ధ‌ర్మారెడ్డికి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప‌రామ‌ర్శ‌

పారుమంచాల‌లో చంద్ర‌మౌళి ద‌శ దిన క‌ర్మ‌

నంద్యాల‌:  టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప‌రామ‌ర్శించారు. నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో ధ‌ర్మారెడ్డి కుమారుడు చంద్ర‌మౌళి ధ‌న దిన క‌ర్మ శ‌నివారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైవీ సుబ్బారెడ్డి, ఆయ‌న కుమారుడు వై. విక్రాంత్‌రెడ్డి పాల్గొని చంద్ర‌మౌళి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి, ధైర్యం చెప్పారు. త‌మ ప్రగాఢ సానుభూతి తెలిపారు.  
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి ఈ నెల 21న కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు.  చంద్రమౌళికి చెన్నైలో గుండెపోటు రాగా హుటాహుటిన కావేరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. మూడు రోజులుగా చికిత్సపొందిన ఆయన.. కోలుకోలేక‌ కన్నుమూశారు. జనవరిలో వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన చంద్రమౌళి ఇలా కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.  చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతుండ‌గా ఈ విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా పారుమంచాల‌లో చంద్ర‌మౌళి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌గా, అదే రోజు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ‌ర్మారెడ్డి స్వ‌గృహానికి చేరుకుని కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.

Back to Top