తిరుపతి: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జైల్ నుంచి బయటకు వచ్చేంత వరకు పోరాటం ఆగదని వైయస్ఆర్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ నాయకులు హెచ్చరించారు. చెవిరెడ్డి చేసిన మంచిని ప్రజలు అందరూ గుర్తుచేసుకుంటున్నారని నేతలు స్పష్టం చేశారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎర్రావారిపాళెంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. నల్లజెండాలు చేతబట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్‌విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ..` అక్రమ కేసులతో తమ నాయకుడు చెవిరెడ్డిని, ఆయన బిడ్డ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలను వేధింపులకు గురిచేయడం దుర్మార్గం. అక్రమ అరెస్టులతో చెవిరెడ్డిని భయపెట్టలేరు. కూటమి ప్రభుత్వం కుట్రలతో చెవిరెడ్డి కుటుంబాన్ని జైలు పాలు చేయాలని చూస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో భయానక వాతావరణం కలిగించాలనే ఇంతకు తెగించారు. జగనన్న సైనికులను భయపెట్టాలని చూస్తే భయపడే వారు ఎవ్వరు లేరు. చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై చంద్రగిరి ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు, ఆ కన్నీటిలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం` అని వైయస్ఆర్‌సీపీ ఎర్రావారిపాళెం నాయకులు హెచ్చరించారు.