హెల్త్‌ యూనివర్సిటీ ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ధ‌ర్నా

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలుపుద‌ల చేయాల‌ని డిమాండ్ 

విజ‌య‌వాడ‌: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లో ధ‌ర్నా నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు విజయవాడకు తరలివచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో విజయవాడలోని గుణదల ప్రాంతంలో ఉన్న ఎన్టీయార్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ విద్యార్ధి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తి నినదిస్తూ ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ చేరుకున్నారు. అక్కడే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వినతిపత్రం సమర్పించేందుకు లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే విద్యార్థులు అక్కడికి చేరుకోవడానికి ముందే భారీగా మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులు, పోలీసులకు నడుమ తీవ్ర వ్యాగ్యుద్ధం, తోపులాట జరిగి స్థానిక వాతావరణం రణరంగంగా మారింది.

పోలీసుల వైఖరిని ఖండిస్తూ పానుగంటి చైతన్య అక్కడే రోడ్డుపై పడుకుని తన నిరసన వ్యక్తం చేయడంతో విద్యార్థులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. దీంతో పరిస్థితి ఎక్కడ చేజారిపోతుందో అన్న ఆందోళనతో పోలీసులు, హెల్త్ యూనివర్సిటీ అధికారులనే బయటికి తీసుకువచ్చారు. దీంతో శాంతించిన విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వారికి సమర్పించారు. "వైద్యో.. నారాయణో... హరి! అంటే వైద్యుడు దైవంతో సమానమని అర్థం. అటువంటి ఆధునిక దేవుళ్ళను తయారు చేసేందుకు, నిరుపేద విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ 8వేల 500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ప్రైవేటు పరం చేసే కుట్రలకు తెరతీశారు" అని వైయస్ఆర్‌సీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీని వలన  కొన్ని వేల మంది మెరిట్ విద్యార్థులకు ఎంబిబిఎస్ విద్య దూరమౌతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కూటమి  ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెడికల్ కళాశాలను నూటికి నూరు శాతం ప్రభుత్వ కళాశాలలుగా కొనసాగిస్తామని తొలుత విద్యార్థులకు హామీ ఇచ్చారు.  అయితే తర్వాత స్వయంగా ఆయన తండ్రే అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నారాయణ మెడికల్ కళాశాల వంటి ప్రైవేటు విద్యాసంస్థలకు దోచి పెట్టేందుకే ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పేరిట కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యల  ఫలితంగా వైద్య కళాశాలలు పూర్తిగా కార్పొరేట్ శక్తుల పరమై రాష్ట్రంలో పేద మెరిట్  విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య కలగానే మిగిలిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల నష్టపోయేది కేవలం విద్యార్థులు మాత్రమే కాదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలలు ఏర్పడితే కొన్ని వందల పడకలతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఏర్పడుతుందని.. తద్వారా లక్షల మంది పేద వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందుతుందని.. ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వలన అటు పేద విద్యార్ధులు వైద్య విద్యకు, ఇటు పేద ప్రజలు వైద్య సేవకు దూరమవుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

5వేలకు 50ఎకరాల భూమి...!?

ఈ కుట్రలో అనేకమంది ప్రజాప్రతినిధులు, మంత్రులు సైతం భాగస్వాములే అన్నది బహిరంగ రహస్యమేనని పానుగంటి చైతన్య ఆరోపించారు. లేకుంటే 50 ఎకరాల భూమిని కేవలం 5వేల రూపాయలకు 66 ఏళ్ల పాటు ఎవరైనా లీజుకు ఇస్తారా...? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇదే చిత్రంగా అనిపిస్తుంటే... ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, పాడేరు, ఆదోని వైద్య కళాశాలలకు మంజూరైన 750 సీట్లను రద్దు చేయాలని  కూటమి ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్‌కు లేఖ రాయడం మరింత విచిత్రమని ఆయన ఆగ్రహంతో మండిపడ్డారు.

ఊరందరిదీ ఒకదారి - ఉలిపికట్టెది మరో దారి

ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మాకు మెడికల్ సీట్లు పెంచమని అడుగుతుందనీ... ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా మాకు మెడికల్ సీట్లు వద్దు.. దయచేసి వాటిని వెనక్కి తీసుకోండి అని స్వయంగా కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందనీ.. ఆయన వివరించారు. ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది మాత్రం ఇంకో దారి అన్న చందంగా ఉన్న ఈ చర్య కన్నా సిగ్గుచేటైన విషయం ఇంకొకటి ఉంటుందా అని ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసారు. ఇక నిర్మాణంలో ఉన్న పిడుగురాళ్ల, పెనుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతిపురం, బాపట్ల, అమలాపురం కళాశాలలన్నీ కూటమి ప్రభుత్వం నిర్ణయం వలన 1800 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాయని పేర్కొన్నారు.

పీపీపీ... పేద విద్యార్థుల నెత్తిన టోపీ

అదేమని అడిగితే దేశంలోని అనేక రాష్ట్రాల్లో పీపీపీ విధానం అమలౌతుంది కదా... అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తెలివితక్కువగా మాట్లాడుతున్నారని చైతన్య వ్యాఖ్యానించారు. అయితే ఆయా రాష్ట్రాల్లో కొత్త మెడికల్ కళాశాలలకు మాత్రమే పీపీపీ విధానాన్ని అమలు చేశారు కానీ... రాష్ట్ర ప్రభుత్వాలే వేలకోట్లు వెచ్చించి నిర్మించిన వైద్య కళాశాలలకు పీపీపీ విధానం అమలు చేయలేదన్న వాస్తవాన్ని పాలకులు గుర్తెరగాలని ఆయన హితవు పలికారు. కేవలం భూములు మాత్రమే లీజుకి ఇచ్చి ప్రైవేట్ ద్వారా కళాశాలలు నెలకొల్పేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టారని, దానికి పూర్తి విరుద్ధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం 80% నిర్మించబడ్డ కళాశాలలను, చిన్న చిన్న సదుపాయాలు కల్పిస్తే ఎంబిబిఎస్ తరగతులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న  కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి కుట్ర పన్నారని ఆయన కన్నెర్ర చేశారు.

విదేశీ వైద్య విద్యార్థుల‌పై కక్ష కట్టిన కూటమి సర్కారు

విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, దేశంలో వైద్యవృత్తిని కొనసాగించేందుకు అన్ని అర్హతలను సాధించిన యువ వైద్యుల పట్ల కూడా కూటమి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పానుగంటి చైతన్య విమర్శించారు. ఏపీకి చెందిన దాదాపు 1500 మంది యువ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం గత 13 నెలలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా, వారిని పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. పైపెచ్చు తమకు న్యాయం చేయాలని హెల్త్‌ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగితే,  పోలీసులతో వారిని జట్టు పట్టుకుని ఈడ్పించి, అక్రమంగా అరెస్ట్ చేయించి, అన్యాయంగా టెంపో వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించడం ద్వారా కూటమి ప్రభుత్వం తన కర్కశత్వాన్ని చాటుకుందని తెలిపారు. వారికి తక్షణమే న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే ఈ కుట్రలు కుతంత్రాలకు తక్షణమే స్వస్తి పలకాలని పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించిన దాఖలాలు చరిత్రలో లేవన్న వాస్తవాన్ని గుర్తెరిగి ఇకనైనా కార్పొరేట్ శక్తుల కొమ్ముకాయడం మానుకోవాలన్నారు. లేకుంటే చరిత్రలో లేకుండా మట్టి కొట్టుకు పోతారని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలి ఆనంద్‌కుమార్, ఓబుల్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Back to Top