తాడేపల్లి: ఈ నెల 8 న దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నిర్ణీత షెడ్యూల్‌లోగా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పూర్తిచేయాలని సూచించారు. ఆదివారం వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్), పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు (కోఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే... బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది, అన్ని జిల్లాల నుంచి మంచి స్పందన వచ్చింది. మన పార్టీ అధినేత జగన్ గారు కూడా పరిశీలించి చక్కగా జరుగుతున్నాయన్నారు. ఇదే ఊపుతో నియోజకవర్గం, మండలం, గ్రామస్ధాయి వరకు వెళ్ళాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం చేసుకుంటూ అన్ని చోట్లా దిగ్విజయం చేయాలి. టీడీపీ వారు సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళుతున్నామంటూ తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మొక్కుబడిగా కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రతి ఇంటికీ తిరిగే పరిస్ధితి లేదు. మన ఇంటికి వస్తున్న టీడీపీ నాయకులను నిలదీయాలంటే మన కార్యక్రమం అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి కావాలి. ప్రస్తుతం మనం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ స్ధాయిలో మన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత మండలస్ధాయిలో ఈ నెల 13 నుంచి 20 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. మనకు వస్తున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం ఇప్పటివరకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది. ఇదే ఉత్సాహంతో ఈ కార్యక్రమం పూర్తిచేయాలి. అప్పుడే ప్రజల్లో చైతన్యం వస్తుంది. పార్టీ క్యాడర్‌కు కూడా మంచి సందేశం వెళుతుంది. మండల స్ధాయి తర్వాత జులై 21 నుంచి ఆగష్టు 4 వరకు నాలుగో దశలో గ్రామస్థాయిలో జరుగుతుంది. ఈ లోపు కమిటీల నియామకాలు అన్నీ పూర్తి చేయాలి. అనుబంధ విభాగాలలో ప్రధాన విభాగాలు కూడా సమన్వయం చేసుకోవాలి. పార్టీలో చురుగ్గా పనిచేయాలనుకునే వారిని గుర్తించి వారికి కమిటీలలో అవకాశమివ్వాలి. పార్టీ కేంద్ర కార్యాలయం, సీనియర్ నాయకుల సహకారం అందుబాటులో ఉంటుంది. స్ధానిక సంస్ధలలో పదవుల్లో ఉన్న వారిని కూడా గుర్తించి పార్టీ కమిటీలలో ప్రాధాన్యమివ్వాలని నియోజకవర్గ నాయకులకు సూచిస్తున్నాం. గ్రామ కమిటీల నియామకం పూర్తవగానే బూత్ కమిటీలపై దృష్టి పెట్టాలి. అందరి డేటా, ప్రొఫైల్ అంతా కూడా సెంట్రల్ ఆఫీస్ నెట్‌వర్క్‌కు అనుసంధానించాలి. పార్టీ కార్యక్రమాలను సక్సెస్ చేయాలంటే అన్ని స్ధాయిలలోని నాయకులు చిత్తశుద్దిగా పనిచేసినప్పుడే విజయవంతం అవుతాయి. గ్రామ కమిటీలు కూడా ఆగష్టులో పూర్తవ్వాలి. ఈ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం పూర్తవ్వాలి, జాప్యం జరగకూడదు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేని కారణంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఈ నెల 8 న దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. రాష్ట్రస్ధాయి నుంచి జిల్లా స్ధాయి, నియోజకవర్గ స్ధాయిలో అందరూ సమన్వయం చేసుకోవాలి. ప్రతి ఒక్కరి మధ్య సమన్వయంతో అన్ని అనుబంధ విభాగాలు కలిసి పనిచేసి జయంతి కార్యక్రమాలను, వివిధ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్ళాలన్నారు. అనంతరం టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మండల స్ధాయిలో చేపట్టే కార్యక్రమం కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయనున్నట్లు తెలిపారు. జిల్లాల స్ధాయిలో మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇదే ఉత్సాహంతో కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని, జిల్లా స్ధాయిలో మనం ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా నిర్ణీత కాల వ్యవధి లోనే పూర్తిచేస్తున్నామన్నారు. పార్టీ ఆదేశించిన షెడ్యూల్ ప్రకారం అన్నీ ప్రజల్లోకి తీసుకెళుతున్నాం. ప్రతి గడపకూ తీసుకెళతాం, టీడీపీ వాళ్ళు గడప గడపకు వెళ్ళలేకపోతున్నారు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం 'బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీకి' వస్తున్న స్పందన టీడీపీ నాయకులకు చెమటలు పట్టిస్తుందన్నారు.