కరేడులో అదనపు భూసేకరణ జీవో రద్దు చేయాలి

మండలిలో ఎమ్మెల్సీ మాధవరావు డిమాండ్‌  

అమరావతి: కరేడు గ్రామంలో అదనపు భూసేకరణ జీవో రద్దు చేయాలని ఎమ్మెల్సీ మాధవరావు డిమాండ్‌ చేశారు. కరేడు భూసేకరణపై వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు ప్రభుత్వానికి  పలు ప్రశ్నలు సంధించారు. ఇవాళ శాసన మండలిలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మాధవరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడారు. మాధవరావు మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో ఇండోసోల్‌ సోలార్‌ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భూములనే బీపీసీఎల్‌కు ఇచ్చారని తప్పుపట్టారు. ఇండోసోల్‌కు భూములు ఇచ్చిన జీవోను ర ద్దు చేయకుండానే బీపీసీఎల్‌కు ఎందుకిచ్చారని ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు. ఇండోసోల్‌ కంపెనీని అక్కడ నుంచి కరేడుకు ఎందుకు తరలించారని నిలదీశారు. పంటలు పండే భూములను కంపెనీలకు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..ప్రభుత్వం జీవో ఎందుకు ఇచ్చిందో క్లారిటీ ఇవ్వాలని, ఎన్ని బ్లాకుల్లో భూసేకరణ చేస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

 

Back to Top