బంగారుపాళ్యెం: చిత్తూరు జిల్లాలో మద్దతుధర లేక తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతుకు అండగా నిలిచేందుకు మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వస్తుండటంతో కూటమి ప్రభుత్వంలో కలవరం మొదలైందని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైయస్ జగన్ రాక సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంసీ విజయానంద్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడలు వంచైనా మామిడి రైతులకు న్యాయం చేయిస్తామని స్పష్టం చేశారు. ఇంకా వారేమన్నారంటే... వైయస్ జగన్ వస్తుండటంతో ప్రభుత్వంలో కలవరం: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వైయస్ జగన్ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా వస్తుండటంతో కూటమి ప్రభుత్వం కంగారు పడుతోంది. ఇప్పటి వరకు మామిడి రైతులను ఆదుకోవడంలోనూ, వారికి మద్దతు ధర కల్పించడంలోనూ ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు వైయస్ జగన్ వస్తున్నాడని తెలిసి, ఆయన పర్యటనకు అనేక ఆటంకాలు కల్పించారు. పోలీస్ అనుమతులు ఇవ్వడంలోనూ పలు అభ్యంతరాలు కల్పించారు. సీఎం చంద్రబాబు హుటాహుటిన చిత్తూరు జిల్లాకు వచ్చి రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామంటూ వాగ్ధానాలు చేయడం, దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకోవడం చేశారు. కానీ వాస్తవానికి ఎక్కడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందడం లేదు. పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం రెండున్నర లక్షల టన్నల మామిడిని కేంద్ర సహకారంతో కేజీ రూ.16 కి కొనుగోలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కేవలం రూ.4 మాత్రమే. ఇది చంద్రబాబు అసమర్థత కాదా? ధర లేదని పంటను తోటల్లోనే కోయకుండా వదిలివేసిన రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం ప్రకటించాలి. మామిడి రైతులను బెదిరిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ సునీల్ వైయస్ జగన్ పర్యటన సందర్భంగా కూటమి పార్టీల నేతలు రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆయన పర్యటన కోసం రోడ్ మ్యాప్, హెలిప్యాడ్ ఏర్పాట్ల పైనా పోలీసులు ఇబ్బందికరంగా వ్యవహరించారు. గ్రామాల్లోకి వెళ్లి వైయస్ జగన్‌ను కలవకూడదంటూ రైతులకు ఆంక్షలు విధిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం మద్దతు ధర కల్పించడంలో విఫలమైంది, మరోవైపు వారి కష్టాలను తెలుసుకునేందుకు వచ్చే వైయస్ జగన్‌ను కూడా అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గం కాదా? వైయస్ జగన్ రాక కోసం మామిడి రైతుల ఎదురుచూపులు : ఎంసి విజయానంద్‌రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైయస్ జగన్ పర్యటన కోసం చిత్తూరు మామిడి రైతులు ఎదురుచూస్తున్నారు. తమ కష్టాలను ఆయనతో చెప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను ఎంతగా బెదిరించినప్పటికీ పెద్ద సంఖ్యలో రైతులు ఆయనను కలిసేందుకు, తమ కష్టాలను చెప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారు. మామిడి మార్కెటింగ్‌పై అవగాహన లేని సర్కార్ : మాజీ ఎమ్మెల్యే, బియ్యపు మధుసూధన్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో సిండికేట్ల కారణంగా మామిడి రైతులు నిలువునా దగా పడుతున్నాడు. కనీసం అధికంగా పండిన మామిడి పంటను ఎలా మార్కెట్ చేయాలో కూడా చంద్రబాబుకు అవగాహన లేకపోవడం దురదృష్టకరం. చంద్రబాబుకు మొదటి నుంచి రైతులంటేనే మంట. రైతులకు మేలు చేసే ఏ అంశాన్ని ఆయన పట్టించుకోరు. అసమర్థతపై ప్రశ్నిస్తారని భయపడుతున్న ప్రభుత్వం : జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న జేడీఎస్ పార్టీ కేంద్రానికి ఒక లేఖ రాస్తే కేజీ రూ.16కి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ ఏపీలో 21 మంది కూటమి పార్టీల ఎంపీలు ఉండి కూడా కేంద్రం నుంచి మామిడి రైతులకు న్యాయం చేయించలేక పోతున్నారు. తమ అసమర్థతను ఎత్తి చూపుతారనే భయంతోనే వైయస్ జగన్ వస్తుంటే ఈ ప్రభుత్వం భయపడుతోంది.