విశాఖపట్నం: వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న హాకర్ల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వారి దుకాణాలను కూల్చివేయడం దారుణమని వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో తోపుడు బండ్లు, బడ్డీల కూల్చివేతలను నిరసిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు జిల్లా అధ్యక్షులు కెకె రాజు ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీశ్రేణులు, హాకర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అడుగుడుగునా ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. జీవిఎంసీ వద్ద ర్యాలీని అడ్డుకునేందుకు కూడా పోలీసులు విఫలయత్నం చేశారు. అయినా కూడా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు, హాకర్లు తమ ఆందోళనను కొనసాగించారు. ర్యాలీ అనంతరం తోపుడు బండ్ల వ్యాపారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కెకెరాజు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే... జీవీఎంసీ అధికారులు తొలగించిన దుకాణాలేవీ అక్రమంగా ఏర్పాటు చేసినవి కావు. ఈ దుకాణాలకు గతంలో ట్రేడ్ లైసెన్స్‌లు ఇచ్చి, విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇచ్చి ఇదే అధికారులు హాకర్ జోన్లలో వ్యాపారాలను ప్రోత్సహించారు. ఇదే జీవీఎంసీ అధికారులు ప్రభుత్వం మారగానే కుట్ర పూరితంగా దుకాణాలను తొలగించడం దుర్మార్గం. జీవీఎంసీ అధికారుల దాడుల్లో దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు తక్షణం నష్ట పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం స్పందించకుంటే మేయర్, ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వం. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి వైయస్ఆర్‌సీపీ పోరాడుతుంది. అధికారులు అనుమతులిచ్చి.. వారే కూల్చేస్తారా? నగరంలో దశాబ్దాలుగా రోడ్డుపై బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు.. ఇతరత్రా మార్గాల ద్వారా వ్యాపారం చేసుకుంటూ స్వయం ఉపాధితో కుటుంబాలను పోషించుకుంటున్న వేల మందిని ఇబ్బంది పెట్టేలా కూటమి ప్రభుత్వం వ్వవహరిస్తోంది. కనీసం ముందస్తు నోటీసులివ్వకుండా వారి వ్యాపార సామగ్రిని జేసీబీలతో ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఐదు రోజులుగా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ అధికారులను ప్రశ్నిస్తూనే ఉన్నాం. చిరువ్యాపారుల పొట్టకొట్టేలా కర్కశంగా వ్యవహరిస్తున్న జీవీఎంసీ తీరును వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వారికి ప్రత్యామ్నాయ వ్యాపార మార్గాలు చూపించకుండా ఉన్నపళంగా దుకాణాలు కూల్చివేసి వెళ్లిపోమ్మంటే ఎక్కడికి పోవాలి. వారు కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులు ఈ విధ్వంసానికి తెగబడ్డారు. నిజంగా ఆక్రమణలు ఉన్నా, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారం ఉంటే వాటినే తొలగించాలి, వారిపైనే చర్యలు తీసుకోవాలి. అంతేకానీ, దానికి ఏకంగా ఫుడ్ కోర్టునే తొలగించడం దుర్మార్గపు చర్య. చిరువ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్న వారి పట్ల ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరించడం చాలా తప్పు. పైపెచ్చు జీవీఎంసీ కూల్చిన చాలా దుకాణాలకు ట్రేడ్ లైసెన్సులున్నాయి. వారంతా దశాబ్దాలుగా విద్యుత్ శాఖ కేటాయించిన మీటర్లతో కనెక్షన్ తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. అవన్నీ ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చినవి అన్నట్టుగా జేసీబీలను మోహరించి కూల్చివేయడం నోరులేని వ్యాపారుల పట్ల ప్రభుత్వ చిన్నచూపుకి నిదర్శనం. గతంలో ఉన్న జీవీఎంసీ కమిషనర్లే స్వయంగా హాకర్ జోన్ల పేరుతో స్థలాలు కేటాయించి నంబరింగ్ ఇచ్చి, ట్రేడ్ లైసెన్స్‌లు ఇచ్చి అధికారికంగా ప్రభుత్వమే వ్యాపారాలను ప్రోత్సహిస్తే కూటమి ప్రభుత్వం మాత్రం కర్కశంగా వాటిని తొలగించేసింది. రోడ్డున పడ్డ 40 వేల కుటుంబాలు ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా విశాఖ నగరంలో దాదాపు 40 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. డైలీ ఫైనాన్స్, ముద్ర లోన్స్, వైయస్సార్ చేయూత, చేదోడు ద్వారా లోన్లు పొంది చాలా మంది మహిళలు వ్యాపారాలు చేసుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. సొంత కాళ్లపై నిలబడాలనుకున్న మహిళలను ఈ ప్రభుత్వం వేధిస్తుంది. వీరంతా ఇప్పుడు లోన్లు కట్టేదారి లేక అల్లాడిపోతున్నారు. దుకాణాల్లో ఉన్న వారి ఫ్రిజ్‌లు, గ్రైండర్లు, మిక్సీలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం స్పందించకుంటే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బాధితుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మేయర్, ఎమ్మెల్యేలు, ఎంపీలను అడ్డుకుంటాం. వారికి చేతనైతే నగరంలో బడా బాబులు చేస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలి. అంతేకానీ రెక్కాడితే కానీ డొక్కాడని చిరువ్యాపారులపై విరుచుకుపడటం దుర్మార్గం. ఓటేసి గెలిపించిన ప్రజలను క్షోభకు గురిచేయడం చాలా తప్పు. తక్షణం కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు వీధి వ్యాపారులకు క్షమాపణలు చెప్పి వారికి నష్టపరిహారం చెల్లించాలి. దుకాణాల కూల్చివేతకి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేకపోయినా పూర్తి రాజకీయ కారణాలతో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మరో ప్రాంతం మీద వివక్ష చూపుతున్నారు. అమరావతి కోసం విశాఖను పణంగా పెడుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతం మీద సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతికి పెట్టుబడులు రావనే ఆలోచనతో కుట్రపూరితంగా నిత్యం విశాఖలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి కోసం విశాఖ అభివృద్ధిని పణంగా పెట్టడం దుర్మార్గం. విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలను ఇలా అలజడులు సృష్టించడం ద్వారా పరోక్షంగా బెదిరించి వెనక్కి పంపే కుట్ర జరుగుతోంది. పేదవాడిని ఎప్పటికీ పేదవాడిగా ఉంచడమే వారి లక్ష్యం. పేద వారు స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడితే కూటమి నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో విశాఖలో వచ్చిన పెట్టుబడులన్నీ బోగస్‌వే. ఏదోరకంగా పెట్టుబడుల పేరుతో ఇక్కడి విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి సంపదను అమరావతికి తరలించుకుపోతున్నారు. ఇక్కడి భూములను తనఖా పెట్టి బ్యాంకు లోన్లు తీసుకుని అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారు. 2014-19 మధ్య ఎలాగైతే ఎయిర్‌పోర్టు నుంచి బీచ్ రోడ్డు వరకు రోడ్డుకి ఇరువైపులా నాలుగు రకాల మొక్కలు నాటి, డివైడర్లకు రంగులేసి అదే అభివృద్ధి అన్నట్టు ప్రచారం చేసుకున్నారు. అదే కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు.