వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామ‌కృష్ణారెడ్డి

పథకాలు, సంస్కరణల్లో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసిన  సీఎం వైయ‌స్ జగన్‌ 

ప్రభుత్వం చేస్తున్న మంచికి.. అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారు

విజయవాడలో కొండ పై అమ్మవారు...కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారు

విజయవాడ:  వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ చేస్తున్న‌ మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ.. అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024-డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్‌ జగన్‌.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు.  పథకాలు, సంస్కరణల్లో సీఎం వైయ‌స్ జగన్‌ బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు. అణగారిన వర్గాలనుపైకి తీసుకువచ్చే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలి.

గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదు. సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలనూ తీర్చిదిద్దిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌కే దక్కింది. సచివాలయ ఉద్యోగాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయి. మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం వైయ‌స్ జగన్‌ అమలు చేశార‌ని సజ్జల పేర్కొన్నారు.

 టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి. సీఎం వైయ‌స్ జగన్‌ అర్హులైన వారిని వెతికి మరీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగినంత సంక్షేమం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగలేదు. ఎన్నికలు రాబోతున్నాయ్‌. మీ భవిష్యత్తులు మారాలంటే.. మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుంది. మీడియాను మేనేజ్‌ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి.. అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించార‌ని సజ్జల తెలిపారు.

కొత్తగా రూపుదిద్దుకుంటున్న పోర్టులు రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తాయి. 11 మెడికల్ కళాశాలల ద్వారా  దేశానికి కావాల్సిన వైద్యులను ఏపీ అందించబోతోంది. అంబేద్కర్‌కు హిమాలయాలంత విగ్రహం పెట్టినా సరిపోదు. సీఎం వైయ‌స్ జగన్‌ అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం రూపుదిద్దుకుంది. అంబేద్కర్ విగ్రహం గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటుంది. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. విజయవాడలో కొండ పై అమ్మవారు...కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారు. దళితుల నుంచి మరింత మేధావులు రావాలనేదే సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆలోచన. ఆయన చేపట్టిన యజ్ఞంలో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top