తాడేపల్లి: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్ముకుంటున్న పాపానికి ఒడిగడుతున్న సీఎం చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలబడిపోతాడని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... దేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రోత్సహించడానికి 2014 లోనే కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాన్ని ప్రారంభిస్తే, ఆ సమయంలో సీఎంగా ఉండి కూడా చంద్రబాబు దానిపై కనీసం ఆలోచన కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15, 2023లో ఒకేసారి అయిదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం ద్వారా సీఎంగా వైయస్ జగన్ సరికొత్త చరిత్రను సృష్టించారని అన్నారు. ప్రజల నుంచి మెడికల్ కాలేజీల అమ్మకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పీపీపీ అంటూ దానిని సమర్థించుకునే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఎమన్నారంటే... ● దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం. దేశ చరిత్రలో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా ఏకంగా రూ.8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైయస్.జగన్ శ్రీకారం చుడుతూ... ఒకే సంవత్సరం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించిన ఘనత మా నాయుడుకు వైయస్.జగన్ కు దక్కుతుంది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఐదు మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను సుమారు రూ.8500 కోట్ల ఖర్చుతో నిర్మించాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా రెండో దశ కింద 2024-25లో పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల లోనూ, మూడో దశ కింద 2025-26 విద్యాసంవత్సరం నాటికి పిడుగురాళ్ల, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం లలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించాం. విద్యా భద్రతతో పాటు, ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ఈ దిశగా అడుగులు వేసిన ఘనత వైయస్.జగన్ కే దక్కుతుంది. ఇవి కేవలం కాలేజీలు మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్య భవిష్యత్ దిశగా వేసిన అడుగులగా రాష్ట్ర ప్రజలందరూ భావించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముద్రగా ప్రజలు ఇవాల్టికీ గుర్తుంచుకుంటారు. ప్రతి వైద్య కళాశాలను 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలోనే ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించాం. వైద్య ఆరోగ్య రంగంలో ఇంత గొప్ప ఆలోచన చేస్తే.. దీనిమీద కూటమి పార్టీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం దారుణం. ఈ కాలేజీలకు సంబంధించిన ఫండ్ టై అప్ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ● మెడికల్ కాలేజీల ఫండ్ టైఅప్... ఇప్పటికే ప్రారంభమైన విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ ఐదు వైద్య కళాశాలలు చూస్తే... విజయనగరం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం నాబార్డ్ తో టై అప్ తోనూ, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల కాలేజీ కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సాయంతో టై అప్ చేయగా, మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం సాయంతో ఏర్పాటు చేశాం. రెండో దశ కింద 2024-25లో నిర్మాణం చేయాలనుకున్న పాడేరు మెడికల్ కాలేజీ కేంద్ర ప్రాయోజిత పథకం కింద టై అప్ చేయగా, నాబార్డ్ టై అప్ తో మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల కాలేజీల నిర్మాణానికి టై అప్ చేశాం. ఇక మూడో దశ కింద 2025-26లో నిర్మాణ లక్ష్యంగా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం కింద, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీలను నాబార్డ్ నిధులతో నిర్మాణానికి టై అప్ చేయడం జరిగింది. ఇవన్నీ ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి చేసుకున్న ఫైనాన్సియల్ టైఅప్ వివరాలను చాలా స్పష్టంగా ప్లాన్ చేసి.. ఆ దిశగా పనులు పూర్తి చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి వైయస్.జగన్ మార్గదర్శకత్వంలో ఆడుగులు వేశాం. ● అయినా కూటమి దుష్ప్రచారం... అయితే గడిచిన కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలపై విపరీతమైన దుష్ప్రచారం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి చక్కటి వైద్య సేవలు, ఆరోగ్య, విద్యా భద్రత అందించాలన్న ఉద్దేశ్యంతో రూ.8,500 కోట్ల అంచనా నిర్మాణ వ్యయంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైయస్.జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించుకున్నాం. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వీటి నిర్మాణంపై పెట్టిన శ్రద్ద వల్ల రెండో దశలో నిర్మాణం జరుపుకుంటున్న పాడేరు మెడికల్ కాలేజీకి కూడా 50 సీట్లు వచ్చాయి. మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ కూడా ఏజన్సీ ప్రాంతంలో విద్యార్ధులకు వైద్య విద్య అభ్యసిందేందుకు అవకాశాలు కల్పించాలి, గిరిజన ప్రాంతం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఆలోచన చేయలేదు. కేవలం వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో మాత్రమే ఈ ఆలోచన చేసి... దాన్ని సాకారం కూడా చేశాం. ఇప్పుడు పాడేరు మెడికల్ కాలేజీ విజయవంతంగా నడుస్తుంది. మరోవైపు పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా ఎన్ ఎం సి 50 సీట్లు మంజూరు చేస్తే.. ఆ సీట్లు మాకు వద్దు, రద్దు చేయండి అంటూ తిరిగి లేఖ రాసిన దుర్మార్గ ప్రభుత్వమిది. దేశ చరిత్రలో మంజూరైన మెడికల్ సీట్లు మాకు వద్దంటూ తిరిగి ఎన్ ఎం సీకి లేఖ రాసిన మొదటి ప్రభుత్వమది. కేవలం వైయస్సార కుటుంబం మీద ఉన్న కోపాన్ని, అక్కడున్న ప్రజలు మీద చూపిస్తూ... వారికి అత్యుత్తమమైన వైద్య విద్యను, వైద్య సేవలను కూటమి ప్రభుత్వం అందకుండా చేసింది. ● సీట్లు వద్దంటూ లేఖ రాసిన దుర్మార్గ ప్రభుత్వమిది 2024 జనవరి నాటికి మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పురోగతిని సమగ్రంగా పరిశీలిస్తే... విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలను వైయస్.జగన్ ప్రభుత్వంలో ప్రారంభించారు. ఇక రెండో దశలో అనుకున్న పాడేరు మెడికల్ కాలేజీకి కూడా 50 సీట్లు అందుబాటులోకి రావడంతో ఆయా కాలేజీల్లో తరగతులు విజయవంతంగా జరుగుతున్నాయి. మరోవైపు పులివెందుల మెడికల్ కాలేజీ కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటే... దానిపైనా కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా అనేక అబద్దాలు చెబుతోంది. కేవలం వైయస్సార్ కుటుంబం మీద, వైయస్.జగన్ మీద ఉన్న కక్షతో వాళ్లకు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో , ఆ పేరు చెరిపేయాలన్న కుట్రతో వచ్చిన మెడికల్ సీట్లనే వద్దంటూ ఎన్ ఎమ్ సీ కి అత్యంత దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. రెండో దశలో నిర్మాణం చేసుకుంటున్న ఆదోని వంటి మెడికల్ కాలేజీల్లో వైయస్సార్ ప్రభుత్వ హయాంలో మేజర్ వర్క్స్ పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న కొద్దిపాటి పనులను కొనసాగించి ఉంటే గతేడాది మరో 5 కాలేజీల నిర్మాణం పూర్తి అవ్వడం ద్వారా మరో 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చేవి. ఈ పనులు చేయకుండా వదిలేయడం వల్లే ఈ ఏడాది మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాకపోవడానికి కారణం పూర్తిగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే. మూడో దశలో నిర్మాణ లక్ష్యంగా ఉన్న ఆదోని, మదనపల్లి, పిడుగురాళ్ల, అమలాపురం, బాపట్ల మెడికల్ కాలేజీల్లో పనులు పూర్తిగా నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. భూసేకరణ, నిధుల సమీకరణ వంటి మేజర్ అడ్డంకులన్నీ వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసినా కూడా కాలేజీల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసింది. ఒకవైపు చాలా స్పష్టంగా ఆయా మెడికల్ కాలేజీ పనులు కనిపిస్తుంటే... కొంతమంది మంత్రులు ఉద్దేశపూర్వకంగా వీటిని విస్మరించి... వెదుక్కుని మరీ కొన్ని చోట్ల స్విమ్మింగ్ పూల్స్ కట్టారంటూ విమర్శించే పనిచేయడం సిగ్గుచేటు. ● అధికారంలోకి రాగానే పనుల నిలిపివేతకు ఆదేశాలు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో ఇచ్చిన ఆదేశాలను చూస్తే.. ఉద్దేశపూర్వకంగా నిర్మాణ పనులను నిలిపివేసిందన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మూడో దశలో నిర్మాణం జరుపుకుంటున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఎపీఎంస్ఐడీసీ చీప్ ఇంజనీర్ పేరుతో సెప్టెంబరు 2, 2024న అధికారకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో చాలా స్పష్టంగా... ఆదోని, పెనుగొండ మెడికల్ కాలేజీ అన్ని నిర్మాణపనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ చేయడానికి కంటే ముందే కూటమి ప్రభుత్వం పూర్తిగా మెడికల్ కాలేజీ పనులను నిలిపివేయాలని నిర్ణయించుకునే ఈ ఆదేశాలు జారీ చేసి.. ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలను నాణ్యమైన వైద్యాన్ని దూరం చేయడంతోపాటు, వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న పేద విద్యార్ధుల ఆశలను అడియాసలు చేస్తూ .. పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తూ మీకు సంబంధించిన వ్యక్తులను కట్టబెట్టాలన్న కుట్ర చేస్తున్నారు. మీరు ముందుగా నిర్ణయించుకున్న కుట్ర ప్రకారం ఈ మెడికల్ కాలేజీలు పూర్తైతే...ఆ మంచి పేరు వైయస్.జగన్ కు వస్తుందన్న అక్కసుతో నిర్మాణ పనులను నిలివేయడంతో పాటు వాటిని ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు. తద్వారా ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ నిర్ణయం పట్ల ప్రజల్లో విపరీతమైన ఆందోళన నెలకొంది. వైద్య విద్య మనకు అందని ద్రాక్ష అన్న బాధ వేలాది మంది పేద విద్యార్ధుల్లో నెలకొంది. ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం గురించి పూర్తిగా అర్ధం అయింది. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేస్తుందన్న ప్రజల్లో విపరీతంగా చర్చ నడుస్తోంది. దీంతో ఉలిక్కిపడ్డ కూటమి ప్రభుత్వంలోని ఈ శాఖతో సంబంధం లేని మంత్రులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయో కూడా తెలియకుండా అపహాస్యం చేసి మాట్లాడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే మీ హయాంలో వైద్య కళాశాలల పనులు నిలిపివేయాలన్న ఆదేశాలు ఎందుకు ఇచ్చారు ? కేవలం వైయస్. జగన్ చేసిన మంచి ప్రజల్లోకి వెళ్లకూడదన్న దుగ్ధతో... చివరకి కూటమి ప్రభుత్వం ఎంతకు బరితెగించిందంటే... ఉన్న కాలేజీలను కూడా అక్కడేం లేవు అని గ్రాఫిక్స్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరే స్వయంగా వైద్య కళాశాలల నిర్మాణ పనులను నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలపై ఏం సమాధానం చెప్తారు ? మీరు ప్రజల్లోకి వెళ్లండి, వాళ్లే సమాధానం చెప్తారు. ● మీ హయాంలో ఒక్క కాలేజీ లేదు చంద్రబాబూ గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి, ప్రస్తుతం కూడా అదే పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు.. మీ పదవీకాలంలో ఏనాడైనా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేశారా? ఆ పని చేయలేదు సరికదా.. వైయస్.జగన్ హయాంలో నిర్మాణం చేసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రవేటైజేషన్ ముసుగులో అమ్మే ప్రయత్నం చేస్తూ స్కామ్ కు పాల్పడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రజలకు ఎందుకు దూరం చేస్తున్నారు? మీరు చేస్తున్న పని ముమ్మాటీకి తప్పు, దీనిపై ప్రజల పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధంగా ఉంది. ● మెడికల్ సీట్లు అమ్మకానికి కుట్ర.. మరోవైపు ఈ మెడికల్ కాలేజీల మార్కెటింగ్ కోసం మరో ఎత్తుగడ వేశారు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో జీవో నెంబరు 108 ప్రకారం కేటగిరీ ఏ అంటే జనరల్ కేటగిరీలో 50 శాతం ప్రీ సీట్లు ఉంటాయి. ఇక కేటగిరీ బి కింద సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భాగంగా రూ.12 లక్షల ఫీజు నిర్ణయించాం. మెడికల్ కాలేజీల్లో ప్రపంచస్ధాయి ప్రమాణాలు కల్పించడంతో పాటు, ఆ కాలేజీ సెల్ఫ్ సస్టెయిన్ సాధించే దిశగా రూపుదిద్దడానికి కేటగిరీ బి కింద సెల్ఫ్ పైనాన్స్ విధానంలో ఈ ఫీజు నిర్ణయించాం. ఈ నిర్ణయంపై అప్పడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ జీవో రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఇవాళ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటి 17 నెలలు అయింది.. ఎందుకు దీనిపై మాట్లాడ్డం లేదు? ఇక కేటగిరీ సీ లో ఎన్ ఆర్ ఐ కోటగిరీ కింద 15 శాతం సీట్లను ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రూ.20 లక్షలు ఫీజు నిర్ణయించాం. ఇవాళ పీపీపీ విధానంలో కూటమి ప్రభుత్వం.. ఎన్ ఆర్ ఐ కేటగిరీ కోటా సీట్లలో ఒక్కొక్కటి రూ.57.50 లక్షలకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ప్రయివేటు కాలేజీల్లో ఎన్ ఆర్ ఐ కేటగిరీలో మెడికల్ సీటు రూ.40 లక్షల వరకు ఉంటే.. అంత కంటే రూ.20 లక్షలు ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి నిర్ణయించింది. ఈ భారం మొత్తం వైద్య విద్య అభ్యసించాలనుకునే తల్లిదండ్రుల మీద మోపడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజల మీద సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనతోనే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ప్రజారోగ్యాన్ని గాలికొదిలేయడం, వైద్య విద్య చదవాలనుకుంటున్న విద్యార్ధుల భవిష్యత్తును వారి తలరాతకే వదిలిపెట్టాలన్న దుర్మార్గమైన ఆలోచన చేస్తోంది. ● అవగాహన లేని మంత్రులు... ఇది చాలదన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కనీస అవగాహన లేకుండా.. మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగంలో కొనసాగించలేకపోవడానికి కారణం మీ తప్పిదాలేనని, కాలేజీల నిర్మాణాలకు మీరు సరైన ఫండింగ్ చూపించలేదని, కాలేజీల నిర్మాణం సరిగ్గా లేదని.. అందుకే మేం ప్రైవేటీకరణకు వెళ్లక తప్పడం లేదని మా పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్ కు పచ్చి అబద్దాలతో లేఖ రాశారు. అందుకే మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి మా ప్రభుత్వ హయాంలో జరిగిన పురోగతి, ఫండ్స్ టై అప్ గురించి వాస్తవాలను పూర్తిగా ప్రజలకు వివరించాం. కూటమి ప్రభుత్వ మంత్రులు చేస్తున్న దుష్ర్పచారాలను ఆధారాలతో సహా తిప్పికొట్టాం. ప్రజలకు వాస్తవాలు తెలుసు. వైయస్.జగన్ చేసిన మంచి పనులు ప్రజలకు తెలుసు. కావాలంటే నేరుగా క్షేత్రస్దాయిలో ఆయా మెడికల్ కాలేజీల దగ్గరకు వెళ్తే మరిన్ని వాస్తవాలు తెలుస్తాయి. నిజానికి చాలా రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఉత్తరాఖండ్, హరిద్వార్ లలో 2023లో పీపీపీ విధానంలో మార్చడానికి ప్రయత్నిస్తే ప్రజలు దాన్ని వ్యతిరేకించడంతో ఆయా ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. క్షేత్రస్దాయిలో ఇన్ని అనుభవాలు కనిపిస్తుంటే... ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆరోగ్యాన్ని, విద్యార్ధుల భవిష్యత్తును మోసం చేసే పనికి ఒడిగడుతున్న కూటమి ప్రభుత్వ తీరును విడదల రజని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ.. పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మా నాయకుడు వైయస్.జగన్ హెచ్చరించిన విధంగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేస్తామని తేల్చి చెప్పారు.