తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన 'మెగా డిఎస్సీ' ఒక పెద్ద 'దగా డిఎస్సీ'గా మారిందని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, ఏపీలో డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... గతంలో వైయస్. జగన్ ప్రభుత్వంలో పారదర్శకంగా 1.20 లక్షల ఉద్యోగాలు ఇస్తే, ప్రస్తుత ప్రభుత్వం 16 వేల ఉద్యోగాల భర్తీలోనే అనేక అక్రమాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. డియస్సీలో ఫస్ట్ ర్యాంకర్ నవీన్‌కు ఉద్యోగం నిరాకరించడం, అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా క్వశ్చన్ పేపర్లు లీక్ చేయడం వంటి తీవ్ర అవకతవకలకు పాల్పడిందని తేల్చి చెప్పారు. జీవో 4, 47, 56 ద్వారా కనీస ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను బ్యాక్ డోర్‌లో అమ్ముకున్నారని, ఆర్చరీ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య వంటి అర్హులైన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కనీసం అంతర్జాతీయ స్థాయి స్టేడియంలు లేకపోయినా ఏపీని 'గ్లోబల్ స్పోర్ట్స్ హబ్' చేస్తామని జీవోల్లో పచ్చి అబద్ధాలు రాశారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీలైన రూ. 3వేల నిరుద్యోగ భృతి, ఏటా 4 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్, 18 ఏళ్లు దాటిన మహిళలకు రూ. 1,500 ఇవ్వకుండా జెన్‌జీ (GenZ) యువతను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. పారదర్శకత ఉంటే లోకేష్ తక్షణమే సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు లేఖ రాయాలని, లేనిపక్షంలో వైఎస్సార్సీపీ స్టూడెంట్, యూత్ వింగ్స్ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... - ఫస్ట్ ర్యాంకర్ నవీన్ ఉద్యోగం ఏమైంది? జోన్-2 కృష్ణా జిల్లా క్యాడర్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన నవీన్ అనే అభ్యర్థికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అధికారులు రోజుకో రకం కారణం చెబుతూ ఆ అభ్యర్థి వివరాలను వెబ్‌సైట్ నుంచి ఎందుకు తొలగించారు? దీనికి విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి క్వశ్చన్ పేపర్ ముందే తెలుసనే అభియోగాలు ఉన్నాయి. అతను ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ సాధించాడంటే పేపర్ లీక్ అయినట్లే కదా? అతనొక్కడే రాశాడా లేక మరికొందరికి పేపర్లు లీక్ చేశాడా అనే దానిపై స్పష్టత ఇవ్వాలి. - లీకేజీ నెట్‌వర్క్‌పై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?.. క్వశ్చన్ పేపర్లు ఏ ప్రాతిపదికన లీక్ అయ్యాయి, ఎంతమందికి చేరాయి అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోటా జీవోలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47ల ద్వారా స్పోర్ట్స్ కోటాలో 3% రిజర్వేషన్ కల్పిస్తూ ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదని రాశారు. ఏ ఎగ్జామ్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం భారతదేశ చరిత్రలోనే విడ్డూరం. 2012 నాటి జీవో 74 ప్రకారం కనీస పరీక్ష తప్పనిసరి అని ఉన్నా, ఆ నిబంధనను ఎందుకు సడలించారు?. - జీవో 56 వెనుక ఉన్న అసలు కుట్ర.. 380కి పైగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను బ్యాక్ డోర్‌లో అమ్ముకున్న తర్వాత, మే 15, 2026న జీవో 56 తీసుకొచ్చి మళ్లీ పరీక్ష పెడతామని నాటకాలాడుతున్నారు. అప్పటికే ఉద్యోగాలు భర్తీ అయిపోయాక ఈ అమెండ్‌మెంట్ ఎవరిని మోసం చేయడానికి? అసలు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన ఉద్యోగాలకు అసలు ప్రాతిపదిక ఏంటి? సెలెక్షన్ కమిటీ ఏ ప్రాతిపదికన ఎంపిక చేసింది? రెండు సర్టిఫికెట్లు పెట్టాల్సిన చోట ఒక్క సర్టిఫికెట్ ఉన్నవారికే ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారు?. అసలు క్రైటీరియా ఏంటి? సెలెక్షన్ కమిటీ ఏ రకంగా సెలెక్షన్ చేశారు? దానికి బేసిస్ ఏంటి? నేను చాలా సర్టిఫికెట్స్ చూశాను. ఆ సర్టిఫికెట్స్ లో ఒక మెయిన్ సర్టిఫికెట్ నేషనల్ లెవెల్ లో ఇంటర్నేషనల్ లెవెల్ లో అనేది ఒక మెయిన్ సర్టిఫికెట్ తో పాటు ఇంకొకటి బ్యాకప్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. నేను చాలా సర్టిఫికెట్స్ లో ఒకటే సర్టిఫికెట్ పెట్టిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు చూశాను. మరి పారదర్శకంగా ఎంపిక ఎక్కడ జరిగింది?. నిజంగా ఎలిజిబుల్ అయిన స్పోర్ట్స్ పర్సన్స్ కి ఉద్యోగాలు అప్లై చేసుకున్న వాళ్ళకి అన్యాయం జరిగిందా ?లేదా? అనేది ఇవాళ మా తాలూకా సూటి ప్రశ్న?. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కాక్రోచెస్ గా ప్రశ్నించాలి. చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి నివాసాన్ని ముట్టడి చేయాలి. ఆర్చరీలో నేషనల్ లెవెల్ గోల్డ్ మెడలిస్ట్ అయిన దుర్గయ్య అనే క్రీడాకారుడికి ఉద్యోగం ఎందుకు నిరాకరించారు? అర్హులైన క్రీడాకారులను పక్కనబెట్టి, అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టడం ఎంతవరకు న్యాయం? - జీవోల్లో పచ్చి అబద్ధాలు – 'స్వర్ణాంధ్ర' పేరుతో మోసం.. ఏపీని 'గ్లోబల్ స్పోర్ట్స్ హబ్' చేస్తామని పెద్ద పెద్ద మాటలు రాశారు. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ని నేషనల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతారా? అంతే కాకుండా గ్లోబల్ హబ్ అని చెబుతున్నారు. అసలుఆంధ్రప్రదేశ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్టేడియంలు ఏమైనా ఉన్నాయా ? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు ప్రజలు ఏమైనా అమాయకులా? మీరు నోటికి వచ్చిన మాటలు జీవో లో పెట్టి ఆ స్పోర్ట్స్ కోటాని సడలింప చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా 380 మందికి ఉద్యోగాలు కల్పించి బ్యాక్ డోర్ లో అమ్ముకున్నారు. ఇవాళ ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీని వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? మీరు ఎవరిని తీసుకొస్తారు? తీసుకురండి. నేను చర్చకు సిద్దం. - జెన్ జీస్ (GenZ) కు ఇచ్చే సూపర్ సిక్స్ హామీల మోసం.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఏమైంది? ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున గత రెండేళ్లలో ఇవ్వాల్సిన 8 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? యూజీ, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన ఎందుకు ఆపేశారు? 18 ఏళ్లు దాటిన మహిళలకు ఇవ్వాల్సిన రూ. 1,500 ఏమైంది?. - సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేసే ధైర్యం ఉందా?.. ఉద్యోగాల భర్తీలో ఏ రకమైన అక్రమాలు జరగలేదని, పారదర్శకత ఉందంటే... సిబిఐ విచారణకు లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు లేఖ రాసే ధైర్యం నారా లోకేష్‌కు ఉందా? అని మార్గాని భరత్ సూటిగా ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో కూటమి ప్రభుత్వపు అక్రమాలపై కచ్చితంగా 'బొద్దింకల దండయాత్ర' తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుకాబోతోందని చెప్పారు. మరోవైపు వైయస్ఆర్‌సీపీ స్టూడెంట్స్ వింగ్, యూత్ వింగ్, కాలేజీ విద్యార్థులు కలిసి కూటమి అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళన చేసి... సీఎం చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తారని స్పష్టం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కొడుకు అయినంత మాత్రాన నారా లోకేష్‌కు ప్రత్యేక చట్టాలు ఏమీ ఉండవని.. తప్పు చేసినప్పుడు బాధ్యత వహించి, సమాధానం చెప్పాల్సిందని స్పష్టం చేశారు. ఈ మెగా డిఎస్సీ అక్రమాలపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించి, యువతకు క్షమాపణ చెప్పాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.