తాడేపల్లి: విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో వైయస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు హెచ్చరించారు. కూటమి సర్కార్ తీరుకు నిరసనగా అన్ని జిల్లాలలో అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్సీ సెల్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయం ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, అన్ని జిల్లాల ఎస్సీ విభాగం అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మాణాలు చేశారు. దళిత ప్రజల ఇబ్బందులు, వారిపై కూటమి ప్రభుత్వ వేధింపులపై తక్షణమే స్పందించాలి. రాష్ట్ర స్ధాయి నుంచి సమన్వయం చేసుకుంటూ వివిధ అంశాలపై, దళితుల సమస్యలపై ముందుండి పోరాడి వారికి న్యాయం జరిగేలా చూడాలి. ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేసుకుని కమిటీల నియామకాలన్నీ త్వరగా పూర్తి చేయాలి. సోషల్ మీడియా వేదికగా మన దళితుల గళాన్ని బలంగా వినిపించాలి. ఎస్సీ విభాగం నాయకులంతా చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా నాయకులకు పార్టీ నేతలు దిశానిర్దేశం చేశారు.