వైయ‌స్ జగన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు  

ఇంధిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు మొద‌లు

శాఖల వారీగా బాధ్యతలు అప్పగింత

వేదిక ఏర్పాట్ల బాధ్యత కృష్ణా జిల్లా కలెక్టర్‌కు

బందోబస్తు, ట్రాఫిక్‌ బాధ్యతలు డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఏడీజీకి

పనుల్లో ఆర్‌ అండ్‌ బీ, ట్రాన్సుపోర్ట్, ట్రాన్స్‌కో, ఫైర్, మున్సిపల్‌ తదితర శాఖలు 

15 శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ జీఏడీ మెమో జారీ

 అమరావతి: అఖండ విజయం సాధించిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆ రోజు మధ్యాహ్నం 12.23 గంటలకు జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలు అప్పగించింది. అవసరమైన సౌకర్యాలు సమకూర్చేలా 15 ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం చేసే ప్రధాన వేదిక, సభకు, ఆహ్వానితులకు అవసరమైన ఏర్పాట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. సభకు అవసరమైన బందోబస్తు, వీఐపీల భద్రత, ట్రాఫిక్‌ నిర్వహణ, వాహనాల పార్కింగ్, కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానితులు వేచి చూసే అవకాశం లేకుండా చూడటం వంటి బాధ్యతలను డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఏడీజీలకు అప్పగించారు.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికల పంపిణీ ఏర్పాట్లను డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొటొకాల్, జీఏడీ అసిస్టెంట్‌ సెక్రటరీకి అప్పగించారు. గవర్నర్‌తో సీఎం, సభ్యుల గ్రూప్‌ ఫొటో,  మీడియా కవరేజ్, ఫొటోగ్రాఫర్స్, ఎల్‌ఈడీ స్క్రీన్స్, ప్రసార మాధ్యమాల ఏర్పాట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌కు అప్పగించారు. సభా ప్రాంగణంలో క్లీనింగ్, రోలింగ్, లెవలింగ్, వాటరింగ్‌ పనులు పట్టణాభివృద్ధి(ఎంఎయూడీ) ప్రిన్సిపల్‌ సెక్రటరీ, మంచినీటి సరఫరా బాధ్యతను విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌కు, తాత్కాలిక టాయిలెట్స్‌ ఏర్పాటు పనులు సీఆర్‌డీఏ కమిషనర్‌ పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బారికేడ్లు, వీఐపీ బారికేడ్లకు మెస్, వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లు, సిట్టింగ్, ఫ్యాన్లు, లైటింగ్‌ వంటి ఏర్పాట్లు ట్రాన్సుపోర్టు, ఆర్‌అండ్‌బి, విద్యుత్‌ శాఖలకు అప్పగించారు. 

వీవీఐపీల ఏర్పాట్లను డీజీపీ సహకారంతో ప్రొటొకాల్‌ డైరెక్టర్‌ చూడాల్సి ఉంది. మినిట్‌ టు మినిట్‌ కార్యక్రమ షెడ్యూల్‌తోపాటు ముద్రణాపరమైన బాధ్యతలను ప్రొటోకాల్‌ డిప్యూటీ సెక్రటరీకి అప్పగించారు. జీఏడీ, విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సర్వీసు డీజీ, హార్టీకల్చర్‌ డైరెక్టర్, వైద్యఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఏపీ ట్రాన్స్‌కో, ఐటీఇ అండ్‌ సిలకు పలు బాధ్యతలు అప్పగించారు. ఏర్పాట్లను పర్యవేక్షించేలా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) నుంచి లైజనింగ్‌ అఫీసర్లుగా ప్రభుత్వ అదనపు కార్యదర్శి (ప్రొటోకాల్‌) ఎం.అశోక్‌బాబు, డిప్యూటీ సెక్రటరీ ఇ.విశాలక్షిలను నియమించారు. 

 

Back to Top