ఏంటీ విష సంస్కృతి..ప‌చ్చ‌ని చెట్ల‌ను న‌రుకుతారా?

మామిడి చెట్ల న‌రికివేత‌పై మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధ‌ర్‌రెడ్డి ఫైర్‌

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:  పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌లు విష సంస్కృతికి తెర లేపార‌ని, ప‌చ్చ‌ని చెట్ల‌ను న‌రుకుతారా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువులో వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుడు రైతు వీరనారప్పకు చెందిన మామిడి  తోట‌ను టీడీపీ గూండాలు న‌రికివేయ‌డం ప‌ట్ల ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు శ‌నివారం రైతు పొలాన్ని ప‌రిశీలించి, ఘ‌ట‌న‌పై ఆరా తీశారు. వీర‌నార‌ప్ప కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ..నాలుగు రోజుల క్రితం రైతు వీరనారప్ప మామిడి చెట్లను కొందరు వ్యక్తులు నరికి వేయడం దుర్మార్గ‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.  వీర‌నార‌ప్ప కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదని వ్యవసాయమే ముఖ్య వనరుగా జీవ‌నం సాగిస్తున్నార‌ని చెప్పారు. పుట్టపర్తి నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు విష సంస్కృతికి తెర లేపారని, రైతు సాగుచేసే పచ్చని చెట్లను సైతం నరికి వేయడం దారుణమని అన్నారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ధ్వ‌జ‌మెత్తారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పుడో కనుమరుగైంద‌ని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వంలో పేదలకు  న్యాయం జరగడం లేదన్నారు. గత జగనన్న  ప్రభుత్వంలో మంజూరు అయిన అభివృద్ధి పనులు తప్ప ఎటువంటి అభివృద్ధి కనిపించడం లేదన్నారు. వీరనారప్పకు పోలీసులు, అధికారులు  న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top