రాజమండ్రి: కూటమి పాలనలో పోలీస్ శాఖ ప్రజల ప్రాణాలు తీసే కీచకుల్లా మారిందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో జనసేన మద్దతుదారుడైన సాయికృష్ణను లాకప్ డెత్ చేస్తే, అదే సీఐ వేధింపుల భరించలేక మాదిగ సామాజిక వర్గానికి చెందిన దళిత యువకుడు లైవ్ లో సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత, వైయస్ జగన్ బాధితుల ఇంటికి వెళ్లేవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్‌లు సదరు సీఐపై కనీస చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు. రాజమండ్రిలో 112 ఏళ్ల చరిత్ర గల ఇన్నీస్ పేట కోఆపరేటివ్ బ్యాంకులోని రూ. 140 కోట్ల డిపాజిట్లను దోచుకోవడాని మ్యాక్స్ యాక్ట్ పరిధిలోకి మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, దీనిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. కల్తీ పాలు, స్టీల్ ప్లాంట్ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి.. వైయస్సార్సీపీ నేతలపై అక్రమ పీడీ యాక్టులు పెడుతూ కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని మార్గాని భరత్ హెచ్చరించారు. ఈ కూటమి ప్రభుత్వం జీవితకాలం అధికారంలోనే ఉంటుందని భావిస్తోందా?" అని ఆయన పోలీస్ ఉన్నతాధికారులను సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే.. - వైయస్. జగన్ వచ్చేదాకా పవన్ కళ్యాణ్ నిద్రపోయారా? విజయవాడ లాకప్ డెత్ ఉదంతంలో కూటమి నేతల కుటిల బుద్ధి బయటపడింది. మే మొదటి వారంలో సాయికృష్ణ లాకప్ డెత్ దారుణం జరిగితే.. నిన్నటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించలేదు. ఎప్పుడైతే ప్రతిపక్ష నేత వైయస్ జగన్ స్పందించి, బాధితుల ఇంటికి వెళ్లి ఆ తల్లికి భరోసా ఇచ్చారో.. అప్పుడు మాత్రమే చంద్రబాబు,డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయి, డీజీపీని పిలిపించి సదరు సీఐని సస్పెండ్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. - జనసేన నేతల సెటిల్మెంట్లు: లాకప్ డెత్‌కు గురైన సాయికృష్ణ స్వయంగా జనసేన పార్టీ మద్దతుదారుడు. సొంత పార్టీ మద్దతుదారుడిని పోలీసులు కొట్టి చంపేస్తే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నష్టనివారణ చర్యల కోసమే ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. దారుణంగా హత్య చేసిన సదరు సీఐతో, డిపార్ట్‌మెంట్‌తో కలిసి జనసేన నేతలు సెటిల్మెంట్ కోసం ప్రయత్నించడం దారుణం. ఈ దారుణ హత్యపై ఒక ఐపీఎస్ అధికారి, ఐజీ స్థాయి అధికారి పై దర్యాప్తునకు వేయడం ఏంటి? ఈ ప్రభుత్వం అత్యంత అహంకారంతో చట్టాలను అపహాస్యం చేస్తోంది. కూటమి రాజ్యంలో సాగుతోంది పూర్తిగా ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) అనడానికి విజయవాడలో జరిగిన మరో ఘటనే నిదర్శనం. విజయవాడలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక అమాయక దళిత యువకుడిని ఇదే సీఐ నాగరాజు అత్యంత దారుణంగా వేధించాడు. "నేను మాదిగ కులంలో పుట్టినందువల్లే సీఐ నాగరాజు నన్ను ఇంతలా వేధిస్తున్నాడు.. అతని వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా" అని సెల్ఫీ వీడియోలో చెబుతూ సదరు యువకుడు లైవ్ లోనే గుళికలు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే సీఐ హయాంలో ఒక యువకుడు లాకప్ డెత్ అయ్యాడు, మరొక దళిత యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత జరిగినా ఈ రాక్షస ప్రభుత్వం కళ్లు తెరవకపోవడం ఘోరం. సొంత పార్టీ మద్దతుదారుడికే ఈ గతి పడితే, ఇక వైయస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను ఇంకే స్థాయిలో వేధిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గమైన తునిలో ఒక చిన్నారి అదృశ్యమై 15 రోజులు దాటుతున్నా ఇంతవరకు ఆచూకీ లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉందని డబ్బా కొట్టుకునే పోలీసులకు ఆ చిన్నారిని వెతకడం చేతకావడం లేదు కానీ, హోంమంత్రి మేకప్ గురించి, ప్రతిపక్షాలపై తిట్ల పురాణంపై మాత్రం సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందించడం దారుణం. - పోలీసుల జాబితా సిద్ధం: చట్టాన్ని ఉల్లంఘించి అధికార పార్టీకి తొత్తులుగా మారి వైయస్సార్సీపీ కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న పోలీసు అధికారులందరి 'జాబితా' తయారు చేస్తున్నాం. చట్టపరిధిలో భవిష్యత్తులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర సాంస్కృతిక రాజధాని రాజమండ్రి నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. రాజమండ్రిలో నేడు బెట్టింగులు, స్పా సెంటర్ల పేరిట వ్యభిచారం, పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. టీడీపీకి చెందిన రెండు వర్గాల 'బ్లేడ్ బ్యాచ్' రౌడీషీటర్లు నగర నడిబొడ్డున విచ్చలవిడిగా కొట్టుకుంటున్నా లా అండ్ ఆర్డర్ పట్టించుకోవడం లేదు. - ప్రజా సమస్యలపై పోరాడికే అక్రమ అరెస్టులా?: నగరంలో పేకాట క్లబ్బులు నడిపేవారు చెప్పినట్లు వింటూ.. ప్రజల పక్షాన పోరాడుతున్న వైయస్సార్సీపీ నేతలను మాత్రం హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వైయస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు సీతారామకృష్ణపై పాత 10 కేసులు క్వాష్ అయినా, కేవలం 2 కేసులు ఉంటే.. నిన్న మరో అక్రమ కేసు బనాయించి ఏకంగా పీడీ యాక్ట్ (PD Act) పెట్టారు. జిల్లా కలెక్టర్ పూర్వాపరాలు చూడకుండా అధికార పార్టీ ఒత్తిడితో ఎలా పీడీ యాక్ట్ అమలు చేస్తారు?. వైయస్సార్సీపీ జెండా ఎగరేస్తామంటే కేసులు పెడతారా? ఈ బెదిరింపులకు భయపడేదిలేదు. హైకోర్టును ఆశ్రయించి సీతారామకృష్ణను గౌరవంగా బయటకు తీసుకువస్తాం. - 112 ఏళ్ల చరిత్ర గల 'ఇన్నీస్ పేట కోఆపరేటివ్ బ్యాంకు'పై కన్ను. రాజమండ్రి నగరానికి మకుటాయమానంగా ఉన్న 'ఇన్నీస్ పేట కోఆపరేటివ్ బ్యాంకు'ను దోచుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. 112 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, రూ. 140 కోట్ల పేదల డిపాజిట్లు ఉన్న ఈ బ్యాంకును.. 1964 సహకార చట్టం పరిధి నుంచి తొలగించి, 1995 మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ (MACS Act) కిందకు మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ బ్యాంకు గనుక మ్యాక్స్ యాక్ట్ పరిధిలోకి మారితే.. దీనిపై ప్రభుత్వ నియంత్రణగానీ, ఆర్‌బీఐ (RBI) నియంత్రణ గానీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. బైలాస్ (By-laws) తమకు నచ్చినట్లు రాసుకుని, ప్రస్తుత చైర్మన్ (సదరు ఈవీఎం ఎమ్మెల్యే బంధువు) శాశ్వతంగా, వంశపారంపర్యంగా చైర్మన్ పీఠంలో కూర్చునేలా చట్టాన్ని సవరిస్తున్నారు. - డిపాజిట్లు దివాళా తీసే ప్రమాదం: 2024-2026 మధ్య దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంకు, బెనారస్ మర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంకులు ఇలాగే మ్యాక్స్ యాక్ట్ పరిధిలోకి మారి, అవకతవకలకు పాల్పడి పూర్తిగా దివాళా తీశాయి. ఇన్నీస్ పేట బ్యాంకును కూడా అదే దారిలో దోచుకుని ప్రైవేట్ జాగీరుగా మార్చాలని చూస్తున్నారు. రాబోయే బ్యాంకు మహాసభకు వైయస్సార్సీపీ శ్రేణులు స్వయంగా వెళ్లి ఈ కుట్రను అడ్డుకుంటాం. - ఇండోర్ స్టేడియంపై క్రెడిట్ చోరీ.. రాజమండ్రిలో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిధులపై ఎంపీ పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. 2024 లో ఎంపీగా ఉన్న సమయంలో నేనే స్వయంగా రాజమండ్రిలో రూ. 58.50 కోట్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపించాను. ఇందులో భాగంగానే నాడు రాష్ట్ర ప్రభుత్వం రూ. 28 కోట్లను అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ చేసి 'ఖేలో ఇండియా' స్కీమ్ కింద కార్పస్ అకౌంట్‌లో ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, వాటా లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయదనే కనీస నాలెడ్జ్ కూడా లేదు. కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి గారు కూడా ఇవన్నీ దాచిపెట్టి వైయస్సార్సీపీ తెచ్చిన నిధులకు 'క్రెడిట్ చోరీ'కి పాల్పడటం అత్యంత దారుణం. - ప్రభుత్వ వైఫల్యాల చిట్టా... రాష్ట్రంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు చనిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు స్పందించలేదు. రాజమండ్రి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్తీ పాల మృతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సిబ్బంది కొరత కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు చనిపోతే కనీసం పర్యటించి బాధితులను పరామర్శించే తీరిక ముఖ్యమంత్రికి లేదు. ఈ నేపధ్యంలో విజయవాడ లాకప్ డెత్ మరియు దళిత యువకుడి ఆత్మహత్య ఘటనలపై తక్షణమే విచారణ జరిపి సదరు సీఐపై హత్య కేసులు నమోదు చేయాలి. రాజమండ్రి వైయస్సార్సీపీ బీసీ సెల్ నేత సీతారామకృష్ణపై పెట్టిన అక్రమ పీడీ యాక్టును తక్షణమే రద్దు చేయాలి. 112 ఏళ్ల చరిత్ర గల ఇన్నీస్ పేట కోఆపరేటివ్ బ్యాంకును మ్యాక్స్ యాక్ట్ పరిధిలోకి మార్చే కుట్రను వెంటనే విరమించుకోవాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలు చేస్తామని హెచ్చరించారు.