విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కి అడ్డాగా మారిపోయిందని వైయస్ఆర్‌సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. విశాఖపట్నం లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి టీడీపీనేతల కనుసన్నల్లోనే రాష్ట్రంలో మాదకద్రవ్యాల మార్కెటింగ్ విచ్చలవిడిగా జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి నుంచి ప్రమాదకరమైన డ్రగ్స్ వరకు నేడు ఏపీ ఒక హబ్‌గా మారిపోయిందని అన్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడుతున్న టీటీడీకి చెందిన వారిని కాపాడేందుకే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. వాస్తవాలు ఇలా ఉంటే నిత్యం చంద్రబాబుకు భజన చేసే ఈనాడు ప్రతిక మాత్రం మాదకద్రవ్యాలపై కూటమి ప్రభుత్వాన్ని వెనుకేసుకురావడం, వైయస్ఆర్‌సీపీపై బుదరచల్లేందుకు తప్పుడు రాతలు రాయడం ఆ పత్రిక దిగజారుడుతనంకు నిదర్శనమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... రాష్ట్రంలో కొకైన్ వంటి మాదకద్రవ్యాలు కూడా చాలా సులభంగా అందుబాటులో ఉన్నాయంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. మొన్న విశాఖలో 25 గ్రాముల కొకైన్ ని ప్రభుత్వ యూనివర్సిటీ సమీపంలో పట్టుకున్నామని పోలీసులే వెల్లడించారు. అయితే ఈ డ్రగ్స్ కేసుతో తెలుగుదేశం నాయకులకు అనుచరులుగా ఉన్న కొంతమందికి సంబంధం ఉందని, వారిని తప్పించేందుకు అమాయకుల్ని ఒప్పించి బలిచేశారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మాకున్న సమాచారం ప్రకారం డ్రగ్స్ దొరికిందని చెబుతున్న ప్రాంతం కూడా ప్రభుత్వ యూనివర్సిటీ కాదు. ప్రైవేటు విద్యాసంస్థ ప్రాంగణంలో ఈ కొకైన్ దొరికింది. ఆ విద్యాసంస్థ క్రెడిబులిటీని కాపాడటం కోసం ప్రభుత్వ యూనివర్సిటీపై తప్పుడు కథనాలు రాయడం దారుణం. ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పూనుకోవడం మరింత సిగ్గుచేటు. పదిరోజుల క్రితం విశాఖలో గంజాయి దొరికితే కూటమి పార్టీకి చెందిన కీలకనేతలు దాన్ని బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. నాటి మా ప్రభుత్వంపై డ్రగ్స్ పేరుతో బురదజల్లారు నాటి మా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం మీద బురదజల్లడం కోసం ఈ రాష్ట్రం డ్రగ్స్‌కి అడ్డాగా మారిందని, ఒక కంటైనర్‌లో వచ్చిందని డ్రగ్స్ అని 49 నమూనాలు పరిక్షిస్తే కొకైన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని ఎన్నికలకు ముందు టీడీపీ భజన పత్రిక ఈనాడులో అసత్య కథనాలు అచ్చేసి ప్రచారం చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం మీద బురదజల్లడమే ధ్యేయంగా, తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా, ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్ అంటూ ఈనాడు వరుస పెట్టి అసత్య కథనాలు రాసింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కంటైనర్లలో వచ్చింది గంజాయి కాదని, అది ఈస్ట్ అని నిర్ధారణ అయ్యింది. 2019లో వైయస్ఆర్‌సీపీఅధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి గంజాయిని నిర్మూలించి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగుచేసుకునేందుకు ప్రభుత్వం సహాయం చేసింది. అంతకుముందెన్నడూ లేనివిధంగా గంజాయి సాగును అరికట్టగలిగిగాం. చెక్‌పోస్టుల వద్ద గంజాయి తరలించేవారిపై పటిష్టమైన నిఘా పెట్టాం. డ్రగ్స్‌పై 'ఈనాడు' రెండు నాలుకల దోరణి కూటమి ప్రభుత్వం ఏర్పడితే 100 రోజుల్లో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లాంటి ఎలాంటి మాదకద్రవ్యాలు లేకుండా సమూలంగా నిర్మూలిస్తామని ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకున్నారు. కానీ కూటమి ఏడాది పాలన పూర్తయినా గంజాయిని నిర్మూలించలేదు సరికదా ప్రమాదకరమైన అత్యంత ఖరీదైన డ్రగ్స్ కూడా చాలా సులభంగానే రాష్ట్రంలో లభ్యమవుతున్నాయి. మొన్ననే విశాఖలో కొకైన్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఒక వైద్యుడు దొరికిపోయాడని పోలీసులే వెల్లడిస్తే, ఈనాడు పత్రిక మాత్రం రాష్ట్రంలో మాదకద్రవ్యాల ఆనవాళ్లేలేవన్నట్టు చంద్రబాబు పాలన పొగుడుతూ అడ్డగోలుగా అబద్ధాలతో వార్తను అచ్చేసింది. ఇదే పత్రికలో 2024 మే 28న గంజాయి స్మగ్లర్ల బరితెగింపు, డీఎస్పీని జీపుతో ఢీకొట్టి పరారయ్యారని రాశారు. జూలై 14, 2024న టీడీపీ నేత గంజాయి సాగు, 27 ఆగస్టు 2024న విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో 1360 కిలోల గంజాయి స్వాధీనం అని కథనాలు రాశారు. అక్టోబర్ 2024న టోల్‌గేట్‌ను ఢీకొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్, అక్టోబర్ 19, 2024న సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పం కేంద్రంగా గంజాయి గుప్పు, 23 నవంబర్ 2024న సంస్కృత వర్సిటీలో గంజాయి సాగు, డిసెంబర్ 3, 2024న అంగట్లో గంజాయి చాక్లెట్లు అంటూ వార్తను ఈనాడులోనే రాశారు. జనవరి 2025న గుంటూరులో కొకైన్ కలకలం, ఈ ఏడాది జనవరిలోనే చిలకల్లు చెక్‌పోస్టు వద్ద 218 కిలోల గంజాయి స్వాధీనం అని వార్త రాశారు. ఇలా ఏడాది కాలంగా ఎక్కడపడితే అక్కడ గంజాయి, వివిధ రూపాల్లో లభ్యమవుతోంది. సరఫరా చేస్తూ చాలా మంది పట్టుబడుతున్నారు. పోలీసులు సైతం టన్నుల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఏడాది కాలంగా ఈ వార్తలన్నీ రాసిన ఈనాడే ఇప్పుడు మాదకద్రవ్యాలు నిర్మూలించినట్టు రాయడం సిగ్గుచేటు. ఇప్పుడే కాదు గతంలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో విశాఖ గంజాయికి అడ్డాగా మారిందని ఆనాడు మంత్రులుగా ఉన్న గంటా, అయ్యన్నపాత్రుడే స్వయంగా చెప్పారు.