ఉద్యోగుల‌ను ముంచేసిన క‌సాయి ప్ర‌భుత్వం 

ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌లేదు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి ధ్వ‌జం

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి 

ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు రూ.30 వేల కోట్లు 

ఏడాదిన్నరగా పీఆర్సీ క‌మిటీ ఊసే లేదు

ఐఆర్ ఇస్తామ‌ని మోసం. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్ 

ఓపీఎస్ అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చి దారుణంగా మోసం

ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్న ఉద్యోగుల‌కు పోస్టింగులు లేవు 

పార్టీల ముద్ర వేసి చిన్న‌స్థాయి ఉద్యోగుల‌పై వేధింపులు 

కూట‌మి ప్ర‌భుత్వంలో ఉద్యోగులకు జ‌రుగుతున్న అన్యాయాల‌పై  ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి ఫైర్‌

వందేళ్ల‌లో చంద్ర‌బాబు చేయ‌లేని మేలు ఐదేళ్ల‌లో వైయ‌స్ జ‌గ‌న్ చేశారు

ఎన్నిక‌ల్లో విచ్చ‌ల‌విడిగా హామీలిచ్చి అధికారంలోకి వ‌చ్చాక వంచ‌న 

యాప్‌ల పేరుతో టీచ‌ర్ల‌కు అడుగ‌డుగునా వేధింపులు 

15 నెల‌లైనా చంద్ర‌బాబు మొద‌టి సంత‌కానికే దిక్కు లేదు  

డీఎస్సీతో 16 వేల టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ ఇప్ప‌టికీ పూర్తి కాలేదు

చంద్ర‌బాబు మోసాల‌ను బ‌య‌ట‌పెట్టిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి 

తాడేప‌ల్లి:   మోస‌పు హామీల‌తో ఉద్యోగుల‌ను న‌మ్మించి అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌క‌పోగా, వారికి హ‌క్కుగా పొందాల్సిన పీఆర్సీ, ఐఆర్‌, డీఏలు వంటి అంశాల విష‌యంలోనూ తీవ్రంగా వంచిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు మొద‌టి సంత‌కం చేసిన టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ 15 నెల‌లైనా ఇప్ప‌టికీ పూర్తి కాలేద‌ని, కానీ వైయ‌స్‌ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల్లోనే ఒకేసారి ఏకంగా 1.36 ల‌క్ష‌ల స‌చివాల‌యాల శాశ్వ‌త ఉద్యోగాలిచ్చి చ‌రిత్ర సృష్టించార‌ని గుర్తు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ ఐదేళ్ల‌లో ఉద్యోగుల‌కు చేసిన మంచి ప‌నుల‌ను చంద్రబాబు వందేళ్లు సీఎంగా చేసినా పూర్తి చేయ‌లేర‌ని విమ‌ర్శించారు. ఉద్యోగుల‌కు పెండింగ్ బ‌కాయిలు రూ.30వేల కోట్లు త‌క్ష‌ణం చెల్లించాల‌ని ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన‌ట్టుగా ఉద్యోగుల‌ను ఓపీఎస్ ప‌రిధిలోకి ఎప్పుడు తీసుకొస్తార‌ని ప్ర‌శ్నించారు. ఉద్యోగుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న మోసాల‌పై మండ‌లిలో ప్ర‌శ్నిస్తామ‌ని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి ఒక్క హామీ అమ‌లు చేసేదాకా ఉద్యోగుల ప‌క్షాన నిల‌బ‌డి వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుంద‌ని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి స్ప‌ష్టం చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర్వ‌నాశ‌నం చేశారు. ఈ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఉద్యోగులు, టీచ‌ర్లకు ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌క‌పోగా నిబంధ‌న‌ల ప్ర‌కారం వారికి ద‌క్కాల్సినవి కూడా ఇవ్వ‌కుండా ఈ ప్ర‌భుత్వం వేధింపుల‌కు గురిచేస్తున్నది. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను ప‌ట్టించుకోలేద‌ని, మేం అధికారంలోకి వ‌స్తే ఉద్యోగుల‌ను గౌర‌వంగా చూసుకుంటామ‌ని చెప్పిన చంద్ర‌బాబు 15 నెల‌లుగా పూర్తిగా ప‌ట్టించుకోవ‌డం మానేశారు.  ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి పీఆర్సీ క‌మిష‌న్ వేసి వేత‌నాలు రివైజ్ చేయ‌డం జ‌రుగుతుంది. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప్ర‌తి ఆర్నెళ్ల‌కు ఒక‌సారి డీఏను ప్ర‌క‌టించడం కూడా నిత్యం జ‌రిగే ప్ర‌క్రియ‌. 12వ పీఆర్సీ 2023 జూలై లో పీఆర్సీని ప్ర‌క‌టించాల్సిన స‌మ‌యం. ఆ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ పీఆర్సీ ఎంత వేయాల‌నే దానిపై 2023 జూలై 12న క‌మిటీని ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. ఈలోపు ఎన్నిక‌లు రావ‌డం, కొత్త‌గా వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం  బ‌ల‌వంతంగా ఆ క‌మిటీతో రాజీనామా చేయించింది. కానీ నేటి వ‌రకు కొత్త క‌మిటీని కూడా ఏర్పాటు చేయ‌కుండా ఉద్యోగుల‌ను వేధిస్తున్నారు. ఇప్ప‌టికి పీఆర్సీ క‌మిటీ కూడా వేయ‌లేదు. కనీసం ఉద్యోగుల‌కు ఐఆర్ కూడా ప్ర‌క‌టించ‌లేదు. కూటమి అధికారం లోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో  పీఆర్సీ లేకుంగా ఐఆర్ ప్ర‌క‌టించ‌కుండా వ‌దిలేయ‌డం రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో ఇప్ప‌టికే నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అరియ‌ర్స్ ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు న‌మ్మ‌బ‌లికారు. అధికారంలోకి వ‌చ్చాక  రూ. 21,980 కోట్లు అరియ‌ర్స్ పెండింగ్‌లో ఉన్నాయ‌ని చంద్ర‌బాబు శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేశారు. నేటికి ఆ బ‌కాయిలు రూ.30 వేల కోట్ల‌కు చేరుకున్నాయి. 

ఉద్యోగుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ గారు చేసిన మేలు

చంద్ర‌బాబు వందేళ్లు ముఖ్య‌మంత్రిగా చేసినా చేయ‌లేని ప‌నుల‌ను వైయ‌స్ జ‌గ‌న్ గారు ఐదేళ్లలోనే చేశారు. రెండేళ్లు కోవిడ్ తో ఇబ్బందులున్నా ఆయ‌న ఉద్యోగుల‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు అధికారంలోకి రాగానే మొద‌టి కేబినెట్‌లోనే ఉద్యోగుల‌కు 27 శాతం ఐఆర్ అమ‌లు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి నెల జూలై 2019 నుంచే ఐఆర్‌తో క‌లిపి జీతాలిచ్చారు. కోవిడ్  కార‌ణంగా రాష్ట్రంపై రూ.66 వేల కోట్ల భారం ప‌డినా పీఆర్సీ 23 శాతం ఇచ్చారు. ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో ఆరు నెల‌ల‌కు ఒక డీఏ చొప్ప‌న 10 డీఏల‌తోపాటు అంత‌క‌ముందు చంద్ర‌బాబు పెండింగ్ పెట్టిన 2 డీఏలు ఇచ్చిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. ఐదేళ్ల కాలంలో 12 డీఏలు ఇచ్చిన ప్ర‌భుత్వం చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేదు. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌న్న ఎన్నిక‌ల హామీ మేర‌కు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే క‌మిటీని వేసి ఆరు నెల‌ల్లోనే అమ‌లు చేశారు. 53 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేశారు. కోవిడ్ సంద‌ర్భంగా బ‌స్సులు తిర‌గ‌ని ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌క‌పోయుంటే ఈ పాటికి ఆర్టీసీ దివాళా తీసేదని ప్ర‌తిఒక్క‌రూ గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ఆర్టీసీని కాపాడిన ఘ‌న‌త కూడా వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. 4500 మంది ఎయిడెడ్ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలో తీసుకున్నారు. 10,500 వేల మంది ఉద్యోగులున్న వైద్య‌విధాన ప‌రిష‌త్‌ని ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి కోరిక మేర‌కు 010 అకౌంట్ ద్వారా వేత‌నాలివ్వ‌డం జ‌రిగింది. రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు 11వ పీఆర్సీ అమ‌లు చేసిన రోజునే రాష్ట్రంలో ఉన్న 10,117 మంది కాంట్రాక్టు,  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు  పీఆర్సీ అమ‌లు చేసి జీతాలు పెంచిన ఘ‌న‌త కూడా వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. వారికి పీఆర్సీ అమ‌లు చేసిన కార‌ణంగా ఇంట‌ర్మీడియ‌ట్ ఉద్యోగుల‌కు రూ. 37,100 వేలు ఉండే జీతాలు రూ. 57,100 ల‌కు పెరిగింది. డిగ్రీ లెక్చ‌ర‌ర్స్ జీతాలు రూ.61,960 ల‌కు పెరిగింది. అంత‌కుముందు వ‌ర‌కు వారికి 10 నెల‌ల మాత్ర‌మే ఇచ్చే జీతాల‌ను 12 నెల‌ల‌కు ఇచ్చే విధంగా నిబంధ‌న‌లు మార్చారు. త‌మ‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌ని పాదయాత్ర‌లో కాంట్రాక్టు ఉద్యోగులు కోరితే వారికిచ్చిన హామీ మేర‌కు వారికోసం జీవో నెంబ‌ర్ 114 తీసుకొచ్చారు. 10,117 మందిని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించే ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. ఎన్నిక‌ల నాటికి అనేక డిపార్ట్‌మెంట్‌ల‌లో క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ ప్ర‌క్రియ పూర్తికాగా, విద్యాశాఖ‌లో మాత్రం మిగిలిపోయింది. అసెంబ్లీ, మండ‌లి, గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పూర్త‌యినా కూట‌మి ప్ర‌భుత్వం చాలా మందిని ఇంత‌వ‌ర‌కు క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌లేదు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ తీసుకొచ్చి 1.36 ల‌క్ష‌ల శాశ్వ‌త ఉద్యోగాలు ఒకే ఒక్క నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌డం కూడా వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న‌తే. కోవిడ్ వంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులున్నా వారిని రెగ్యుల‌ర్ చేయ‌డం వైయ‌స్ జ‌గ‌న్ గొప్ప‌త‌నం. డీఎస్సీ ద్వారా 16 వేల టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తాన‌ని చంద్ర‌బాబు మొద‌టి సంత‌కం పెట్టి 15 నెల‌లైంది. ఇంత‌వ‌రకు ఆ ప్ర‌క్రియ పూర్తి కాలేదు. డీఎస్సీ మీద ఆశ‌లు పెంచుకున్న నిరుద్యోగుల‌ను 16 చెరువులు నీరు తాగిస్తున్నాడు. క్వాలిఫై అయిన అభ్య‌ర్థులు త‌మ ప‌రిస్థితి ఎప్పుడు ఏమ‌వుతుందో అర్థంకాక అయోమ‌యంలో ఉన్నారు. పారిశుధ్య కార్మికుల వేత‌నం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ. 8 వేల నుంచి రూ.16 వేలకు పెంచారు. 40 వేల మంది ఆశ వ‌ర్క‌ర్ల వేత‌నం రూ.10వేల‌కు పెంచాం. రూ. 3 వేల వేత‌నానికి ప‌నిచేసే వెలుగు యానిమేట‌ర్ల జీతాన్ని రూ.10 వేలు పెంచాం. హోంగార్డులు, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల జీతాలు పెంచ‌డం జ‌రిగింది. పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీ మేర‌కు ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీల‌న్నీ చిత్త‌శుద్ధితో నెర‌వేర్చ‌డం జరిగింది. 

ఉద్యోగుల వేత‌నాలు భారీగా పెంపు

వీఆర్వో, ఆఆర్ఏల వ్య‌వ‌స్థ‌లో ప్ర‌మోష‌న్లు కావాల‌నే డిమాండ్ ఎప్ప‌ట్నుంచో ఉంది. కానీ టీడీపీ ప్ర‌భుత్వం వారిని ఏనాడూ ప‌ట్టించుకోలేదు. అలాంటిది అర్హులైన వీఆర్వోల‌కు సీనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల్లో 40 శాతం కోటా క‌ల్పించేలా నిబంధ‌న‌లు తీసుకొచ్చాం. వీఆర్ఏల‌కు దివంగ‌త వైయ‌స్సార్ ప్ర‌భుత్వం 2008లో 10 వేల మంది వీఆర్ఏల‌కు వీఆర్ఓలుగా ప్ర‌మోష‌న్లు ల‌భిస్తే ఆ త‌ర్వాత వ‌చ్చిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వారిని ప‌ట్టించుకోలేదు. 2019 చివ‌రిలో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అర్హులైన వీఆర్ఏల‌కు వీఆర్ఓలుగా ప్ర‌మోష‌న్లు ఇచ్చారు.  ఉద్యోగ భ‌ద్ర‌త‌లేకుండా వెట్టిచాకిరీ చేస్తున్న 93 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను ఆదుకునేందుకు వీలుగా ఔట్ సోర్సింగ్ కార్పొరేష‌న్ (ఆప్కాస్‌) తీసుకొచ్చి  రెగ్యుల‌ర్‌గా ఒక‌టో తేదీనే వేత‌నాలు ఇవ్వ‌డంతోపాటు వారికి పీఎఫ్‌, ఈఎస్ఐ ఇచ్చి అండ‌గా నిలిచారు. కానీ 2024 కూట‌మి ప్రభుత్వం వ‌చ్చాక ఆప్కాస్‌ను నిర్వీర్యం చేసి మ‌ళ్లీ పాత విధానాన్ని కొన‌సాగిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల‌ను తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్త‌ల చేతుల్లో పెట్టాడు. జీవో నెంబ‌ర్ 110 తీసుకొచ్చి యూనివ‌ర్సిటీ టీచింగ్ అసిస్టెంట్ కి అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ కాంట్రాక్టు హోదా ఇవ్వ‌డంతోపాటు జీతాల‌ను రూ. 19 వేల నుంచి రూ.57 వేల‌కు పెంచ‌డం జ‌రిగింది. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు సీపీఎస్ (కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్‌)కి బ‌దులు జీపీఎస్ ( గ్యారెంటీ పెన్ష‌న్ స్కీమ్‌) తీసుకొచ్చి క‌నీసం 50 శాతం పింఛ‌న్ వ‌చ్చేలా నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. కానీ 2024 ఎన్నిక‌ల‌కు ముందు సీపీఎస్‌, జీపీఎస్ క‌న్నా మిన్న‌గా ఓల్డ్ పెన్ష‌న్ స్కీమ్ (ఓపీఎస్‌) తీసుకొస్తామ‌ని చంద్ర‌బాబు, వ‌ప‌న్ క‌ళ్యాణ్ హామీ ఇచ్చి ఇంత‌వ‌ర‌కు అమ‌లు చేయ‌కుండా మోసం చేశారు. దీంతో ఉద్యోగులు తాము ఏ సీపీఎస్ కింద ఉన్నామో, జీపీఎస్ కింద ఉన్నామో అర్ధం కాని అయోమయంలో ఉన్నారు. 

మ‌హిళా ఉద్యోగుల‌ ప‌క్ష‌పాతిగా వైయ‌స్ జ‌గ‌న్ 

ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 60 నుంచి 62 ఏళ్ల‌కు, యూనివ‌ర్సిటీ ప‌రిధిలో 62 నుంచి 65 ఏళ్ల‌కు పెంచ‌డం జ‌రిగింది. మ‌హిళ‌ల‌కు గ‌తంలో 60 రోజులు మాత్ర‌మే ఉన్న చైల్డ్ కేర్ లీవ్స్ ని ఏకంగా 180 రోజుల‌కు పెంచి మ‌హిళా ప‌క్ష‌పాతిగా నిలిచారు. రెగ్యుల‌ర్‌, కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ విధానంలో ప‌నిచేసే మ‌హిళ‌ల‌కు అద‌నంగా 5 సాధార‌ణ సెల‌వ‌ల‌ను ఇవ్వ‌డం కూడా వైయ‌స్ జ‌గ‌న్ గొప్ప‌త‌నం. ప్ర‌మోష‌న్ కోసం ప్ర‌భుత్వ ఉద్యోగులు డిపార్ట్‌మెంట్ ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటే వారి ప్ర‌మోష‌న్లు అడ్డుకునేందుకు  టీడీపీ ప్రభుత్వం నెగిటివ్ మార్కుల విధానం తీసుకొచ్చంది. ఇలాంటి విధానం దేశంలో ఎక్క‌డా లేద‌ని గుర్తించిన నాటి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట‌నే ర‌ద్దు చేసి డిపార్ట్‌మెంట్ ప‌రీక్ష‌ల విధానం తీసుకొచ్చి వేధింపుల‌కు గుర‌వుతున్న‌ ఉద్యోగుల‌కు అండ‌గా నిలిచారు. ఆ విధంగా ఉద్యోగులకు సుల‌భంగా ప్ర‌మోష‌న్లు పొందే వీలు క‌ల్పించారు. 

 ఐదేళ్ల‌లో 25 వేల మంది టీచ‌ర్ల‌కు ప్ర‌మోష‌న్లు

3వ క్లాసు నుంచే సబ్జెక్టు టీచ‌ర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి జీవో 117 విడుద‌ల చేశారు. దీంతో ఒకేసారి సుమారు 8వేల మంది ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్‌లుగా ప్ర‌మోష‌న్ ల‌భించింది. అలాగే హైస్కూల్ ప్ల‌స్ తీసుకురావ‌డం వ‌ల్ల 1792 మందికి పీజీటీలుగా అవ‌కాశం క‌ల్పించాం. దాన్ని కూడా నిర్వీర్యం చేయాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం భావిస్తే వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళ‌న చేయ‌డంతో ఈ ఏడాదికి వెన‌క్కి త‌గ్గారు. సీబీఎస్‌సీ సిస్టం తీసుకొచ్చి మొద‌టి ఫేజ్‌లో 502 స్కూళ్ల‌ను మార్చ‌డం జ‌రిగింది. రెండో ద‌శ‌లో మ‌రో 1000 స్కూళ్ల‌ను సీబీఎస్‌సీ విధానంలోకి మార్చాల‌ని నిర్ణ‌యించాం. ఈ విధంగా పీజీటీలుగా 10 వేల మంది టీచ‌ర్లుగా అవ‌కాశం ల‌భించేది. జిల్లా ప‌రిష‌త్‌లో ప‌నిచేస్తున్న ఎంతోమంది ఏళ్లుగా ప్ర‌మోష‌న్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సీబీఎస్‌సీ విధానం ద్వారా ఆ టీచ‌ర్లంద‌రికీ మేలు జ‌రిగేది. కానీ కూట‌మి ప్రభుత్వం వ‌చ్చాక ఏకంగా సీబీఎస్‌సీ విధానాన్నే ర‌ద్దు చేశారు. లాంగ్వేజ్ పండిట్స్ త‌మ‌ను స్కూల్ అసిస్టెంట్‌లుగా గుర్తించి ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌ని 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయితే వారికి జీతాలు పెంచాల్సి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు ఏనాడూ ప‌ట్టించుకున్న పాపాన‌పోలేదు. అయితే వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయ్యాక 20 ఏళ్ల వారి క‌ల‌ను నిజం చేస్తూ ఏకంగా 10,224 మంది లాంగ్వేజ్ పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ హోదా ఇచ్చారు. అలాగే 2,659 పీఈటీల‌కు ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్లుగా ప్ర‌మోష‌న్ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఐదేళ్ల పాల‌న‌లో 25 వేల మంది టీచ‌ర్ల‌కు ఏదో ఒక‌రకంగా ప్ర‌మోష‌న్లు ఇచ్చారు. రాష్ట్రం పుట్టిన‌ప్ప‌టి నుంచి కానీ, దేశ చ‌రిత్ర‌లో ఏ రాష్ట్రంలో చూసినా ఐదేళ్ల కాలంలో ఇంత గొప్ప‌గా టీచ‌ర్ల‌కు ఏ ప్ర‌భుత్వంలోనూ మేలు జ‌రిగింది లేదు. 

ద‌శాబ్దాల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపిన వైయ‌స్ జ‌గ‌న్ 

చంద్ర‌బాబు 1998 డీఎస్సీ పెట్టి సుమారు 4500 మంది క్వాలిఫై అయినా కి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఉద్యోగాలు ఇవ్వ‌కుండా పెండింగ్‌లో పెడితే దాదాపు 25 ఏళ్ల త‌ర్వాత‌ 2019లో వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయిన తర్వాత వారికి ఉద్యోగాలు ల‌భించాయి. 15 ఏళ్ల క్రితం 2008 డీఎస్సీలో 2159 మంది క్వాలిఫై అయి కూడా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఉద్యోగంలో చేర‌లేక‌పోతే వారికి కూడా ఉద్యోగాలిచ్చిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. మోడ‌ల్ స్కూల్ సిబ్బంది 010 అకౌంట్ ద్వారా జీతాలు కావాల‌ని కోరితే ఆ ప్ర‌కారమే వేత‌నాలు చెల్లించారు. వైద్యారోగ్య శాఖ‌లో 53 వేల పోస్టులు భ‌ర్తీ చేయ‌డం జ‌రిగింది. ఎంఈవో పోస్టుల విష‌యంలో జిల్లా పరిష‌త్, గ‌వ‌ర్న‌మెంట్ ల మ‌ధ్య కొన్ని ద‌శాబ్దాలుగా కొంత అయోమ‌య ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో ఎంఈవో 1, ఎంఈవో 2లుగా రెండు ఎంఈవో పోస్టులు సృష్టించారు. ఈ విధంగా 673 కొత్త ఎంఈవో పోస్టులు క్రియేట్ చేసి జిల్లా పరిష‌త్, గ‌వ‌ర్న‌మెంట్ ల‌కు వేర్వేరుగా ఇచ్చి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపారు. 25 ఏళ్లుగా ఎంపీడీవోల‌కు ప్ర‌మోష‌న్లు లేక‌పోవ‌డంతో డీఎల్‌డీవో అని కొత్తగా జిల్లా స్థాయి పోస్టులు సృష్టించి బాధ్య‌త‌లు ఇచ్చారు. 20 ఏళ్లుగా ప్ర‌మోష‌న్ కోసం తిరుగుతున్న స‌ర్వే ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను తీర్చేలా కొత్త‌గా 405 పోస్టులు సృష్టించి ప్రమోష‌న్ ఇచ్చారు. ఇవ‌న్నీ అమ‌లు చేయాలంటే చంద్ర‌బాబుకి వందేళ్లు ప‌రిపాలించినా చేత‌కాదు. కులం మ‌తం ప్రాంతాలు పార్టీ అని చూడ‌కుండా అర్హ‌తే ప్రామాణికంగా న్యాయం చేసి చూపించారు. కానీ నేడు కూట‌మి పాల‌న‌లో పార‌ద‌ర్శ‌కంగా నిబంధల‌న‌ల మేర‌కు న‌డుచుకునే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. 

ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ఉద్యోగుల‌కు వేధింపులు

కూట‌మి ప్ర‌భుత్వంలో పచ్చ బిళ్ల ఉన్న‌వారికే ప‌నులు చేస్తామ‌ని మంత్రులు బాహాటంగా చెబుతున్నారు. ఉద్యోగులు స్వ‌తంత్రంగా నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌నిచేయ‌లేక బిక్కుబిక్కుమంటూ బ‌తుకుతున్నారు. తాము చెప్పిన‌ట్టు విన‌క‌పోతే కూట‌మి నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యోగుల‌ను నోటికొచ్చిన‌ట్టు తిడుతూ బెదిరిస్తున్నారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థను పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టించారు. వ‌లంటీర్ల‌తో పంపిణీ చేసిన పింఛ‌న్ పంపిణీని స‌చివాల‌య ఉద్యోగుల‌తో చేయిస్తూ వేధిస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ని అడ్డం పెట్టి స‌చివాల‌య ఉద్యోగుల‌ను టార్గెట్ చేసి వేధింపుల‌కు గురిచేస్తున్నారు. లంచాలు తీసుకోక‌పోయినా తీసుకున్నార‌ని చెప్పి క‌మిటీలు వేసి వేధిస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ స‌చివాల‌య వ్య‌వ‌స్థ తీసుకొచ్చార‌నే కోపంతో వారితో అటెండ‌ర్ డ్యూటీ నుంచి వాచ్‌మెన్ ఉద్యోగుల దాకా అన్ని ప‌నులు చేయిస్తున్నారు. ఉద్యోగుల‌నే కనీస గౌర‌వం ఇవ్వ‌కుండా కుట్ర‌పూరితంగా వారిని వేధింపుల‌కు గురిచేస్తున్నారు. ర‌క‌ర‌కాల యాప్‌ల పేరుతో టీచ‌ర్ల‌ను అడుగడుగునా వేధిస్తున్నారు. నోరెత్తి మాట్లాడితే స‌స్పెండ్, ట్రాన్స‌ఫ‌ర్ల పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. 

ఉద్యోగుల‌కు చంద్ర‌బాబు చేసిన మోసాలు 

కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ఇస్తామ‌న్నారు. మంచి పీఆర్సీ అన్నారు. ఏళ్ళు  గ‌డుస్తున్నా  క‌నీసం క‌మిటీ కూడా వేయ‌లేదు. కేబినెట్ మీటింగ్‌ల‌లో ఎక్క‌డా ప్ర‌స్తావించడం లేదు. నాలుగు డీఏలు పెండింగ్‌లు ఉన్నాయి. రూ. 30 వేల కోట్ల‌కు ఉద్యోగుల బ‌కాయిలు పేరుకుపోయాయి. ఓపీఎస్ అమ‌లు చేస్తామ‌న్నారు. దాని ఊసేలేదు. పెన్ష‌న‌ర్ల‌కు ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. దాన్ని ఇంత‌వ‌ర‌కు పట్టించుకున్న‌పాపాన పోలేదు. అంగ‌న్‌వాడీలు, ఆశా వ‌ర్క‌ర్ల వేత‌నాలు పెంచుతామ‌ని ప‌ట్టించుకోలేదు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. ప‌థ‌కాలు ఇవ్వ‌క‌పోగా ఒక‌టో తేదీనే జీతాలిస్తున్న ఆప్కాస్‌ని నిర్వీర్యం చేశారు. 93 వేల మంది జీవితాల‌ను ద‌ళారుల చేతుల్లో పెట్టారు. 2.60 ల‌క్ష‌ల మంది వ‌లంటీర్ల జీతాలు రూ. 10 వేల‌కు పెంచుతామ‌ని చెప్పి, శాశ్వ‌తంగా ఉన్న ఉద్యోగాల నుంచి ఊడ‌పెరికేశారు. హెల్త్ అసిస్టెంట్‌ల‌ను బ‌ల‌వంతంగా తొల‌గిస్తున్నారు. న‌చ్చ‌ని ఉద్యోగుల‌కు నెల‌ల త‌ర‌బడి పోస్టింగులు ఇవ్వ‌కుండా ఇబ్బంది పెడుతున్నారు. రేష‌న్ వాహ‌నాల‌ను ర‌ద్దు చేసి దాదాపు 20 వేల మంది ఉద్యోగుల కుటుంబాల‌ను రోడ్డున ప‌డేశారు. 114 ద్వారా కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేయకుండా వ‌దిలేశారు. 2019లో వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయ్యేనాటికి ప్ర‌భుత్వ బ‌డుల ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉండేది. విద్యార్ధులు నేల‌పై కూర్చోలేకుండా గ‌చ్చు ఉండేది. పైనుంచి ఎప్పుడు పెచ్చులూడి విద్యార్ధుల మీద ప‌డుతుందో తెలియ‌దు. మ‌హిళా టీచ‌ర్లు, విద్యార్ధినుల‌కు బాత్రూమ్‌లు ఉండేవి కావు. ఇలాంటి ప‌రిస్థితుల నుంచి నాడు - నేడు ద్వారా పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్ స్థాయికి అప్ గ్రేడ్ చేశారు. తాగడానికి నీళ్లు కూడా లేని ప‌రిస్థితుల నుంచి మిన‌ర‌ల్ వాట‌ర్‌, డిజిట‌ల్ క్లాస్‌రూమ్‌లు, ఐబీ సిల‌బ‌స్‌, 8వ త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు ట్యాబ్‌లు అంద‌జేసి విద్యావిప్ల‌వం తీసుకొచ్చారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక 2014-19 నాటి పాత‌రోజుల‌ను తీసుకొచ్చారు. 
ఎన్నిక‌ల్లోఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేసేదాకా ఉద్యోగుల ప‌క్షాన వైయ‌స్ఆర్‌సీపీ నిల‌బ‌డి పోరాడుతుంది.

Back to Top