తాడేపల్లి: ప్రభుత్వ వైఫల్యాలను, వ్యవస్థల్లోని లోపాలను సాక్షి పత్రికలో ఎత్తి చూపుతుంటే కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందని, అక్రమ కేసులతో మీడియా గొంతు నొక్కె ప్రయత్నం జరుగుతోందని వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సాక్షి మీడియాపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటి చర్యలతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరింత పెరుగుతుందే తప్ప, తగ్గదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యథేచ్చగా ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, వీటిని ఇలాగే కొనసాగిస్తే ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కూడా అనుమానమేనన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... పోలీసుల కష్టాల గురించి రాస్తే కేసా..? కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు రోజురోజుకీ పతనమైపోతున్నాయి. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేయడం లేదు. కుట్రలు, కుతంత్రాలతో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లుతోంది. ప్రజలకు ఎప్పటికప్పుడు నిజాలను తెలియజేస్తుందన్న అక్కసుతో సాక్షి పత్రిక విజయవాడ కార్యాలయం మీద పోలీసులతో దాడి చేయించారు. మీడియా స్వేచ్ఛకు విరుద్ధంగా అర్ధరాత్రి 12.30 నుంచి 1.30 గంటల వరకు పత్రికా కార్యాలయంలో హల్ చల్ చేసి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు. ఆగస్టు 31 నాటికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అనేకమందికి ప్రమోషన్లు రాకుండానే రిటైరయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, వారికి తమ నిరసన తెలియజేసే స్వేచ్ఛ కూడా లేదని.. నోరెత్తలేని పోలీసుల పక్షాన సాక్షిలో సంచలన కథనం ప్రచురితం అయ్యింది. ఇదే ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి మీద పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడితోనే ఫిర్యాదు చేయించి కేసు నమోదు పెట్టించారు. రాయలసీమకి చెందిన ఒక ఐపీఎస్ చేస్తున్న అవినీతి, అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు 26.07.2025న సాక్షి పత్రిక మీద గతంలో కేసు పెట్టారు. అంతకు ముందు మే 8వ తేదీ నాడు విజయవాడలో తన ఇంట్లో ఉన్న సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్ లేకుండా వెళ్లి పోలీసులు ఆయన ఇంట్లో హంగామా సృష్టించారు. భయపెట్టే ప్రయత్నం చేశారు. ప్రశ్నించే గొంతు నొక్కే కుట్రలు బాధితుల పక్షాన పోరాటం చేయడం, వారి తరఫున గొంతెత్తడమే నిజమైన జర్నలిజం అనిపించుకుంటుంది. ఇక్కడ సాక్షి పత్రిక చేసింది కూడా అదే. కానీ ప్రభుత్వ వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపుతుంటే వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వారు చేసే దురాగతాలను చూస్తూ ఊరుకోవాలనేది వారి సిద్ధాంతమా? ఇలాంటి నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదం. వార్తను వార్తగా రాయడం కూడా తప్పేనా? సాక్షి పత్రిక మీద అర్ధరాత్రి పోలీసులు చేసిన దాడిని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. సాక్షితోపాటు మరికొన్ని ఛానెళ్లు రాకుండా చేసి మీడియా స్వేచ్ఛను అడ్డుకోవాలని చేస్తున్న కుట్రలను త్వరలో ప్రజలే తిప్పికొడతారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మొదట సోషల్ మీడియా మీద దాడులు చేసి అక్రమంగా వైయస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి వేధించారు. ఆ తర్వాత తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయొద్దని టీవీ, యూట్యూబ్ ఛానెళ్లను నోటీసులిచ్చి బెదిరించారు. ప్రశ్నించే గొంతు అనేది ఉండకూడదు అనేది కూటమి ప్రభుత్వ నైజంగా కనిపిస్తోంది. ఎల్లకాలం తామే అధికారంలో ఉంటామని కూటమి నాయకులు కలల్లో బతుకుతున్నారు. అధికారం ఉంది కదా అని నచ్చినట్టు వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఉంటారని అనుకోవద్దు. ఏడాది పాలనతోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇలాగే చేస్తూ పోతే కూటమి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కూడా కష్టమే. అక్రమ కేసులు, వేధింపులతో వైయస్సార్సీపీని లేకుండా చేయాలనుకుంటున్నారు. ఇంతకన్నా అవివేకం ఇంకోటి ఉండదు.