తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైందని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమిద్దామని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, విద్యార్ధి, యువజన, డాక్టర్స్ వింగ్ అధ్యక్షులు హాజరయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైయస్ జగన్ గొప్ప సంకల్పంతో ముందుకెళ్ళారు, కేవలం ప్రేవేట్ వారికి కట్టబెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ ఒప్పందాలకు సిద్దమయ్యారు. పైకి పీపీపీల వల్ల నష్టం లేదంటున్నారు కానీ గట్టిగా వైయస్ జగన్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు పైకి దబాయింపులు, హడావిడి చేస్తూ జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అసలు రూపం బయటపడాలి, ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వల్ల ప్రజలు ఎలా నష్టపోతారో చెప్పగలగాలి, మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ రాకపోతే ఆయా ప్రాంతాల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో తెలియజేయాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మధ్య చర్చ జరగాలి. ఆయా ప్రాంతాల సెంటిమెంట్‌ను గౌరవించాలి. వైయస్ జగన్ గారి హయాంలో ఏ విధంగా లబ్ధిజరిగింది అనేది ఇప్పుడు ప్రైవేటీకరణ వల్ల ఎలా నష్టపోతున్నారు అనేది చర్చ జరగాలి. రిటైర్డ్ ఎంప్లాయిస్, టీచర్స్, మేధావులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను బాగస్వాములను చేసి చర్చ జరగాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుని విస్తృతంగా ప్రచారం చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలను బాగస్వామ్యం చేయాలి. పార్టీలోని సీనియర్ నాయకులను సమన్వయం చేసుకోవాలి. జనమే చర్చించుకునేలా వారిని ఉత్తేజపరచాలి. చంద్రబాబు ఈ నిర్ణయం వెనక్కు తీసుకునేంతవరకూ మనం పోరాడాలి. ప్లానింగ్, కోఆర్డినేషన్ జరగాలి. ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి మనం సీరియస్‌గా ఉద్యమిద్దాం. దీనిపై విస్తృతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుద్దాం. అన్ని మెడికల్ కాలేజీల వద్దకు పార్టీ నాయకులు వెళ్ళి వాస్తవాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళదాం. మనతో కలిసి వచ్చే పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకుని ముందుకెళదాం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తే ఏ విధమైన లబ్ధి జరుగుతుందనేది అందరికీ తెలిసిందే, విద్యార్ధులు, యువత, తల్లిదండ్రులు, అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొద్దాం. చంద్రబాబు ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేవరకూ ఉద్యమిద్దాం. ఈ అంశంపై పార్టీ సీనియర్ నాయకులు కోన రఘుపతి, గుడివాడ అమర్‌నాథ్, పి.రవీంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ సీదిరి అప్పలరాజు, నిసార్ అహ్మద్, ఎస్ వి మోహన్ రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అన్నా రాంబాబు, ఉషాశ్రీచరణ్, పరీక్షిత్ రాజు, వై సాయిప్రసాద్ రెడ్డి, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పెట్ల ఉమాశంకర్ గణేష్, డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని, దీనిని మరింతగా తీసుకెళతామన్నారు. మీడియా, సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు ఆలోచనను ప్రజల ముందుంచుతామన్నారు. పేదల పక్షాన ఉన్న వైయస్ జగన్ గారి వైఖరి, పెత్తందారులకు వంతపాడుతున్న చంద్రబాబు తీరును ప్రజల ముందుకు తీసుకెళతామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలు 1. పార్వతీపురం - పార్వతీపురం మన్యం జిల్లా 2. నర్సీపట్నం - అనకాపల్లి జిల్లా 3. అమలాపురం - డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 4. పాలకొల్లు - పశ్చిమగోదావరి జిల్లా 5. బాపట్ల - బాపట్ల జిల్లా 6. మార్కాపురం - ప్రకాశం జిల్లా 7. మదనపల్లె - అన్నమయ్య జిల్లా 8. పెనుకొండ - శ్రీ సత్యసాయి జిల్లా 9. ఆదోని - కర్నూలు జిల్లా 10. పులివెందుల - వైఎస్సార్ జిల్లా