తాడేపల్లి: గడిచిన రెండేళ్ల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వకపోయినా 2.5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేస్తున్నట్టు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పాడని, వైయస్ఆర్‌సీపీ హయాంలో వైయస్ జగన్ పూర్తిచేసిన ఇళ్లకు స్టేజ్ అప్‌డేట్ చేసి తానే పూర్తి చేసినట్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల 2.5 లక్షల ఇళ్లు, గతేడాది 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు షో చేశాడని, అవన్నీ వైయస్ఆర్‌సీపీ హయాంలోనే పూర్తయినట్టు చెప్పారు. వైయస్ జగన్ ఫోటోలతో లబ్ధిదారుల చేతుల్లో ఉన్న ఇళ్ల పట్టాలే దానికి సాక్ష్యమని వివరించారు. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే 1,77,546 ఇళ్లు పూర్తి చేసినట్టు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పిన చంద్రబాబు, రెండేళ్లలో ఒక్కరికైనా ఇచ్చుంటే చూపించాలని కొరుముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - రెండేళ్లలో గజం స్థలం ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కట్టుకథలు, మోసాలే కానీ ఎన్నికల హామీలను నెరవేర్చిన పాపాన పోలేదు. చేస్తున్నదల్లా వైయస్ఆర్‌సీపీ హయాంలో వైయస్ జగన్ గారి కృషితో ఏర్పాటైన కంపెనీలను తన ఘనతగా చెప్పుకోవడం, వైయస్ జగన్ పూర్తిగా చేసిన పనులకు రిబ్బన్ కటింగ్‌లు చేసి పబ్లిసిటీ చేసుకోవడమే. కంపెనీల ఏర్పాటు చేసే పేరుతో విలువైన భూములను బినామీలకు దోచిపెట్టడం తప్పించి, నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సెంటు స్థలం ఇచ్చిన పాపానపోలేదు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన బాబు నేటికీ ఒక్క గజం స్థలం పేదలకు ఇవ్వలేదు. 2019-24 మధ్య వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లకు రంగులేసి తానే కట్టించినట్టు చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డాడు. - బహిరంగ సభలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు వైయస్ఆర్‌సీపీ హయాంలో పూర్తయిన ఇళ్లకు స్టేజ్ అప్‌డేట్ చేసి తామే నిర్మించినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు. గతేడాది నవంబర్‌లో పేదలకు 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరిట షో చేశాడు. అప్పట్లో అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లు 2021-22లో వైయస్ జగన్ గారు కట్టించినవే. అయినా సిగ్గులేకుండా మరో 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ పేరిట చంద్రబాబు మళ్లీ క్రెడిట్ చోరీకి పాల్పడ్డాడు. ఈ 2.5 లక్షల ఇళ్లలో లక్ష వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లు. మిగిలిన 1.5 లక్షల ఇళ్లు సాధారణ ఇళ్లు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లోనే 5,50,314 ఇళ్లు నిర్మించామని, 2,50,893 ఇళ్లకు గృహప్రవేశం చేశామని సూళ్లూరుపేట బహిరంగ సభలో చంద్రబాబు పచ్చి అబద్ధం చెప్పాడు. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలను వినలేక సభకు వచ్చిన వారు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. 2014-2019 మధ్య టీడీపీ హయాంలో 6 లక్షల ఇళ్లను మంజూరు చేసి కేవలం 20 వేల ఇళ్లను పూర్తి చేయడానికి చంద్రబాబుకి ఐదేళ్లు పట్టింది. - వైయస్ఆర్‌సీపీ హయాంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ 2019-24 మధ్య వైయస్ఆర్‌సీపీ హయాంలో 31 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17 వేలకుపైగా వైయస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే వైయస్ జగన్ గారు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులివ్వడం జరిగింది. వీటికి 2.62 లక్షల టిడ్కో ఇళ్లు అదనం. కాగా, ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశాం. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకుపైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు స్లాబ్ పూర్తయినవి, 99 వేల ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. ఇందులో చాలా వరకు తుది దశ నిర్మాణాలూ పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్‌డేట్ చేయని పరిస్థితి. - వైయస్ఆర్‌సీపీ హయాంలోనే 1,77,546 ఇళ్లు పూర్తి 2019లో వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాకనే టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం జరిగింది. ప్రతిచోటా ఇళ్ల నిర్మాణంతో పాటు నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించడం జరిగింది. మొత్తం 2,62,212 ఇళ్లు అవసరమని గుర్తించి వాటిలో 1,77,546 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు దాదాపు లక్ష ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే 1,77,546 ఇళ్లు పూర్తి చేసినట్టు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనుల్లో కూడా దాదాపు 80 శాతం పూర్తి చేశాం. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన 21 నెలల పాలనలో టిడ్కో ఇళ్లకు ఎక్కడా స్లాబులు కూడా వేసిన దాఖలాలు లేవని కొరుముట్ల శ్రీనివాసులు స్పష్టంచేశారు.