ప్ర‌జారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కార్  

న్యూ రాజ‌రాజేశ్వ‌రి పేట‌లో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులు

నామమాత్రపు వైద్యసేవలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం

ప్ర‌భుత్వ తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల ఆగ్ర‌హం
 
విజయవాడ లోని న్యూ రాజరాజేశ్వరి పేటలో పర్యటించి డ‌యేరియా బాధితుల‌ను పరామర్శించిన‌ అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు. 

మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు దేవినేని అవినాశ్‌, స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త గ‌జ్జ‌ల సుధీర్ భార్గ‌వ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు, మొండితోక జ‌గ‌న్‌మోహ‌న్‌ రావు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, షేక్ ఆసిఫ్‌, వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ర‌విచంద్ర‌ త‌దిత‌రులు

ఇప్ప‌టికే 700 ల‌కు పైగా డ‌యారియా కేసులు న‌మోదు

గ‌ణేశ్ నిమ‌జ్జ‌నాల వ‌ల్లేనంటూ కూట‌మి త‌ప్పుడు ప్ర‌చారం 

ఐదు రోజులైనా ఇప్ప‌టికీ క‌లుషిత మంచినీరే స‌ర‌ఫ‌రా 

ఆ నీటిని తాగ‌లేక‌ పోతున్నామంటున్న కాల‌నీ వాసులు

కాల‌నీ ప‌రిస్థితులపై వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్దార‌ణ బృందం గ్రౌండ్ రిపోర్టు

విజ‌య‌వాడ‌: విజయవాడ నగరంలో ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం మండిపడింది. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో డయోరియాతో వణికిపోతున్న న్యూ రాజరాజేశ్వరీ పేటలో పార్టీ ప్రతినిధి బృందం పర్యటించింది. అక్కడి రోగులను, స్థానికులను పరామర్శించి, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశిబిరం, అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించింది. దాదాపు ఏడు వందలకు పైగా డయోరియా కేసులు నమోదైన నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి, అత్యవసర వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని పార్టీ ప్రతినిధి బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. నామమాత్రపు వైద్య సేవలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తింది. ఈ ప్రతినిధి బృందంలో ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు దేవినేని అవినాశ్‌, స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త గ‌జ్జ‌ల సుధీర్ భార్గ‌వ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు, మొండితోక జ‌గ‌న్‌మోహ‌న్‌ రావు, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, రాష్ట్ర నాయకులు షేక్ ఆసిఫ్‌, వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ర‌విచంద్ర‌ త‌దిత‌రులు ఉన్నారు. అనంతరం వారు అక్కడే మీడియాతో మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే...

● నాయ‌కుల మ‌న‌సంతా విజ‌య‌వాడ ఉత్స‌వ్ మీద‌నే :  ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు దేవినేని అవిశాశ్ 

ఐదు రోజులుగా విజ‌య‌వాడ ప్ర‌జ‌లు డయేరియాతో ఇబ్బంది ప‌డుతున్నారు. హెల్త్ క్యాంపులు తూతూమంత్రంగా నిర్వ‌హిస్తుండటంతో బాధితులు ప్రైవేటు ఆస్ప‌త్రుల్ని న‌మ్ముకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. బాధితులు ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు పెట్టి అప్పుల‌ పాల‌వుతున్నారు. అయినా బాధితుల‌ను ఆదుకోవడానికి వైద్యారోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్‌, మున్సిపల్ శాఖ మంత్రి నారాయ‌ణ‌, స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు బాధ్య‌త తీసుకోవ‌డం లేదు. ఏటా విజ‌య‌వాడ న‌గ‌రంలో డ‌యేరియా కేసులు ప్ర‌బ‌లుతున్నా క‌ట్ట‌డికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. ఎంత‌సేప‌టికీ విజ‌య‌వాడ ఉత్స‌వ్ పేరుతో భూములు దోచుకోవ‌డం, కమీష‌న్లు తీసుకోవ‌డం మీద‌నే కూట‌మి నాయ‌కుల శ్ర‌ద్ద క‌నిపిస్తోంది. 40 ఏళ్ల అనుభ‌వం ఉంద‌ని, విజ‌న‌రీన‌ని చెప్పుకునే ముఖ్య‌మంత్రికి సాధార‌ణ డ‌యేరియాని అరిక‌ట్ట‌డం చేత‌కావ‌డం లేదు. ఇప్ప‌టికైనా మృతుల కుటుంబాలను ప్ర‌భుత్వం ఆదుకోవాలి. 

● వైఫ‌ల్యాల‌ను కప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం :  స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్టర్ గ‌జ్జ‌ల సుధీర్ భార్గ‌వ్ రెడ్డి

మా పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల‌తో న్యూ రాజరాజేశ్వరి పేటలో ప‌ర్య‌టించడం జ‌రిగింది. కాల‌నీలో ఏ ఇంటికి వెళ్లినా అక్క‌డికి స‌ర‌ఫరా చేస్తున్న‌ క‌లుషిత తాగునీటిని బాటిళ్ల‌తో చూపిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తీవ్ర‌మైన దుర్గంధంతో కూడిన ఆ నీటిని ఎలా తాగాల‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. కాల‌నీలో మురుగుతో నిండి పొంగిపోర్లుతున్న అప‌రిశుభ్ర‌మైన డ్రైనేజీల‌ను చూపిస్తున్నారు. రోజురోజుకీ  డ‌యేరియా కేసుల సంఖ్య పెరుగుతున్నా ఇప్ప‌టికీ కార్పొరేష‌న్ నుంచి ఇదే నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. తాగునీరు ఇంత దారుణంగా క‌నిపిస్తున్నా (స‌ర‌ఫ‌రా అవుతున్న నీటిని బాటిల్‌లో చూపించారు) అయితే త‌మ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు పానీ పూరీలు తిన‌డం వ‌ల్ల‌, గ‌ణేశ్ నిమ‌జ్జనం స‌ద‌ర్భంగా ఫుడ్ పాయిజ‌న్ అయింద‌నీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు క‌ట్టుక‌థ‌లు అల్లడం సిగ్గుచేటు. మీ ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం 270 మంది బాధితులున్న‌ట్టు చెబుతున్నా రెండు వీధుల్లోనే 700 మందికి పైగా బాధితుల‌ను మేం గుర్తించాం. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉండ‌టం మ‌రింత బాధ క‌లిగించే విష‌యం. ఇప్ప‌టికే న‌లుగురైదుగురు చ‌నిపోయార‌ని స్థానికులు చెబుతున్నారు. మృతులంతా డ‌యేరియా ప్ర‌బ‌లి జ్వ‌రం, వాంతులు, విరేచ‌నాలు వంటి ల‌క్ష‌ణాల‌తోనే చ‌నిపోయిన‌ట్టు వారి కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఇప్పటికే గుంటూరు రూర‌ల్ మండ‌లంలో తాగునీటి క‌లుషితమై దాదాపు 45 మందికిపైగా చ‌నిపోయినా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం రావ‌డం లేదు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా స్పందించి ఇంటింటికీ సుర‌క్షిత మంచి నీటిని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాలి. వాట‌ర్ ట్యాంక‌ర్ల‌ను క్లీన్ చేసి దాదాపు సంవ‌త్స‌రం దాటిపోయింద‌ని స్థానికులు చెబుతున్నారు. వాటిని త‌క్ష‌ణం శుభ్రం చేయించాలి. అప్ప‌టి వ‌ర‌కు ట్యాప్ వాట‌ర్ స‌ర‌ఫ‌రాను నిలిపివేయాలి. రోజువారీ వాడ‌కానికి సైతం నీటిని ట్యాంక‌ర్ల‌తో స‌ర‌ఫ‌రా చేయాలి. వాటర్ శాంపిల్స్‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ టెస్ట్ చేయాలి. బాధితులంద‌ర్నీ ఆదుకునే వ‌ర‌కు వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుంది. 

● తాగునీటిని ప‌రీక్ష చేయ‌కుండా స‌ర‌ఫ‌రా చేస్తున్నారు  :  మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ మొండితోక జ‌గ‌న్‌మోహ‌న్‌ రావు 

గ‌తేడాది కూట‌మి ప్ర‌భుత్వంలో విజ‌య‌వాడ‌లో ఇదే త‌ర‌హాలో డయేరియా కేసులు న‌మోద‌య్యాయి. ఈసారి అదే పరిస్థితులు నెల‌కొన్నాయి. రాజ‌ధానిగా చెప్పుకునే విజ‌య‌వాడ‌లో వ‌రుస‌గా ఇలాంటి ప‌రిస్థితులు రావ‌డం ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌నం. గ‌త వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఐదేళ్ల‌లో ఎప్పుడూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన దాఖ‌లాలు లేవు. గ్రామ స‌చివాల‌యాల్లో వాట‌ర్ టెస్టింగ్ కిట్లు ఇచ్చి ఎప్ప‌టిక‌ప్పుడు తాగునీటిని టెస్టు చేసేవాళ్లం. ఇప్పుడా ప‌రిస్ధితులు క‌నిపించ‌డం లేదు. 40 అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లు, 5 వేల మంది శానిట‌రీ వ‌ర్క‌ర్లు, 225 మంది శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్లు ఉండి కూడా ఈ ప‌రిస్థితులు ఉన్నాయంటే ప్ర‌జారోగ్యం ప‌ట్ల ఈ ప్ర‌భుత్వానికి శ్ర‌ద్ధ లేద‌ని చెప్ప‌డానికి ఇంత‌క‌న్నా రుజువులు ఇంకేం కావాలి? బాధితులు ఆస్ప‌త్రుల చుట్టూ తిరిగి ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. రాజ‌ధాని ప్రాంతంలో డ‌యేరియా ప్ర‌బ‌లితే బాధితుల‌కు క‌నీసం ఉచిత‌ వైద్య స‌దుపాయాలు కూడా అందించ‌లేని స్థితిలో ఈ ప్ర‌భుత్వం ఉందంటే ఇంత క‌న్నా దారుణం ఇంకోటి ఉందా?  ప్ర‌జారోగ్యం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు ఇలా బాధ్య‌త లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు కాబ‌ట్టే మెడిక‌ల్ కాలేజీలను ప్రైవేటుప‌రం చేస్తున్నాడు. ప‌దే ప‌దే త‌ప్పులు చేస్తూనే ఉన్నాడు కానీ ఆ త‌ప్పుల నుంచి ప్ర‌భుత్వం పాఠాలు నేర్చుకోవ‌డం లేదు. ప్ర‌జారోగ్యాన్ని కాపాడ‌లేక‌పోతే, ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం చేత‌కాకుంటే చంద్ర‌బాబు త‌క్ష‌ణ‌మే సీఎం పద‌వికి రాజీనామా చేసి దిగిపోవాలి.  

● అంబులెన్స్‌లు లేవు, పిల్ల‌ల డాక్ట‌ర్లు లేరు: మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు
 
డ‌యేరియా కేసులు ప్ర‌బలిన నేప‌థ్యంలో ఐదు రోజులుగా బాధితుల ప‌క్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతోంది. వారికి స‌రైన వైద్యం అందించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తూ వ‌చ్చాం. ఈ రోజుకీ కార‌ణాల‌ను చెప్ప‌డానికి ప్ర‌భుత్వానికి ధైర్యం చాల‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారి ఆదేశాల‌తో డాక్ట‌ర్ల‌తో కూడిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల బృందం న్యూ రాజ‌రాజేశ్వ‌రీ పేట‌లో పర్య‌టించ‌డం జ‌రిగింది. కాల‌నీలో ప‌ర్య‌టిస్తుంటే బాధితుల ప‌రిస్థితి హృద‌య విదార‌కంగా ఉంది. ప్ర‌భుత్వం త‌మను ప‌ట్టించుకోవ‌డం లేదని బాధితులు త‌మ గోడును వెళ్ల‌బోసుకుంటున్నారు. ఇప్ప‌టికీ ఎన్యుమ‌రేష‌న్ పూర్తి చేయ‌లేకపోవ‌డం ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌నం. ఒక కాలనీలో ప్ర‌బ‌లిన డ‌యేరియా కేసుల్ని నియంత్ర‌ణ చేయ‌లేక‌పోయిన ప్ర‌భుత్వం రానున్న ద‌స‌రా ఉత్స‌వాల‌కు వ‌చ్చే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ఎలాంటి సౌక‌ర్యాలు క‌ల్పిస్తారోన‌న్న అనుమానాలు క‌లుగుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నా మెడిక‌ల్ క్యాంపులో పిల్ల‌ల డాక్ట‌ర్ల‌ను పెట్ట‌లేదు. క‌నీసం అంబులెన్స్ స‌దుపాయాలు కూడా క‌ల్పించ‌లేని స్థితిలో ప్రభుత్వం ఉంది. వైద్యారోగ్య‌శాఖ మంత్రి అవగాహ‌న లేకుండా బుడ‌మేరు గురించి మాట్లాడుతూ ప్ర‌జ‌ల్ని మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నారు. ప్ర‌జ‌ల నుంచి ఆస్తి ప‌న్ను వ‌సూలు చేయ‌డంలో చూపించే శ్ర‌ద్ద వారికి సుర‌క్షిత మంచినీరు స‌ర‌ఫ‌రా, పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌లో క‌నిపించ‌డం లేదు. ప‌రిస్థితి అదుపులో ఉంద‌ని ప్ర‌భుత్వం చెప్పుకుంటున్నప్ప‌టికీ గ‌త మూడు రోజుల్లోనే 700 ల‌కు పైగా కేసులు న‌మోదు కావ‌డం ప‌రిస్థితి తీవ్రత‌కు అద్దం ప‌డుతోంది. ఐదు రోజుల త‌ర్వాత కూడా ఓవ‌ర్ హెడ్ ట్యాంకు ద్వారా స‌ర‌ఫరా చేసే నీరు కూడా బుర‌ద‌మ‌యంగా ఉంటోందంటే తాగునీటి స‌ర‌ఫ‌రాలో ఎంత నిర్ల‌క్ష్యంగా ఉందో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్ర‌జారోగ్యం ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన మంత్రి స‌త్య‌కుమార్ త‌క్ష‌నం రాజీనామా చేయాలి. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లంద‌రికీ సుర‌క్షిత మంచినీటిని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాలి. ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించ‌క‌పోతే వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున గ‌వ‌ర్న‌ర్ ని క‌లిసి ఫిర్యాదు చేయ‌డం జ‌రుగుతుంది.

Back to Top