పశ్చిమ గోదావరి జిల్లా : తణుకు వై జంక్షన్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి అడ్డుగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ చర్యను వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైయస్‌ఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అనేది మహానేతకు అవమానం అని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ దౌర్జన్య చర్యకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని శాంతియుత నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. కూటమి ప్రభుత్వ అండతోనే టీడీపీ నేతలు ఇలాంటి ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ ఫ్లెక్సీకి ధీటుగా వైయస్ఆర్‌సీపీ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించిన మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూటమి దౌర్జన్యానికి గట్టి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ, “వైయస్‌ఆర్ విగ్రహానికి అడ్డుగా ఫ్లెక్సీ కట్టడం అనేది కోట్లాది మంది అభిమానుల మనోభావాలను దెబ్బతీయడమే. ఒకవేళ తొలగింపులు చేయాలంటే రెండు ఫ్లెక్సీలను ఒకేసారి తొలగించాలి. కేవలం వైయస్ఆర్‌సీపీ ఫ్లెక్సీనే తొలగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు” అని అధికారులను హెచ్చరించారు. వైయస్ఆర్‌సీపీ ఫ్లెక్సీ తొలగించేందుకు అధికారులు చేసిన శతప్రయత్నాలను పార్టీ నేతలు అడ్డుకున్నారు. సమాన న్యాయం పాటించాలంటూ వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. మొత్తానికి తణుకులో కూటమి దౌర్జన్య రాజకీయాలకు వైయస్ఆర్‌సీపీ అడ్డుకట్ట వేసిందని, ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పార్టీ నేతలు స్పష్టం చేశారు.