తాడేపల్లి: డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నది ఐదేళ్ల మూడు నెలలే! కానీ మంచి చేయాలన్న మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే నిరూపించారు. పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారు. ముందుచూపు, చకచకా అభివృద్ధితో ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచారు. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన ఆ వైతాళికుడే మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని అజేయుడి 76వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం ఇదీ.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ ఐదేళ్ల మూడు నెలలపాటు మాత్రమే పని చేశారు. కానీ.. ఆ కొద్ది కాలంలోనే పాలకుడికి మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో చేతల్లో చూపించారు. సమగ్రాభివృద్ధివైపు ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. వైయస్ఆర్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు. 2004 నుంచి 2009 వరకు గ్రామాల్లో పరిస్థితి: 2004–2005 నుంచి సకాలంలో వర్షాలు, సకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల, ఒడిదుడుకులు లేకుండా పంటల దిగుబడి, వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల పెంపుతో రైతుల ఆదాయం పెరిగి కూలీలకు డిమాండ్ పెరిగి పల్లెల్లో ఆదాయం పెరగడంతో చిన్నవ్యాపారుల వ్యాపారాభివృద్ధి, గణనీయంగా భూమి విలువలు పెరుగుదల, వైద్యనాథన్ కమిటీ సిఫార్సులతో సహకార సంఘాలు మూతపడకుండా కాపాడుట కోసం రూ.2 వేల కోట్ల గ్రాంటుతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఆదుకోవడం జరిగింది. గ్రామాల్లో అర్హులైన వారెవ్వరూ కూడా రేషన్ కార్డు, పింఛన్, ఇందిరమ్మ ఇల్లు వంటివాటి కోసం ఎవ్వరినీ అభ్యర్థించాల్సిన అవసరం లేకుండా మంజూరు చేసిన మహనీయుడు. పావలా వడ్డీకి రుణాలు ఇప్పించడం ద్వారా డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంభన. 2008–2009లో ఆహార ధాన్యాల ఉత్పత్తి అత్యధిక రికార్డు స్థాయి 204 లక్షల టన్నులు వ్యవసాయం: వ్యవసాయం అంటే పండుగ కావాలన్న మహోన్నత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో 2004–2005 నుంచి 2009–2010 వరకు ధాన్యం మద్దతు ధర రూ.450(81.81శాతం), మొక్కజొన్న రూ.400, జొన్న రూ.400 పెరిగింది. 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు గ్రామీణ రైతులకు ఉచిత విద్యుత్, నూతనంగా 2 లక్షల తత్కాల్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్, యూనిట్ రూ.7 నుంచి రూ.8 వరకు కొనుగోలు చేసి కూడా రైతులకు ఉచిత విద్యుత్, గ్రామీణ రైతులకు విద్యుత్ బకాయిలు రూ.1250 కోట్లు రద్దు. విత్తనాలు, ఎరువుల ధరల పెరుగుదలపై నియంత్రణకు వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రాముఖ్యత. పశుక్రాంతి పథకం ద్వారా పాడి పరిశ్రమాభివృద్ధి, రైతు మిత్ర గూపులకు స్పల్ప వడ్డీ రుణాలు. ఆహారం: క్వింటాల్ ధాన్యం రూ.1,000 అయిన తరువాత కూడా కోట్ల కుటుంబాలకు పైగా రూ.2 కిలో బియ్యం అందించిన ధీశాలి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి. తన పాలనా కాలంలో 68 లక్షల కుటుంబాలకు నూతన తెల్లకార్డులు మంజూరు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ఆర్. 2009–2010లో 187 లక్షల తెల్లకార్డులు, 15 లక్షల పైగా అంత్యోదయ కార్డులు రాష్ట్రంలో ఉన్నాయి. బియ్యంపై 2004–05లో రూ.500 కోట్ల సబ్సిడీ, 2009–10లో రూ.3200 కోట్ల సబ్సిడీ అందజేశారు. గూడు–పేదలకు పక్కా ఇల్లు: గుడిసె లేని రాష్ట్రం–అదే ఇందిరమ్మ రాజ్యం అన్న నినాదంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పాలన సాగించారు. దేశం మొత్తం మీద ఎన్ని ఇళ్ల నిర్మాణం ఆ కాలంలో జరిగితే ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే అన్ని ఇళ్ల నిర్మాణం వైయస్‌ఆర్ చేపట్టారు. 40 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. అంతిమ లక్ష్యం 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే మహానేత అకాల మరణం పొందారు. వైద్యం: ముఖ్యమంత్రి సహాయ నిధి ఎప్పుడూ జరగని రీతిలో విడుదల. ఊహకు అందని విధంగా 108 అంబులెన్స్ సర్వీసు, 104 వైద్యసేవల సర్వీసు ద్వారా గ్రామీణ పేదలకు నెల నెలా మందుల పంపిణీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు విశిష్ట వైద్య సదుపాయాలు కల్పించారు. వృద్దాప్యంలో భద్రత: వృద్ధుల పింఛన్ రూ.75 నుంచి రూ.200, వికలాంగులకు రూ.500 వరకు పెంచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిదే. కొత్తవారికి 52.5 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేశారు. పింఛన్ల మొత్తం 77 లక్షల మందికి ప్రతి నెల1వ తేదీనే బట్వాడా చేశారు. మహిళల సంక్షేమం కోసం అభయ హస్తం పథకం రూపకల్పన చేశారు. విద్య: బీసీ విద్యార్థులకు ఏడాదికి రూ.2500 చొప్పున ఉపకార వేతనాలు మంజూరు చేసి, దానిని రూ.3200లకు పెంచారు దివంగత మహానేత వైయస్‌రాజశేఖరరెడ్డి. గణనీయంగా విద్యాలయాలు పెంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఉన్నత విద్యను గ్రామీణ, పేద కుటుంబాలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రైతులకు, చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం: 18 సంవత్సరాల తరువాత కేంద్రం ప్రకటించిన రుణాల రద్దు పథకం రెగ్యులర్‌గా కట్టే రైతులకు వర్తించలేదని ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు గుర్తించకముందే 36 లక్షల మంది రైతులకు రూ.5 వేల చొప్పున రూ.1800 కోట్ల మేర రుణాల రాయితీ దేశంలోనే ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి. 2004 మే 2వ వారంలో అధికారంలోకి వస్తే జూన్ 1వ తేదీన ఆత్యహత్యలు చేసుకున్న రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలకు లక్షన్నర పరిహారం అందించే ందుకు జీవో నంబరు 421 విడుదల చేశారు. చంద్రబాబు పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు కూడా పరిహారం విడుదల చేశారు. పాఠశాల విద్యార్థులకు యూనిఫారమ్స్ రెండు జతల నుంచి నాలుగు జతలకు పెంచారు. ప్రభుత్వ కార్పొరేషన్లు అన్నింటికీ చేనేత బట్టలు వాడాలని నిర్ణయించారు. దీంతో ఆప్కో కొనుగోలు రూ. 4 కోట్ల నుంచి రూ.147 కోట్లకు పెంచి చేనేత కార్మికులకు ఆసరా కల్పించారు. చేనేత కార్మికుల వృద్దాప్య పింఛన్ వయస్సు అర్హత 60 నుంచి 50 సంవత్సరాలకు తగ్గించారు. 2008–09లో 80 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్లు పంట రుణాలు మంజూరు చేయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.70 వేల కోట్ల రుణాలు రద్దుతో రూ.15 వేల కోట్లు మన రాష్ట్ర రైతాంగానికి లబ్ధిచేకూరింది. ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1500 నుంచి రూ.4500కు పెంచారు. రూపాయి డాక్టర్‌గా.. వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైయస్ఆర్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. అపర భగీరథుడు ‘1978లో శాసనసభలో తొలిసారి అడుగు పెట్టాక కోస్తా పర్యటనకు వెళ్లినప్పుడు కాలువల్లో గలగలా పారుతున్న నీటిని చూసి కరువుతో తల్లడిల్లుతున్న ప్రాంతాలకు కూడా జలధారలు అందించాలనే సంకల్పం నాలో ఏర్పడింది. కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని నాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని కోరితే.. ‘‘దోసిలి పట్టు.. పోస్తా’’ అని ఎగతాళిగా మాట్లాడారు. ఆ రోజు నా సంకల్పం మరింత బలపడింది’ అని 2004లో సీఎంగా సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే సమయంలో వైయస్ఆర్ గుర్తు చేసుకున్నారు. కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం తలపెట్టారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను చేపట్టారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరానికి శ్రీకారం చుట్టారు. 2009 నాటికే 16 ప్రాజెక్టులను పూర్తిగా.. 25 ప్రాజెక్టులను పాక్షికంగా వెరసి 41 ప్రాజెక్టుల ద్వారా 19.53 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 3.96 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డు నెలకొల్పారు. ఆరోగ్యశ్రీతో ప్రజారోగ్యానికి భరోసా.. 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అధికారంలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేశారు. అనారోగ్యం పాలైన పేద కుటుంబాలు ఆపత్కాలంలో సాయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాల్సిన ప్రయాసలకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి ఎనలేని భరోసా ఇచ్చింది. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. వైయస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. పేదరికానికి విద్యతో విరుగుడు.. పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి వైయస్ఆర్ రూపకల్పన చేశారు. డాక్టర్, ఇంజనీర్ లాంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని ధృఢంగా విశ్వసించి.. ఆ దిశగా అడుగులు వేశారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యానవర్శిటీ, తిరుపతిలో పశు వైద్యకళాశాలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉన్నత చదువుల భాగ్యం కల్పించారు. మాంద్యం ముప్పు తప్పించిన ఆర్థికవేత్త.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం రాష్ట్రంపై పడకుండా వివిధ పనుల కల్పన ద్వారా వైయస్ఆర్ నివారించగలిగారు. ఐటీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఎగుమతులు రెట్టింపు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేశారు. అజేయుడు.. రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటారు. వారిలో దివంగత వైయస్ఆర్ ముందు వరుసలో నిలుస్తారు. పులివెందుల నియోజకవర్గం నుంచి 1978, 1983, 1985 ఎన్నికల్లో అసెంబ్లీకి, కడప లోక్‌సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో పార్లమెంట్‌కి, ఆ తర్వాత మళ్లీ పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి వరుసగా వైఎస్ రాజశేఖరరెడ్డి విజయాలు సాధించారు. రైతును రాజు చేసిన మారాజు.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాడు టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షల పంపు సెట్లకుపైగా ఉచిత విద్యుత్ అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాత ఏడాది రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌పై వెనక్కు తగ్గలేదు. వైఎస్ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించారు. ఐదేళ్ల పాటు రైతు దినోత్సవం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) స్థాయిల్లో వేడుకలు నిర్వహించేవారు. వీటిలో పెద్ద ఎత్తున రైతులను భాగస్వాములను చేశారు. గత ఐదేళ్లు పెద్ద ఎత్తున అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శాఖల వారీగా ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించింది. వైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్, రైతు భరోసా కేంద్రాలు, వైయస్ఆర్ సున్నావడ్డీ పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, వైయస్ఆర్ ఉచిత పంటల బీమా, వైయస్ఆర్ యంత్ర సేవా పథకం వంటి వాటి ద్వారా లబ్ధి పొందిన రైతులను భాగస్వాములను చేశారు. రైతన్నల సంక్షేమానికి ఎన్నో మేళ్లు.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో వివిధ పథకాల ద్వారా రైతన్నలకు నేరుగా లబ్ధి చేకూర్చారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి, వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్, అమూల్ ద్వారా పాడి రైతులకు అదనంగా లబ్ధి, ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా రైతులకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి కలిగించింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థిక సాయం, వైయస్ఆర్ జలకళ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించి, మోటార్లు కూడా వైయస్ జగన్ ఉచితంగా అందించారు. మహానేత సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు జులై 8న వైయస్ఆర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.