తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఉద్యోగుల సంరక్షణను పూర్తిగా గాలికి వేదిలేసిందని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడూతూ హెల్త్ స్కీంకు సంబంధించి ఉద్యోగులు తమ వంతు వాటా చెల్లిస్తూ కూడా వైద్యపరమైన బెనిఫిట్స్‌ను పొందలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగులపై దాడులు పెరిగిపోయాయని, పల్నాడులో పోలీస్ అధికారులపై రాజకీయ కక్షసాధింపులతో చర్యలకు తెగబడటం ఈ ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగులతో సహా మొత్తం ఉద్యోగవర్గం అంతా ఈ ప్రభుత్వ దాష్టీకాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని, ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు మారాలని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఎందుకూ పనికిరాని హెల్త్‌కార్డులు ఉద్యోగులు ప్రతినెలా తమ వంతు కంట్రిబ్యూషన్ చెల్లిస్తూ, ప్రభుత్వం నుంచి పొందిన హెల్త్ కార్డ్ ఉపయోగపడటం లేదు. ఆసుపత్రుల్లో వారికి వైద్యం నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి దీనిపై ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లుగా మారింది. ప్రకాశం జిల్లా పొదిలిలో పనిచేస్తున్న ఆర్టీసీ కండక్టర్ లక్ష్మి తన భర్తకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వైద్యం కోసం ఒంగోలు లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. హెల్త్‌కార్డ్ ఉందని చెప్పినా, వారు దానిని గుర్తించి వైద్యం చేసేందుకు నిరాకరించారు. దీనితో తన భర్తకు సదరు ఉద్యోగి తన వద్ద ఉన్న సొమ్ముతో తొలిరోజు వైద్యం చేయించారు. రెండో రోజు వైద్యం చేయించేందుకు ఆమె వద్ద డబ్బు లేకపోవడంతో ఆయనకు వైద్యం ఇచ్చేందుకు ఆసుపత్రి నిర్వాహకులు నిరాకరించి, డిశ్చార్జ్ చేశారు. దీనితో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆయన అక్కడ వైద్యం పొందుతూ మరణించారు. ఉద్యోగులు తమవంతు హెల్త్ స్కీంకు డబ్బు చెల్లించి కూడా వైద్య బీమాను పొందలేకపోవడానికి కారణం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగుల ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల ఎవరు మరణించినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎంత మంది ప్రాణాలు పోతే తప్ప ప్రభుత్వం దీనిపై కళ్ళు తెరవదని ప్రశ్నిస్తున్నాం. హెల్త్ కార్డ్‌లు పనిచేసేలా చర్యలు తీసుకోకపోతే ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించే పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసులపైన రాజకీయ కక్షసాధింపులా? గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఎవరో చనిపోతే, ఆ కేసులో టీడీపీకి అనుకూలంగా అప్పుడు పనిచేయలేదని సీఐలు జయకుమార్, శమీముల్లా లపై కూటమి ప్రభుత్వం కక్షకట్టింది. ఈ మేరకు వారిని సస్పెండ్ చేసింది. అంతేకాదు ఆనాటి పల్నాడు జిల్లా ఎస్సీ రవిశంకర్‌రెడ్డి, గురజాల డిఎస్పీ జయరాం ప్రసాద్‌లపై విచారణకు ఈ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, అడ్డగోలుగా ఉద్యోగులపై దాడులు, దాష్టీకాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం మొదలు కర్నూలు జిల్లా వరకు ఉద్యోగులపై రోజురోజుకూ దాడులు, వేధింపులు జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై అనేక దాడులు జరిగాయి. ఒక్క పోలీస్ అధికారిపైన అయినా చర్యలు తీసుకున్నారా? ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతున్నాయి కాబట్టే, మీకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు కాబట్టే వారిని ఉపేక్షించారు. మరోవైపు పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు గ్రామ, వార్డు వ్యవస్థను నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. వాలంటీర్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. జీతాలు పెంచుతామని మభ్యపెట్టి, వారిని రోడ్డున పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను గతంలో వాలంటీర్లు చేసిన అన్ని పనులు చేయాలంటూ ఇబ్బంది పెడుతున్నారు. దాదాపు ఇరవైకి పైగా ఇంటింటి సర్వేలు చేయాలని, వాట్సాప్‌లో వివరాలు నమోదు చేయాలని, ఓటీపీ తీసుకోవాలని చెబుతున్నారు. ప్రాక్టికల్‌గా ఇవి చేయడానికి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. తాము ఈ పనులు చేయలేమంటూ సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే సీఎస్‌కు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. తమ ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకపోతే ఉద్యమిస్తామని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పీఆర్సీని ఏర్పాటు చేయలేదు. డీఏలు పెండింగ్‌లో పెట్టారు. ఐఆర్ ఇవ్వడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం లేదు. పెన్షనర్స్ గురించి పట్టించుకోవడం లేదు, అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి, దాని గురించి పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బాకాయిలను పట్టించుకోవడం మానేశారు. మొత్తంగా చూస్తే ఇది ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది.