క్రాంతి కుమార్ ని వేధించిన పోలీసులంద‌ర్నీ క‌ఠినంగా శిక్షించాలి

ద‌ళిత యువ‌కుడి కుటుంబానికి ప్ర‌భుత్వ‌మే న్యాయం చేయాలి

వైయ‌స్సార్సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు 

తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్సార్సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు  

తాడేప‌ల్లి: విజయవాడలోని పోలీస్ స్టేషన్లు చట్టాన్ని రక్షించే కేంద్రాలుగా కాకుండా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వేధింపుల కేంద్రాలుగా, కస్టోడియల్ టార్చర్ రూమ్స్ లాగా మారిపోయాయని వైయ‌స్సార్సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు ఆరోపించారు. తాడేప‌ల్లి పార్టీ కేంద్ర  కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో ఒకే తరహా పోలీస్ అక్రమాలు, అరాచకాలు వరుసగా జరుగుతుండటం చూస్తుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా అనే అనుమానం క‌లుగుతోంద‌న్నారు. గాదె సాయికృష్ణ పోలీస్ కస్టడీ తర్వాత అదృశ్యం కావడం, లాక‌ప్ డెత్‌లో మరణించిన సంఘ‌ట‌న గురించి మ‌రిచిపోక ముందే అదే కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్‌లో సీఐ వేధింపులు భ‌రించ‌లేక ద‌ళిత యువ‌కుడు క్రాంతి కుమార్ పై ప్రాణాలు తీసుకున్న ఘ‌ట‌న చూస్తే పోలీసులంటేనే ప్ర‌జ‌ల‌కు భ‌యాన్ని క‌ల‌గ‌జేస్తోంద‌ని వివ‌రించారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడటం రాష్ట్రంలో పోలీసుల దురాగ‌తాల‌కు అద్దం ప‌డుతోంద‌ని అన్నారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

- కేసులుంటే చ‌ట్ట‌ప‌రంగా శిక్షించాలి

క్రాంతి కుమార్‌పై ఏవైనా కేసులుంటే, దానికి చట్టపరమైన ప్రక్రియ ఉంది. కోర్టులు ఉన్నాయి. న్యాయస్థానాలు శిక్షిస్తాయి. అంతే తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, ఒక వ్యక్తిని మానసికంగా కుంగదీసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు. క్రాంతి కుమార్ తండ్రి స్వయంగా విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిసి, తన కొడుకును కృష్ణ‌లంక పోలీసులు కస్టడీ పేరుతో వేధిస్తున్నారని, కులం పేరుతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయినా కూడా కమిషనర్ ఆఫీస్ నుండి గానీ, ఉన్నతాధికారుల నుండి గానీ ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ రోజు ఒక దళిత యువకుడి ప్రాణం నిలిచేది.

ఈ దళిత యువకుడి మృతికి కారణమైన కృష్ణలంక సీఐ స‌హా పోలీస్ సిబ్బంది అందరిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి లాకప్ వేధింపులు, పోలీసుల మితిమీరిన ప్రవర్తనకు అడ్డుకట్ట వేసి, పోలీస్ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం కలిగించాలని కొమ్మూరి క‌న‌కారావు అభిప్రాయ‌ప‌డ్డారు.

Back to Top