శ్రీకాకుళం: ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ మొత్తాన్ని చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం ప్రయివేటుకు అప్పగించే ప్రయత్నం అత్యంత దుర్మార్గమని వైయస్ఆర్‌సీపీడాక్టర్స్ విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఏకంగా కేబినెట్ లోనే ప్రభుత్వ వైద్య కాలేజీలతో పాటు ఆరోగ్యశ్రీ ప్రయివేటీకరణ చేస్తూ.. నిస్సిగ్గుగా ప్రభుత్వ ఆస్తులను ఆమ్మేసి, అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వం దేశంలో మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయివేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ● ఒక విభాగాన్నే ప్రయివేటీకరణ చేస్తున్న దౌర్భాగ్య ప్రభుత్వమిది వైద్యరంగంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలు, దుర్మార్గాలు పరాకాష్టకు చేరాయి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఈ ప్రభుత్వ వైఖరిని కచ్చితంగా గమనించాలి. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ఒక విభాగాన్నో, సంస్ధనో ప్రయివేటీకరణ చేయడం సహజం. కానీ దేశంలో ఎవ్వరికీ సాధ్యపడని విధంగా, మొట్టమొదటిసారిగా ఏకంగా ఒక శాఖనే ప్రయివేటుకు అప్పగిస్తున్న దౌర్బగ్య చరిత్ర చంద్రబాబు నాయుడుదే. వైద్య, ఆరోగ్యశాఖలో ఉన్న అన్ని వ్యవస్థలనూ ఇదే బాటపట్టిస్తున్నాడు. కేబినెట్ సమావేశంలోనే మెడికల్ కాలేజీలను ప్రయివేటుపరం చేయాలన్న నిర్ణయంతో పాటు, ప్రభుత్వ పరంలో ఉన్న ట్రస్ట్ విధానం నుంచి ఆరోగ్యశ్రీని, ప్రయివేటు బీమా సంస్థలకు కట్టబెట్టాలన్న దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటే... ఎల్లో పత్రికల్లో చంద్రబాబు నాయుడు కొత్తగా పది ప్రయివేటు మెడికల్ కాలేజీలు పెడుతున్నట్టు కవరింగ్ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు రాయడానికి కొద్దిగానైనా సిగ్గుండాలి. ఇవాళే చంద్రబాబు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నట్టు భ్రమ కల్పించేలా మీ వార్తలు రాస్తున్నారు. ఈ ప్రభుత్వం పీపీపీ విధానంలో ఇస్తున్నవి ప్రయివేటు మెడికల్ కాలేజీలు కావు, ఓ దార్శినికుడి ఆలోచనను మీరు అమ్మకానికి పెడుతున్నారు. వైద్య ఆరోగ్యరంగంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజారంజక ఆలోచనను చంద్రబాబు ఇవాళ అమ్మకానికి పెడుతున్నాడు. ఇదే నిజం. వైద్య ఆరోగ్యరంగంలో మీరు ప్రభుత్వ ఆధీనంలో ఏం ఉంచుతున్నారు చంద్రబాబూ? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూ... డిజిటల్ నెర్వ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజారోగ్య రంగంలో ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్లు గొప్ప మార్పులు తీసుకువస్తాయనుకుంటే... వాటితో కేవలం ఎలక్ట్రానికి హెల్త్ కార్డులు జారీ చేయిస్తామని చెపుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 1.43 కోట్ల మందికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు జారీ చేశాం. ● వైయస్సార్ హాయంలోనే హెల్త్ సిటీల నిర్మాణం ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న ఏరియా ఆసుపత్రులను ఏం చేద్దామనుకుంటున్నారు చంద్రబాబూ? జిల్లా కేంద్ర ఆసుపత్రులను, కమ్యానిటీ హెల్త్ సెంటర్లను ఏం చేద్దామనుకుంటున్నారు? వాటన్నింటికీ తాళాలు వేస్తారా ? ఇలాంటి వెర్రి ఆలోచనలు ఎవరిస్తున్నారు?. ప్రైమరీ, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్లకు తాళాలు వేసి, పీపీపీ విధానంలో ఆసుపత్రులు కడతారా? మెగా గ్లోబల్ మెడ్ సిటీ నిర్మాణం అంటున్నారు. నిజానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే విశాఖపట్నంలో హెల్త్ సిటీ పేరుతో ఎస్ ఈ జెడ్ ఏర్పాటు చేస్తే... ఆ ప్రాంతంలో అద్భుతంగా ప్రయివేటు ఆసుపత్రులన్నీ వచ్చాయి. దానికి కొనసాగింపుగానే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏపీఐఐసీ తరహాలో భూములిచ్చి... హెల్త్ సిటీలు ఏర్పాటు చేసి, ఆసక్తి ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులకు ఉచితంగా భూములిచ్చారు. కొన్ని చోట్ల ప్రారంభం కూడా అయ్యాయి. వాటిని మీరు ఎందుకు కొనసాగించడం లేదు చంద్రబాబు నాయుడు గారూ? ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తూనే.. ప్రయివేటు సంస్దలకివ్వాల్సిన రాయితీలు వారికివ్వండి. ఇదే కదా అభివృద్ధి విధానం. అలా కాకుండా అన్ని స్ధాయిల్లోనూ వైద్య రంగంలో ఉన్న ఆసుపత్రులన్నీ అమ్మేయాలన్న దుర్మార్గమైన ఆలోచన ఎందుకు చేస్తున్నారు. అన్నీ ప్రయివేటు పరం చేస్తే కమిషనర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్, సీఈఓలు, ఎండీలు ఎందుకు? ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలెవరూ అడగరని ధీమా, అడిగితే కేసులు పెట్టాలన్న దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై మాట్లాడితే ప్రత్యేక చర్యల కోసం చట్టం తీసుకొస్తామని చెబుతున్నారు. అదే నిజమైతే మీరు గత ఐదేళ్లలో మాట్లాడిన అబద్దపు, నికృష్టపు మాటలపై మీ మీద కూడా చర్యలు తీసుకోవాలి.యూరియా గురించి, రైతుల గురించి మాట్లాడితే కేసులు నమోదు చేయమంటారా ? మీ పత్రికల్లోనే యూరియా కొరతపై వార్తలు రాస్తున్నారు, వారి మీద కూడా కేసులు పెట్టండి. చంద్రబాబు నేతృత్వంలోని దౌర్భాగ్య ప్రభుత్వం మొత్తం వైద్య ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి పెడుతుంది. ● వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో నిర్మాణం ప్రారంభమయ్యాయి. అన్ని రాష్ట్రాలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వద్ద మాకు మెడికల్ కాలేజీలు కావాలని పోటీ పడుతుంటే... ఉన్న కాలేజీల్లో సీట్లు మాకు వద్దంటున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబునాయుడిదే. వైయస్ జగన్ మోహన్ రెడ్డిహయాంలో 2023-24లో విజయనగరం, నంద్యాల, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరులో 5 మెడికల్ కాలేజీలు 750 సీట్లతో అదృష్టవశాత్తూ ప్రారంభమయ్యాయి లేదంటే వాటిని కూడా పీపీపీ మోడ్ లో మార్చేవారు. 2024-25లో పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోనిలో మరో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం దిశగా... దాదాపు నిర్మాణాలు పూర్తి చేసుకుంటే ఆ కాలేజీలను అమ్మేయాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గం. 2025-26 సంవత్సరానికి సంబంధించి పిడుగురాళ్ల, పెనుగొండ, పాలకొల్లు, పార్వతీపురం, నర్సీపట్నం, బాపట్ల, అమలాపురం మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రణాళిక వేసి.. రూ.8,400 కోట్లు బడ్జెట్ తో ఫైనాన్షియల్ టై అప్ చేసి.. రూ.2,400 కోట్లు ఖర్చు చేశాం. రానున్న రెండు మూడు సంవత్సరాల్లో మరో రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తే 12 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఇంత చక్కటి విధానాన్ని రూపొందిస్తే... వాటిని పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వానికికున్న పోయేకాలం ఏమిటి? ● కేవలం రూ.2వేల కోట్ల కేటాయించాలేరా ? పాడేరు గిరిజన ప్రాంతం కావడంతో ఎన్ ఎం సీ దయతలచి 50 సీట్లు ఇచ్చింది. అన్నింటికన్నా అత్యంత చంఢాలమైన విషయం ఏమిటంటే.. పులివెందులలో మీరు ఎన్ ఓ సీ ఇస్తే.. లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇస్తామని ఎన్ ఎం సీ చెబితే... మాకు వద్దు, అక్కడ మేం కాలేజీ ప్రారంభించడం లేదని చెప్పిన నీచమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం. ఎవరైనా మెడికల్ కాలేజీలు, సీట్లు వద్దని చెబుతారా, ఎక్కడైనా ఇలాంటి ప్రభుత్వాన్ని చూశామా? ఇదేమిటని అడిగితే కేసులు, జైలు, అరెస్టులా? ఇదెక్కడి ప్రభుత్వం. రెండేళ్లలో 12 మెడికల్ కాలేజీల కోసం రూ.6వేల కోట్లు ఖర్చు పెట్టలేరా? ఏడాది పాలనలోనే మీరు చేసిన రూ.2లక్షల కోట్లు అప్పు ఏం చేశారు? మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బులు ఎందుకు పెట్టడం లేదు. డబ్బుల్లేవన్న పేరుతో ప్రయివేటు పరం చేస్తూ, మీ సొంత మనుషులకు కాలేజీలు అప్పగించడమా పరిపాలనా? దీన్ని విజన్ అంటారా? ఈ తరహా వ్యక్తులతో కూడిన ఎల్లో మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం. మీరు చేసిన రూ.2 లక్షల కోట్ల అప్పుకు అదనంగా మరో రూ.6 వేల కోట్లు అప్పు చేసుకొండి, కానీ 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రం పూర్తి చేయాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. పేద, మధ్యతరగతి ప్రజల కోసం మాత్రం మీరు ఖర్చు చేయలేరా? విశాఖకు మణిహారంలాంటి కళ్లు చెదిరిపోయే రుషికొండలో నిర్మాణాలను వృధా అంటున్నారు. మీరు అలాంటి నిర్మాణాలు చేయగలరా? అమరావతి కడతారో, ముంచుతారో మీ ఇష్టం, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం మాత్రం చేసి తీరాల్సిందే. మీ బంధులకో, చుట్టాలకూ కట్టబెట్టడానకి పీపీపీ విధానం అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యవాదులు అంగీకరించరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై కచ్చితంగా పోరాటం చేస్తుంది. పీపీపీ విధానంలో తీసుకోవడానికి ముందుకొచ్చిన వారిందరికీ... ఒక్కటే హెచ్చరిస్తున్నాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఎంఓయూలన్నీ రద్దు చేయడం ఖాయం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికో వైద్య కాలేజీ ఉండాలన్న గొప్ప దార్శినికతతో వాటిని నిర్మిస్తే... మీరు వాటిని ప్రయివేటు పరం చేయడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు. ● ఆరోగ్యశ్రీ ప్రయివేటు పరం - ఎవరి లబ్ది కోసం? ఆరోగ్యశ్రీని ప్రయివేటు పరం చేసి, ఇన్సూరెన్స్ మోడల్ లోకి తీసుకువెళ్తామని కేబినెట్ లో మరో దౌర్భాగ్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి మేలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు?. మీ అవినీతి కోసమా? లంచాలు కోసమా ? ఆరోగ్యశ్రీని దివంగత వైయస్సార్ గారు ప్రారంభించినప్పుడు ఇన్సూరెన్స్ మోడల్ లోనే ప్రారంభించినప్పుడు అనేకమైన సమస్యలు వచ్చాయి. క్లెయిమ్ లు అంగీకరించకపోవడం, ప్రీమియమ్ అధికంగా ఉండడం, సరైన సర్వీసు అందకపోవడంతో ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో సేవలందించడం మొదలుపెట్టారు. దేశమంతా ఈ మోడల్ ను అనుసరించారు. కేంద్రం కూడా రాష్ట్రాలకు ఆ మేరకు స్వేచ్చ నిస్తూ... తమకు నచ్చిన విధానం అమలు చేసుకోవచ్చని చెప్పింది. ట్రస్టు విధానంలో ప్రజలకు మంచి జరుగుతుంటే.. మీరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రయివేటు కంపెనీలు లాభాల కోసం పనిచేస్తారే తప్ప, ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రారు. పారిశ్రామిక ప్రమాదాలును ఇన్సూరెన్స్ కంపెనీ అంగీరిస్తుందా? అదే ప్రభుత్వ ఆధీనంలో అయితే తనకున్న విచక్షణాధికారాలను వినియోగించుకుని వారికి చికిత్స అందిస్తుంది. గుంటూరు జిల్లా తురకపాలెంలో సంభవిస్తున్న వరుస మరణాలు లాంటి ఉదంతాల్లో ప్రయివేటు కంపెనీలు టేక్ అప్ చేయాడనికి ముందుకు రావు. మరి ఎవరికి లబ్ది చేకూర్చడానికి ఈ తరహా విధానాలంటే కేవలం మీ అనుయాయులకు కాంట్రాక్టులిచ్చి లంచాలు, వాటాలు తీసుకోవడానికి మీరు వేసిన స్కెచ్ ఇది. 108, 104 సర్వీసులను గతంలో సత్యం పౌండేషన్, జీఎమ్మార్, అరబిందో ఈఎమ్మెఆర్ ఐ వంటి అనుభవజ్ఞులు చేస్తే.. ఈ ప్రభుత్వంలో అనుభవమే లేని భవ్య పౌండేషన్ కు అదనపు సర్వీసుల పేరుతో అధిక ధరకు కేటాయించారు. ఇప్పుడు 108,104 సర్వీసుల సౌండ్ వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని ప్రయివేటుకు కట్టబెడుతున్నారు. ● ఎవరి జేబులు నింపడానికి ఇన్సూరెన్స్ మోడల్ రాష్ట్ర ప్రజలకు మా విజ్ఞప్తి ఒక్కటే. గత ప్రభుత్వ ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కోసం మొత్తం రూ.13,004 కోట్లు ఖర్చు పెడితే, కోవిడ్ సమయంలో రూ.743 కోట్లు మినహాయిస్తే... మిగిలిన రూ.12,260 కోట్లు ఖర్చు చేశాం. అంటే 1.43కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.2,450 కోట్లు ఆరోగ్యశ్రీ ఖర్చయింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ విధానంలో చూస్తే... ఈ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం సరాసరి ఒక కుటుంబానికి రూ.2,500 చొప్పున 1.43 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.3,575 కోట్లు ఖర్చవుతుంది. అంటే ఆరోగ్యశ్రీ కంటే ప్రయివేటు ఇన్సూరెన్స్ లో రూ.1100 కోట్లు అదనపు ఖర్చు. అలా కాకుండా ప్రభుత్వం చెప్పినట్లు 1.63 లక్షల కుటుంబాలకు లెక్కిస్తే రూ.4075 కోట్లు ఖర్చవుతుంది. అంటే మీరు చెబుతున్న ఇన్సూరెన్స్ విధానంలో ప్రభుత్వానికి అదనపు ఖర్చు, ప్రజలకు మంచి సర్వీసులు అందే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇది కూడా రూ.2.50 లక్షల క్లెయిమ్ వరకు మాత్రమే వర్తిస్తుంది. రూ.2.50 లక్షల పైబడి రూ.25 లక్షల వరకు అయితే దానికి మరలా ట్రస్టు విధానంలో నిధులు వెచ్చిస్తామని చెబుతున్నారు. దానికి అదనంగా ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి ఎంత అదనపు ఖర్చు అవుతుందో ప్రజలు గమనించాలి. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ ఇన్సూరెన్స్ కమ్ హైబ్రిడ్ మోడల్ అనుసరించబోతున్నారో సమాధానం చెప్పాలి. ఇంతటి నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రభుత్వ ఆస్తులను ఆమ్మేసి, అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వం దేశంలో మరొకటి ఉండదు. మీరు చేస్తున్న అవినీతిపై మాట్లాడితే కేసులు నమోదు చేసి జైల్లో పెడతారా? ● చంద్రబాబూ మీ కళ్లబొల్లి మాటలు చాలించండి. కళ్లు ఎర్రగా చేసి, పళ్లు బిగించి ముఖ్యమంత్రే మీ సంగతి తేల్చుతాం, ప్రభుత్వం మీద ప్రచారం చేస్తారా అని మాట్లాడుతున్నారు. గతంలో మీరు చేసిన దుష్ప్రచారం మాటేంటి ? ఇప్పటికీ మీరు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు ఇంకా రూ.3750 కోట్లు బకాయిలు ఉన్నారు. గతేడాదిలో 26 సార్లు ప్రయివేటు నెట్ వర్క్ ఆసుపత్రుల మీకు బకాయిలు కోసం రిక్వెస్ట్ చేసారు. గతంలో మీరు దుష్ర్పచారం చేసి, ఇప్పుడు నీతి, నియమాలు మీకు గుర్తుకురావడం చాలా ఆశ్చర్యకరం. చంద్రబాబు గారూ మీ అసత్యపు, అబద్దపు, అలవికాని హామీలతో ప్రజలను మోసం చేసారనుకుంటే... ఈవీఎంల ద్వారా మోసం చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలి. పీ 4 మోడల్ అనే మరో దౌర్భాగ్య విధానంతో ప్రజలను మరలా ధనికుల దగ్గర తాకట్టు పెట్టే విధానమే ఇది. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకుని పేదలను ధనికుల ముందు మోకాళ్ల మీద కూర్చో బెట్టే విధానమే పీ 4 మోడల్. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారూ.. పేద విద్యార్ధులకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు తీరుపై ఎందుకు ప్రశ్నించడం లేదు. చంద్రబాబు గారూ మీ హయాంలో ఒక్క పోర్టూ లేదు, హార్భర్ నిర్మాణమూ లేదు, ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ కట్టిందీ లేదు.. ఇకనైనా మీ కళ్లబొల్లి మాటలు చాలించాలని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రయివేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరుపై వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు.