తాడేపల్లి: కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలని బాపట్ల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరుతో కుట్ర రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు. రైతులు, ప్రజలను ఇబ్బంది పెడితే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదన్నారు. ఆదివారం మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలను భయపెట్టి తరిమేస్తున్నారు ఒకపక్క రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతుంటే చంద్రబాబు మాత్రం కమీషన్ల దాహంతో గతంలో వైయస్ జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమలను తరిమేస్తున్నాడు. ప్రజామోదానికి వ్యతిరేకంగా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూడటం దుర్మార్గం. దీనిని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబుకి చేతనైతే ప్రజలను ఒప్పించి వారి అంగీకారంతో భూములు సేకరించాలి తప్ప అనైతిక విధానాలను అవలంభిస్తూ బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం పూనుకుంటే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. రైతుల పక్షాన నిలబడి వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుంది. వేరే గ్రామాల్లో ఇండోసోల్ కంపెనీకి భూములిచ్చిన వైయస్ జగన్ చంద్రబాబు తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఆఖరుకి పారిశ్రామికవేత్తలను కూడా వదలడం లేదు. నెల్లూరు జిల్లా, ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు పరిశ్రమల పేరుతో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలే కారణం. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఇండోసోల్ కంపెనీ 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే రెండు జీవోల ద్వారా 5148 ఎకరాలు ఒకచోట, 3200 ఎకరాలు మరోచోట సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రావూరు, చేవూరు గ్రామాల్లో 4,827 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. భూములిచ్చేందుకు రైతులు, ప్రజలు అంగీకారం కూడా తెలపడంతో ఇండోసోల్ కంపెనీ రూ.417 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. పైలెట్ ప్రాజెక్టు కోసం కూడా నిర్మాణాలు ప్రారంభయ్యాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నట్టుండి ఇండోసోల్ కంపెనీ చేస్తున్న పనులు నిలుపుదల చేయించి వేరే ప్రాంతానికి మార్చాలని ఆదేశించింది. ఇందుకోసం కరేడులో 8వేల ఎకరాలు భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. స్థానిక రైతులు, ప్రజలు భూములిచ్చేది లేదని వారిస్తున్నా ప్రభుత్వం వినడం లేదు. ఒకవేళ బాధిత పక్షాల తరఫున వైయస్ఆర్‌సీపీ నిలబడి పోరాటం చేస్తే పరిశ్రమలకు వ్యతిరేక పార్టీగా ముద్ర వేయాలన్న కుట్రలకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. కరేడులో భూసేకరణకు నోటిఫికేషన్ వెనుక భారీ కుట్ర. పరిశ్రమలు రావాలని, యువతకు ఉపాధి కావాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని నిజంగా చంద్రబాబు మనసులో ఉంటే, రైతులు, ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతున్న పనులను ఎందుకు నిలుపుదల చేయిస్తున్నట్టు? సదరు కంపెనీ రూ.417 కోట్లు సైతం ప్రభుత్వానికి చెల్లించి ముందుకెళ్తుంటే అక్కడనుంచి తరలించే పేరుతో ఎందుకు అడ్డుకుంటున్నట్టు? రైతులంతా అంగీకారం తెలిపిన ప్రాంతంలో కాదని కరేడు గ్రామంలో 8 వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది? రైతుల ఆమోదం లేకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు? గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇండో సోల్ కంపెనీకి కేటాయించిన భూమిని వేరే కంపెనీకి ఇవ్వాలని చూడటం భావ్యమేనా? మీకు అనుకూలమైన వేరే కంపెనీకి భూములు ఇవ్వాలనుకుంటే వేరే ప్రాంతంలో చూడాలే తప్ప ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి పనులు మొదలు పెట్టిన కంపెనీని తరిమేయడం భావ్యమేనా? ప్రజామోదంతో భూసేరణ చేసే సత్తా లేకనే.. మీరు తీసుకు రావాలనుకున్న కంపెనీకి ప్రజామోదంతో భూములు సేకరించి ఇచ్చే సత్తా మీ ప్రభుత్వానికి లేదా? అంతేకానీ గత మా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం మీద బురదజల్లే కుట్రతో ఇండోసోల్ కంపెనీని అడ్డంపెట్టి కరేడు గ్రామ రైతుల్లో భయాందోళన, అలజడి సృష్టించడం చాలా తప్పు. దీన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు తన రాజకీయాల కోసం రైతులు, పరిశ్రమలతో ఆడుకోవడం మానుకుంటే మంచిది. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని, తద్వారా యువతకు ఉద్యోగవకాశాలు రావాలని ఆలోచన చంద్రబాబుకి ఉన్నట్టు కనిపించడం లేదు కాబట్టే ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. చంద్రబాబుకి నిజంగా పరిశ్రమలు తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే గతంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో ప్రజామోదంతో సేకరించిన భూములను కాదని కొత్తగా కరేడులో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చేవాడే కాదు. ఇప్పటికైనా కరేడు గ్రామంలో బలవంతపు భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి.