తాడేపల్లి: విజయవాడలో డయేరియా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల హడావుడి పర్యటలను తప్ప.. డయేరియా వ్యాప్తి నివారణకు తీసుకున్న చర్యలేవీ కనపడ్డం లేదని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... డయేరియా వ్యాప్తికి కారణం అన్నదానిపై ప్రభుత్వం ఒక హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదు సరికదా కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని ఆక్షేపించారు. బాధితులు ఫోన్ చేస్తే కనీసం 108 కూడా అందుబాటులోకి రావడం లేదన్నారు. వారికి సరైన వైద్యం అందించేంత వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే... డయేరియా బాధిత ప్రాంతాల్లో పరిశోధనకు కనీసం ఒక వైద్య బృందం కూడా పర్యటించకపోవడం దారుణం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వినాయకచవితి మండపాల దగ్గర ఆహారం, నిల్వ ఉంచి తినడం వల్ల డయేరియా వచ్చిందని తొలిరోజు చెప్పారు. మొదటిరోజు ఉదయం 11 మంది బాధితులుంటే... సాయంత్రానికి అది 100 మందికి చేరింది. అప్పుడూ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సరైన అవగాహన కలిగించలేదు. ఒక స్కూల్లో క్యాంపు పెట్టి... చుట్టుపక్కల ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి కాలం చెల్లిన మందులు అందించారు. ఒక పేషెంట్ తనకు అందించిన మందులు మీద డేట్ ఎక్స్ ఫైర్ అయిందన్న విషయం గమనించి చెప్పేవరకు కూడా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది దాన్ని గమనించకపోవడం అత్యంత దారుణం. ఇవాల్టికి 244 మంది అధికారికంగా డయేరియా బారిన పడ్డారంటే ప్రభుత్వ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్ధం అవుతుంది. ఇంత జరుగుతుంటే ఆ ప్రాంతంలో హోటళ్లు, చికెన్ సెంటర్లు, ఇతర షాపులను క్లోజ్ చేయించిన ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉన్న వైన్ షాపు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినా పట్టించుకోవడం లేదు. కారణం ఈ ప్రభుత్వానికి వీళ్ల జేబులు నింపుకోవడానికి, వాటి ద్వారా ఆదాయం పొందడం మీద ఉన్న శ్రద్ద ప్రజల ఆరోగ్యం మీద లేదు. నాలుగు రోజులగా డయేరియాతో బాధపడుతూ నరసింహ అనే వ్యక్తి మరణించాడు. వాస్తవానికి నాలుగు రోజుల క్రితమే బాధితుడు తమ్ముడు కుటుంబం డయేరియాతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అదే ఇంటిలో ఉంటున్న నరసింహ గురించి పట్టించుకోలేదు. ఇంటింటికీ సర్వ చేశామని చెబుతున్న ప్రభుత్వం.. నరసింహను గుర్తించి సకాలంలో ఆసుపత్రిలో చేర్చి ఉంటే బాధితుడికి చికిత్స అందించి ఉండేవారు. ఇదే విషయాన్ని అడిగితే బాధితుడు మద్యం అతిగా సేవించడం వల్ల చనిపోయాడని చెబుతున్నారు. డయేరియాతో ప్రభుత్వం అన్ని షాపులను మూసివేసినప్పుడు మద్యం షాపులను మాత్రం ఎందుకు తెరిచి ఉంచింది ? ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తోంది. పాలన పూర్తిగా పడకేసింది. ● వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం వైయస్.జగన్ ప్రభుత్వంలో కొత్తగా 11 అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు గతంలో ఉన్న 29 యూపీహెచ్ సీలను ఆధునీకరించి, అన్ని రకాల మందులుతో పాటు డాక్టర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచితే.. కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్యులు, వైద్య సిబ్బంది లేరు. కాలం చెల్లిన మందులనే ప్రజలు అందిస్తున్న ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. విద్య, వైద్య రంగాలను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వైయస్.జగన్ ప్రభుత్వం హయాంలో వైద్య రంగంలో సమూల మార్పులు చేపట్టడం వల్లే... కోవిడ్ లాంటి మహమ్మారి నుంచి ప్రజలు బ్రతికి బట్ట కట్టగలిగారు. ఇలాంటి పరిపాలనలో కోవిడ్ లాంటి విపత్తు వస్తే... ఆంధ్రప్రదేశ్ తుడిచిపెట్టుకుపోయేది. తాజాగా గుంటూరులో నీటి సమస్య వల్ల 40 మందికి పైగా చనిపోయారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం సాకులు వెదుక్కుని, ఎవరో ఒకరిని బాధ్యులుగా చేసి తప్పించుకోవడం ఈ ప్రభుత్వానికి అలవాటు. పరిపాలన అయితే పూర్తిగా కుంటుపడింది. గతంలో విజయనగరం జిల్లా గుర్లలో కూడా ఇదే విధంగా డయేరియా బారిన పడ్డారు. అప్పుడు కూడా వైయస్.జగన్ నాడు నేడు ద్వారా నిర్మించిన స్కూల్ లో ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఉపయోగించుకుని వైద్యం అందించారు. ● కనీస అవగాహన లేని మంత్రులు.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నిన్న బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ... ప్రజలు బుడమేరు నీరు తాగడం వల్లే డయేరియా వచ్చిందని కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసే నీటికి, బుడమేరుకి ఏం సంబంధం..? ఆయనకు అవగాహన లేకపోతే కనీసం సిబ్బందిని అడిగి తెలుసుకోవచ్చు కదా..? బుడమేరు వరద నీరు వల్ల డయేరియా వచ్చిందని చెప్పడం చూస్తుంటే ప్రజల ప్రాణాల పట్ల అధికార పార్టీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్దం అవుతుంది. కూటమి పాలన విజయవాడ నగరానికి శాపంగా మారింది. గతేడాది వర్షకాలంలో బుడమేరు విపత్తు సంభవిస్తే.. ఇప్పుడు అదే సింగ్ నగర్ పక్కనున్న న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభించింది. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో బాధితులు 108 కు ఫోన్ చేస్తే... మేం రామని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. మీ అంతటి మీరే హెల్త్ క్యాంపులకు రమ్మని బాధ్యతారాహిత్యంగా చెబుతున్నారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం 118 మంది డిశ్చార్జ్ అయితే... ఇంకా 126 మంది జీజీహెచ్ లో చికిత్స పొందుతుండగా, మరో 16 మంది పాత జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. బయట చికిత్స పొందుతున్నవారి లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. డయేరియాకు కారణాలను ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేకపోవడం దారుణం. ఇది ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం, చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు బాధిత ప్రాంతాల్లో హడావుడి చేయడం తప్ప... వారికి సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేయర్ భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేసారు.