వారం అప్పులు చేస్తూ కూడా ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ‌కు డ‌బ్బులు లేక మెడిక‌ల్ కాలేజీల‌ను పీపీపీ మోడ‌ల్‌కి మారుస్తున్నామ‌ని చెప్పుకోవ‌డం విజ‌న‌రీన‌ని చెప్పుకునే మ‌నిషి చేయాల్సిన ప‌నేనా? నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా చేస్తున్న చంద్ర‌బాబు రాష్ట్రంలో ఒక్క మెడిక‌ల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయ‌లేదు. 2014 లో చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ఆరు రోజుల త‌ర్వాత నెల్లూరు ఏసీఎస్ఆర్ మెడిక‌ల్ కాలేజీని జూన్ 15, 2014లో ఆప‌రేష‌న్‌లోకి వ‌చ్చింది. ఆరు రోజుల్లోనే మెడిక‌ల్ కాలేజీ క‌ట్టేసి ప్రారంభించిన‌ట్టు త‌న ఘ‌న‌త‌గా ప్ర‌చారం చేసుకుంటున్నారు. వాస్త‌వానికి దీన్ని నాటి దివంగ‌త సీఎం వైయ‌స్సార్ అనుమ‌తులు తీసుకొచ్చి ప‌నులు ప్రారంభించారు. దీంతోపాటు తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి మెడిక‌ల్ కాలేజీ 2014 ఆగ‌స్టు 8లో ఆపరేష‌న్‌లోకి వ‌స్తే దాన్ని కూడా చంద్ర‌బాబే క‌ట్టిన‌ట్టు టీడీపీ ప్ర‌చారం చేసుకోవ‌డం విడ్డూరం. రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మెడిక‌ల్ కాలేజీ నిర్మాణంతో కూడా చంద్ర‌బాబుకి సంబంధమే లేదు. కొత్త కాలేజీలు క‌ట్ట‌క‌పోగా వైయ‌స్ జ‌గ‌న్ నిర్మించిన 10 మెడిక‌ల్ కాలేజీల‌ను అమ్మ‌కానికి పెట్ట‌డం దారుణం. (ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ హాయంలో నిర్మించిన మెడిక‌ల్ కాలేజీల నిర్మాణాల ఫొటోలు, వీడియోలు, గూగుల్ మ్యాప్‌ల‌ను ప్ర‌ద‌ర్శించారు)  వైయస్ఆర్‌సీపీ హ‌యాంలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల్లో కొన్ని సీట్లు క‌న్వీన‌ర్ కోటా కింద భ‌ర్తీ చేస్తే టీడీపీ, జ‌న‌సేన రాద్ధాంతం చేశాయి. కూట‌మి ప్ర‌భుత్వం వ‌స్తే క‌న్వీన‌ర్ కోటా ఎత్తేస్తామ‌ని నారా లోకేష్ హామీ ఇచ్చాడు. కానీ తీరా అదికారంలోకి వ‌చ్చాక ఏకంగా కాలేజీల‌న్నింటినీ ప్రైవేటుప‌రం చేసేశారు. ఇది పేద విద్యార్థుల‌కు వెన్నుపోటు పొడ‌వ‌టం కాదా? క‌న్వీన‌ర్ కోటాలో రూ.16,500 లు ఫీజులు వ‌సూలు చేస్తే త‌ప్పుబ‌ట్టిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాన్, లోకేష్‌లు, ఇదే క‌న్వీన‌ర్ కోటా కింద ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీల్లో ల్యాబ్ ఫీజు, లైబ‌ర్రీ ఫీజు, యూనిఫాం, స్పెష‌ల్ ఫీజు, కాష‌న్ డిపాజిట్‌, ఇంట‌ర్న‌షిప్ ఫీజు, స్పోర్ట్స్ ఫండ్‌, క‌ల్చ‌ర‌ల్ ఫండ్, అద‌ర్ మెయింటినెన్స్‌, హాస్టల్ కాష‌న్ డిపాజిట్ త‌దిత‌ర ఫీజుల పేరిట కోటి రూపాయలపైనే దోపిడీ చేస్తుంటే ఎందుకు మాట్లాడ‌టం లేదు?  

● ఆరోగ్య‌శ్రీ పేరుతోనూ దోపిడీయే

ఇన్నాళ్లూ అమ‌లు జ‌రుగుతున్న ఆరోగ్య‌శ్రీ ట్ర‌స్టు మోడ‌ల్ నుంచి హైబ్రిడ్‌ మోడ‌ల్‌కి మారుస్తూ అదనంగా ప్ర‌జ‌ల‌పై అప్పుల భారం మోపుతున్నారు. వైయస్ఆర్‌సీపీ హ‌యాంలో ఐదేళ్ల‌లో ఆరోగ్య‌శ్రీకి రూ.13,004 కోట్లు ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింది. కోవిడ్ కోసం వెచ్చించిన రూ. 743 కోట్లు ఇందులో నుంచి మిన‌హాయిస్తే ఐదేళ్ల‌లో ఆరోగ్య‌శ్రీకి చేసిన ఖ‌ర్చు రూ. 12,261 కోట్లు. స‌రాస‌రి ఏడాదికి రూ. 2454 కోట్లు ఆరోగ్య‌శ్రీ కోసం ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింది. 1.43 కోట్ల కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి ఏడాదికి ప్రీమియం రూ.2500 అయితే మొత్తం రూ.3,575 కోట్లు అవుతుంది. కూట‌మి ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు 1.63 ల‌క్ష‌ల కుటుంబాల‌కు అయితే రూ.4075 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. ఇప్పుడున్న ఆరోగ్య‌శ్రీని ప్రైవేటు బీమా సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెట్టకుండా, య‌థావిధిగా పాత విధానాన్ని కొన‌సాగిస్తే ప్ర‌భుత్వానికి ఏటా రూ.2500 కోట్ల వ‌ర‌కు ఆదా అవుతుంది. దీనికోసం కొత్త‌గా ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకురావాల్సిన ప‌నిలేదు. ఇలా ఆదా అయిన డ‌బ్బును మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి ఖ‌ర్చు చేస్తే వాటిని కూడా పూర్తి చేసుకోవ‌చ్చు. 

● ప్రైవేటుప‌రం చేయ‌డమే చంద్ర‌బాబు గొప్పత‌న‌మా? 

ప్ర‌భుత్వ ఆస్తులు తాక‌ట్టుపెట్ట‌డంలో చంద్ర‌బాబు సిద్దహ‌స్తుడు. ప్రైవేటైజేష‌న్ ఏ స‌క్సెస్ స్టోరీ పేరుతో గ‌తంలో దీనిపై చంద్ర‌బాబు ఒక పుస్త‌కం కూడా రాశాడు. ప్ర‌భుత్వ ఆస్తులను అమ్మేయ‌డ‌మే త‌న విజ‌యంగా ఈ పుస్త‌కంలో గొప్ప‌గా ప్ర‌చారం చేసుకున్నాడు. రెండు ద‌శల్లో దాదాపు 100 ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్రైవేటుప‌రం చేసిన చ‌రిత్ర హీనుడు చంద్ర‌బాబు. డిజిన్వెస్ట్‌మెంట్, పీపీపీ, స్విస్ ఛాలెంజ్‌ ల కొత్త పేర్ల‌తో ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెట్టడ‌మే ఆయ‌న చేసే ప‌ని. దోపిడీకి ఆయ‌న పెట్టే పేర్లే ఇవ‌న్నీ. విశాఖ‌, విజ‌య‌వాడ‌లో వేల కోట్ల విలువైన భూములు లులూ మాల్‌కి రాసిచ్చేశాడు. చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌తి అవినీతి బాగోతాల‌ను, చీక‌టి ఒప్పందాల‌ను రానున్న రోజుల్లో వైయస్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత ఖ‌చ్చితంగా వెలుగు లోకి తెస్తుంది. ఒప్పందాల‌న్నీ ఖ‌చ్చితంగా ర‌ద్దు చేస్తాం.

Back to Top