తాడేపల్లి: పేద విద్యార్ధులకు ఉచిత వైద్య విద్యను, పేదలకు వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. నాణ్యమైన విద్య, వైద్యం పేదలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు.. ఆ పేదలకు వాతిని దూరం చేసే హక్కు ప్రభుత్వానికి లేదన్న ఆయన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. అందులో భాగంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజలు, విద్యార్ధులతో పాటు ప్రజాసంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున మద్ధతు పలుకుతున్నారని చెప్పారు. ఇదే అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని.... ఒక కమిటీ ద్వారా ర్యాండమ్ చెకింగ్ చేయమని గౌరవ గవర్నర్ గారికి విజ్ఞప్తి చేశామన్నారు. ప్రజారోగ్యం కోసం పరితపించిన వ్యక్తిగా వైయస్.జగన్ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే 5 కాలేజీలు పూర్తై తరగతులు ప్రారంభం కాగా మిగిలిన 12 నిర్మాణంలో ఉన్నాయన్నారు. అయితే మెడికల్ కాలేజీలు పూర్తైతే వైయస్.జగన్ కు పేరు వస్తందన్న అక్కసుతోనే చంద్రబాబు వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నాడని మండిపడ్డారు. స్కూలు పిల్లలకు ఉచిత ట్యాబులిస్తే గేమ్స్ ఆడుకుంటారని మాక్ అసెంబ్లీలో వారితో చెప్పించం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ● ప్రైవేటీకరణ ఆగేవరకూ పోరాటం.. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే... వాటిని దుర్భిద్దితో పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసి తద్వారా వ్యక్తిగత లబ్ది పొందాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని వైయస్ఆర్‌సీపీ నిర్ణయించింది. ప్రజారోగ్యం ప్రభుత్వం చేతుల్లో ఉండాలే తప్ప ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే ప్రజలకు న్యాయం జరగదు. ఆ నేపథ్యంలో మా పార్టీ ఆధ్యక్షుడు వైయస్.జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి గవర్నర్ గారికి సమర్పించాలని నిర్ణయించాం. ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు 50-70 వేల మందితో సంతకాలు తీసుకుని.. అవన్నీ గౌరవ గవర్నర్ గారికి సమర్పించి ప్రజల అభిప్రాయం ఆయనకు చెప్పాలన్న నిర్ణయంలో భాగంగా ఇవాళ గవర్నర్ గారిని కలిశాం. ప్రపంచంలో ఎక్కడా ప్రజావైద్యాన్ని దుర్భిద్ధితో, వ్యక్తిగత స్వార్ధం కోసం ప్రైవేటు పరం చేసే కార్యక్రమం ఎక్కడా చేయలేదు. దురదృష్టవశాత్తూ మన రాష్ట్రంలోనే ఇలా జరగుతుంది. కూటమి నేతలు కూడా మేం చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు కూడా దీనిపై క్రాస్ చెక్ చేయించవచ్చని చెప్పాం. ● దుర్భిద్ధితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ... రాష్ట్రంలో బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చేశాం. ప్రపంచ మొత్తం మీద కోవిడ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చూశాం. ఆ ఇబ్బందులన్నీ చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం... జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న పాలసీలో భాగంగా ... 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైయస్.జగన్ శ్రీకారం చుట్టాం. ఒక్కో కాలేజీకి రూ.500 కోట్లు కేటాయించి, ప్రభుత్వ నిధులతో పాటు వివిధ ఆర్ధిక సంస్ధలతో టై అప్ చేసి ప్రారంభించాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5 కాలేజీ లను పూర్తిచేశాం. మరో 12 కాలేజీలు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. పూర్తి చేసిన 5 జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో తొలి ఏడాది వైద్య విద్య కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఆ విద్యార్ధులు రెండో ఏడాది కూడా పూర్తి చేసుకుంటున్నారు. మెడికల్ కాలేజీలకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించే ఏర్పాటు చేశాం. ఎంతటి క్లిష్టమైన వ్యాధికైనా అక్కడే వైద్యం అందించాలన్న ఉద్దేశంతో పక్కా ఏర్పాట్లు చేశాం. దురదృష్టవశాత్తూ ప్రభుత్వం మారిన తర్వాత వైయస్ఆర్‌సీపీ ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దుర్భిద్ధి, దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలన్నింటినీ పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేస్తున్నారు. పీపీపీ చేసినా.. ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని చెబుతున్న కూటమి నేతలు ఏ విధంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందో చెప్పాలి. ప్రైవేటు వ్యక్తులు లాభార్జనకోసమే ఉంటారు తప్ప.. వాళ్లేం స్వచ్ఛంద సంస్థలు కాదు. ఇప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో 30శాతం పేదలకు చికిత్స చేయాలన్న నిబంధన ఉన్నా... ఎక్కడా అమలు కానీ పరిస్థితి. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదలు ఉచిత వైద్య విద్యకు దూరం అయ్యే పరిస్థితి తలెత్తింది. ఇది ధర్మమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగానే కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. వైయస్.జగన్ నేతృత్వంలో కలుస్తామని చెప్పాం. ● ప్రజల ప్రాణాలతో బాబు చెలగాటం... రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి. వైద్యం కోసం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడాలి. దివంగత నేత వైయస్.రాజశేఖర్ రెడ్డి పేదవాడు కూడా ధనవంతుడితో సమానంగా వైద్య చికిత్స పొందాలన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పేర్లు మార్చుకున్న... పథకాన్ని మాత్రం అలాగే కొనసాగింది. మా నాయకుడు వైయస్.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వైయస్సార్ ఆరోగ్యశ్రీ అని పేరు మార్చి 2వేల వరకు అదనపు చికిత్సలను చేర్చడంతో పాటు రూ.25 లక్షల వరకు పరిధిని విస్తరించారు. ఈ ప్రభుత్వానికి ఏమైంది? పేదల మీద ఎందుకు కక్ష? వైయస్.జగన్ మీద వైయస్ఆర్‌సీపీ నేతల మీద కక్ష ఉంటే తీర్చుకొండి. పేదలు ఏం చేశారు? నెలకు రూ.300 కోట్లు ఆరోగ్యశ్రీ కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదా? సుమారు 18 నెలలు అయింది. 18 నెలల్లో కేవలం రూ.800 కోట్లు విడుదల చేసింది. మిగిలిన కాలానికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోతే నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేదవాళ్లకు చికిత్స అందించని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో ప్రైవేటు కంపెనీకి ఇన్సూరెన్స్ మోడ్ లో ఇస్తామంటున్నారు. అధి సాధ్యమా? వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 60 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాం. రూ.14వేల కోట్లు ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించాం. ఇంత డబ్బు ప్రైవేటు సంస్థలు అందిస్తాయా? అంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి.. ప్రజారోగ్యం నాశనం అయిపోయినా ఫర్వాలేదు అనుకుంటున్నారా? ఇది దోపిడీ కాదా? ప్రజారోగ్యం దోపిడీకి గురైనా ఫర్వాలేదా? వాస్తవికతను ఆలోచన చేయకుండా... పేదలకు వైద్య విద్యను, వైద్యాన్ని దూరం చేస్తూ.. ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తున్నారు. ప్రజలు ఓట్లేసి ఐదేళ్ల కాలానికి ఎన్నుకున్న పాపానికి వాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? ఇది న్యాయమా చంద్రబాబూ? ● ట్యాబుల పంపిణీపైనా విషం... భారత రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్యం ప్రజలకు కల్పించిన హక్కులకే తూట్లు పొడుస్తే ఎలా చంద్రబాబుగారూ?. ఇప్పటికే విద్యను అటకెక్కించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఘనంగా ఓ వెలిగిన ప్రభుత్వ పాఠశాలలను 18 నెలలుగా నిర్వీర్యం చేస్తున్నారు. దేశంలో అత్యున్నత స్కూళ్లుగా నాడు నేడుతో రూపొందిస్తే.. వాటన్నింటినీ అటకెక్కించారు. పిల్లలకు మెరుగైన విద్య కోసం ట్యాబులు పంపిణీ చేస్తే.. వాటిలో గేమ్స్ ఆడుకునేవారని పసిపిల్లలతో మీరు నిర్వహించిన మాక్ అసెంబ్లీలో చెప్పిస్తారా? సిగ్గుందా మీకు? రాష్ట్ర ప్రజలపట్ల మీ బాధ్యత ఇదేనా? పిల్లల్లో విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించడానికి ట్యాబులు పంపిణీ చేస్తే... మీరు చెప్పిన టెక్నాలజీని అందుబాటులోకి మేం తెచ్చాం కాబట్టి.. అది గేమ్స్ ఆడుకోవడానికి అని చెప్తారా? పిల్లలతో ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడిస్తారా? అందుకే పేద ప్రజల పట్ల బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా పేదల ఉచితఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టామన్న బొత్స...ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు పోరాటాన్ని కొనసాగుతుందని స్పష్టం చేశారు. ● పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను తొలగించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై స్పందిస్తూ... స్పీకర్ తో పాటు ఆయన వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలందరికీ చాలా స్పష్టంగా చెబుతున్నాం. రాజ్యాంగ బద్దంగా, రాజ్యాంగంలో ఏ కార్యక్రమమైనా మీ పరిధిలో ఉంటే నిర్ణయం తీసుకోమని చెబుతున్నాం. మీ పరిధిలో లేని అంశాల గురించి అలాంటి మాటలు మాట్లాడకూదన్న ఆలోచన, ఇంగితం జ్ఞానం లేదా? పదే, పదే వాటి ప్రస్తావన ఎందుకు? చులకన మాటలు, కించపరిచే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. దీనిపై తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. మెడికల్ కాలేజీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ... ప్రభుత్వ మెడికల్ కాలేజీలను.. దోచుకోవడానికి తమ వారికి ప్రైవేటీకరణ పేరుతో కట్టబెట్టడాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. దోపిడీయే ప్రభుత్వ పరమావధి కాబట్టి వారు పట్టించుకోవడం లేదు. కానీ బాధ్యత గల ప్రతిపక్షంగా మా పోరాటం ఆగదు. కూటమి ప్రభుత్వంలో పాలన పూర్తిగా కుంటుపడింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో వ్యవసాయ ప్రధానంగా ఉన్న మన రాష్ట్రంలో రైతులకు ఒక్క పంటకూ గిట్టుబాటు ధర ఇచ్చిన పాపాన పోలేదు. ఉత్తరాంధ్రాలో మొక్కజొన్న పంట అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు మార్క్ ఫెడ్ ఏర్పాటు చేయలేదు. రూ.2200 ఉన్న క్వింటాళు రూ.1700కే అమ్ముకుంటున్న దుస్థితి. రాయలసీమలో అరటి పంట తీవ్ర సంక్షోభంలో పడింది. పండిన పంటను రైతులు పొలంలోనే గిట్టుబాటు ధరలేక విడిచిపెట్టారు. కోవిడ్ లాంటి విపత్తులో కూడా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లో ఎగుమితి చేసి రైతులను ఆదుకున్నాం. ఈ ప్రభుత్వం దేనికి మద్ధతు ధర అడిగినా కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పడం తప్ప.... రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. కేంద్రాన్ని అడగడంలో తప్పులేదు.కానీ అంతకంటే ముందు రైతులు చేయాల్సిన సాయం చేసి... ఆ తర్వాత కేంద్రం నుంచి సాయంవస్తే తీసుకోవచ్చు. ఆ మాత్రం కూడా రైతుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు? రైతుల కోసం ఏ గ్రామంలో వారికి మంచి జరిగిందని చెబుతూ ప్రభుత్వం కార్యక్రమం చేసిందో చెప్పాలి. రాష్ట్రంలో విద్య అటకెక్కింది. నాడు నేడు పేరుతో నిర్మించిన స్కూూళ్ల పనులు నిలిపివేశారు. వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. 18 నెలల కాలంలో శాంతి భద్రలకు సంబంధించి ఎంత మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి? ఎంతమంది బాలికలపై అఘాయిత్యాలు జరిగాయి? ఎంత మంది బాలికలు అపహరణకు గురయ్యారు? లెక్క చెప్పాలి. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కంటే ఈ 18 నెలల్లోనే ఎక్కువ జరిగాయి. రాష్ట్రంలో ఉన్న సంక్షేమహాస్టళ్లలో ఎలన్నింటిలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు? ఎంత మందిమృతి చెందారు? గత ఐదేళ్లలో ఎన్ని స్కూళ్లలో ఈ ఘటనలు జరిగాయి? ఈ 18 నెలల్లో ఎన్ని జరిగాయి? గతంలోలేనివి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. అంతా వట్టి ప్రచారమే. వ్యక్తుల కంటే వ్యవస్థలను ముఖ్యమన్న విషయాన్ని గ్రహించాలి. ఏ మంచి జరిగిందో చెప్పాలి. రాజ్యాంగ ఆమోద దినోత్సవం పేరు ఉచ్ఛరించడానికి కూటమి ప్రభుత్వానికి అర్హత లేదు. ఆ సందర్భంగా పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. కేంద్రంలోనూ సభ జరిగింది. అక్కడ వేదిక మీద ఎవరున్నారు? రాజ్యాంగం అంటే కేవలం అధికార పార్టీలో ఉన్న ముగ్గురేనా? ప్రతిపక్ష పార్టీ లేదా? ప్రతిపక్ష నేతగా నన్ను ఆహ్వానించారా? అంటే ప్రతిపక్ష నేతలను వారి ఉనికిని కూడా భరించలేని స్ధితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇక రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? వ్యవస్థకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం చంద్రబాబుగారూ? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత తాను గతంలో మాట్లాడిన ప్రసంగాలను ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడితే ఒప్పా? ఇంకొకరు మాట్లాడితే తప్పా? పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. మరి ఆ తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు? ఒక డీఎస్పీ అవినీతిపరుడుని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు? వివిధ వర్గాల ప్రజలకు, మేధావులకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వచ్చందంగా వచ్చి సంతకాలు చేయండి. ప్రభుత్వానికి మీ అసమ్మతిని, నిరసనను తెలియజేయండని బొత్స సత్యనారాయణ కోరారు.