అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రైతుల సమస్యలపై చర్చకు వైయస్ఆర్‌సీపీ పట్టుబడుతోంది. రైతుల సమస్య, యూరియా అంశాలపై చర్చించాలంటూ వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో వైయస్ఆర్‌సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత సమస్య తీర్చాలని, పంటకు గిట్టుబాటు ధర సమస్య పరిష్కరించాలంటూ వైయస్ఆర్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులతో అధికార సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ ఆందోళనల నడుమ మండలిని కాసేపు చైర్మన్ వాయిదా వేశారు. అయితే.. రైతాంగం సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని, ఆ చర్చ రేపు నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో.. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజే చర్చిస్తే తప్పేముంది: బొత్స సత్యనారాయణ `ఇది రైతులకు అత్యవసరమైన చర్చ. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఈరోజు చర్చించవచ్చు కదా. రేపటిదాకా వాయిదా వేయడం ఎందుకు?. రైతాంగం తరఫున వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తోంది. గత ఐదేళ్లుగా ఎప్పుడైనా రైతులు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేశారా?. మా హయాంలో రైతులకు ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు. యూరియా కోసం ఎన్నడూ ఆందోళనలు జరగలేదు. రైతులు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అందుకే రైతుల సమస్యలపై చర్చించాలని మేం కోరుతున్నాం. రైతాంగం తరపున చర్చించడానికి రేపటిదాకా ఎందుకు?. ఈరోజే చర్చిస్తే తప్పేముంది. ఇప్పుడే సమస్య వచ్చింది కాబట్టే చర్చించమని కోరుతున్నాం` అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.