పకడ్బందీగా ప్లాన్‌ చేసిన స్కామ్‌ కేసులోనే చంద్రబాబు అరెస్ట్‌

 వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

స్కామ్‌లో దర్యాప్తే జరుగుతోంది.. రాజకీయాలు కాదు 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉంది

ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదంటూ బాబు దబాయిస్తున్నారు

2021 డిసెంబర్‌లో(9-12-2021) సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఎఫ్‌ఐఆర్‌ కంటే ముందే జీఎస్టీ నిఘాలో స్కామ్‌ బయటపడింది

ఇది 100 శాతం అప్పటి ప్రభుత్వ ఎయిడెడ్‌ స్కాం

ఆరోపణలున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం సాధారణం

తాడేప‌ల్లి: పకడ్బందీగా ప్లాన్‌ చేసిన స్కామ్‌ కేసులోనే చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆయ‌న‌ మండిపడ్డారు.. చంద్రబాబు అరెస్ట్‌లో ఎలాంటి దురుద్దేశాలు లేవు.. బలమైన ఆధారాలతోనే సిట్ వేశాం.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందన్నారు.. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయన్నారు. స్వాతంత్ర్య భారత దేశంలో అత్యంత హేయమైనది ఆర్ధిక నేరం.. స్కీమ్‌ పేరుతో స్కామ్‌ చేశారని ఆయ‌న విమర్శించారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కాంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్‌ అయ్యాక.. రాజకీయ దురుద్దేశాలతోనే తనను అరెస్ట్‌ చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై సజ్జల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు. 

 

 ఎలాంటి దురుద్దేశాలు లేవు..దర్యాప్తులో భాగంగానే అరెస్ట్‌:
చంద్రబాబునాయుడిని స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ స్కాం దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉదయం సీఐడీ సిట్‌ విభాగం అరెస్ట్‌ చేసింది. 
ఒక నేరానికి సంబంధించి దర్యాప్తు సంస్థ తన దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తిపై ఖచ్చితమైన ఆధారాలు ఉన్నప్పుడు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం సాధారణం. 
ఈ కేసులో అసలు విషయం పక్కకు పోయి రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ చంద్రబాబు సహా టీడీపీ, పచ్చ మీడియా చెప్తోంది. 
వాస్తవాలేంటో చెప్పాలని మేం ప్రయత్నం చేస్తున్నాం. 
పూర్తి నిగ్రహం, సంయమనంతో ఎలాంటి దురుద్దేశాలు లేకుండా దర్యాప్తులో భాగంగా బలమైన సాక్షాధారాలు చేతిలో ఉన్న తర్వాతనే సిట్‌ ఈ రోజు ఈ చర్యకు పూనుకుంది. 
కేసు ఫైల్‌ అయిన తేదీ నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే జగన్మోహన్‌రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం ఎంత సంయమనంతో ఉంది..ఎంత స్వతంత్య్రంగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. 
ఏ ఆరోపణ మీదైతే, ఏ కేసుకు సంబంధించైతే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారో అది చరిత్రలో ఒక వరస్ట్‌ డీప్‌ రూటెడ్‌ ఎకనామిక్‌ అఫెన్స్‌. 
లేని ఒక బోగస్‌ సంస్థలను క్రియేట్‌ చేసి ప్రపంచంలో ఒక ప్రముఖ సంస్థ పేరు చెప్పి స్కాం చేశారు. దానిపేరిట ప్రభుత్వ సొమ్మును డైవర్ట్‌ చేశారు. 
ఇది ఒక్క రాత్రిలో వచ్చింది కాదు..దీని ఎఫ్‌ఐఆర్‌ 09.12.2021నాడు ఫైల్‌ అయ్యింది. దాదాపు రెండేళ్లయ్యింది. 
దీని ఆధారంగా సీఐడీ దర్యాప్తును కొనసాగిస్తూ చాలా మందిని విచారించింది..అరెస్టులు కూడా చేసింది. 

తనను అరెస్ట్‌ చేస్తారని చంద్రబాబుకు ముందే తెలుసు:
ఈ స్కాంకు సంబంధించి నేరుగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్వాల్వ్‌ అయ్యాడని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. 
ఈ అరెస్టు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇది అన్యాయం, ఘోరం అంటూ నోటీసులు లేకుండా అరెస్టు చేశారని అంటున్నాడు. 
చంద్రబాబుకు తెలుసు...కేసు బలంగా ఉందని, నేరారోపణ బలంగా ఉందని తెలుసు. అందుకే రెండు రోజుల క్రితం కూడా తనని అరెస్ట్‌ చేస్తారని అంటున్నాడు. 
ఎకనామిక్‌ అఫెన్స్‌లో నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదు. 
ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేకుండానే నన్ను అరెస్టు చేస్తున్నారని అంటున్నాడు. 
ఎవర్ని దబాయించడానికి చంద్రబాబూ..? ఎఫ్‌ఐఆర్‌ అంటే దాని పేరే ప్రాథమిక రిపోర్ట్‌. 
2017–18లోనే డైరెక్టర్‌ జనరల్, జీఎస్టీ ఇంటలిజెన్స్, పూణే వారి విచారణలో చంద్రబాబు అక్రమంగా విడుదల చేసిన రూ.370 కోట్లలో రూ.241 కోట్లు డైవర్ట్‌ అయ్యిందని చెప్పింది. 
అది షెల్‌ కంపెనీల ద్వారా వెళ్లిందని కూడా వారు విచారణ చేశారు. 
చంద్రబాబు దీనిలో ఇన్వాల్వ్‌ అయ్యాడనేది దర్యాప్తు చేయకపోయినా మీడియాతో సహా అందరికీ తెలుసు. 
2017–18లోనే ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందనేది తెలిసింది. 
ఎఫ్‌ఐఆర్‌లో బాబు పేరు పెట్టకపోవడంలోనే జగన్మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం నిజాయితీ, వ్యక్తిగతంగా కక్షసాధింపునకు వెళ్లని మా ముఖ్యమంత్రి స్వభావం, ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ నిజాయితీ కూడా కనిపిస్తోంది. 
ఏదన్నా చేయాలంటే ఆనాడే చంద్రబాబు పేరు పెట్టి ఉండేవాళ్లు. 
అన్నీ ఆధారాలు అప్పటికే ఉన్నా...నిజంగా దర్యాప్తులో తేలాలి..రాజకీయ ప్రమేయం ఉండకూడదని జగన్‌ గారు అనుకున్నారు కాబట్టే రెండేళ్ల తర్వాతే అరెస్ట్‌ జరిగింది. 
చంద్రబాబు నన్ను ఉరి తీయండి అంటున్నాడు..ఎందుకు తీస్తారు...? 
అయ్యా నువ్వే ప్లాన్‌ చేశావ్‌...నీ దగ్గరే ఏదో జరిగింది అని ప్రశ్నిస్తారు..సమాధానం ఇచ్చి వెళ్లు. చివరికి కోర్టు డిసైడ్‌ చేస్తుంది...
కేవలం నీ రాజకీయ పరపతిని ఉపయోగించుకుని నువ్వు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవాలనుకుంటే కుదరదు. ఆరోజులు అయిపోయాయి. 
ఎంత కాలం మీరు తప్పించుకుని వెళ్తారు..? 
ఈ రోజు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవే కాదు..మొన్న ఇన్‌కం ట్యాక్స్‌ నోటీసుల్లోనూ స్పష్టమైన ఆధారాలున్నాయి. 
స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను దుర్భుద్ధితో పెట్టాడేమో అనే అనుమానాలు వచ్చేలా ఉన్నాయి. 
2015 జూన్‌లో ఒక జీవో విడుదల చేశారు. దాని ప్రకారం రూ.3300 కోట్ల ప్రాజెక్టు సీమెన్స్, స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అంతా కలిసి అమలు చేస్తారు. 
దీనిలో 90 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సీమెన్స్‌ పెట్టుకునేట్లు, 10 శాతం ప్రభుత్వం పెట్టేలా జీవోలో స్పష్టం చేశారు. 
ఈ ఫైల్‌ను సీఎం ఈజ్‌ ఇంట్రస్టెడ్‌ అని ముందుకు కదిపారు. 
కానీ ఎంవోయూలో మాత్రం ఏపీ స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్, సీమెన్స్, డిజైన్‌ టెక్‌ అనే కంపెనీల మధ్య జరిగింది. 
ముందు జీవోలో చెప్పింది ఎక్కడా ప్రస్తావన లేదు. ఇందులో నేరుగా రూ.370 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అని రాసుకున్నారు. 
సీమెన్స్‌ ఇవ్వాల్సిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ప్రస్తావనే లేదు. 
ప్రైవేటు సంస్థ ప్రస్తావన పోయి వంద శాతం ప్రభుత్వ ప్రాజెక్టుగా మార్చేశారు. 
ప్రజల కళ్లుగప్పి ఓ పెద్ద మాయా ప్రపంచాన్ని చూపించి అసలు విషయం పక్కన పెట్టారు. 
దీని పేరుతో ప్రభుత్వ సొమ్ము తీసి పక్కన వారికి అప్పజెప్పారనేది చివరికి నిరూపితం అయ్యింది. 
ఆయన ఉద్దేశాలు వేరే కాబట్టి...రూ.370 కోట్లు పెట్టి ప్రాజెక్టు తెచ్చే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. 
గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తిని స్కిల్‌ డెవలెప్‌మెంటుకు ఎండీగా పెట్టి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ కలిసి పాత్రధారులుగా ఉంటే సూత్రదారి చంద్రబాబు. 
ఆ డబ్బులో నుంచి రూ.240 కోట్లు షెల్‌ కంపెనీల ద్వారా పక్కకి వెళ్లిపోయిందని జీఎస్టీ విచారణలో తేలింది. 
నా ఉద్దేశం అయితే మొత్తం రూ.370 కోట్లూ పక్కకి పోయి ఉంటాయి. సీమెన్స్‌కు ఒక్క పైసా కూడా వెళ్లలేదు. 
సీమెన్స్‌కి కాకుండా డిజైన్‌ టెక్‌ కంపెనీకి సొమ్మంతా వెళ్లింది. అక్కడ నుంచి ఈ నిధులు డైవర్ట్‌ అయ్యి వివిధ షెల్‌ కంపెనీల ద్వారా యోగేష్‌ గుప్తా, మరికొంత మంది హవాలా ద్వారా మనీ ల్యాండరింగ్‌ చేసి చంద్రబాబు వద్దకు వచ్చాయని దర్యాప్తులో తేలుతోంది. 
ఆయన ప్రమేయంతో జరిగిన తంతు ఓ వైపు అయితే...అప్పటి సీఎం ఆదేశాల మేరకు జరిగిందనేది నోట్‌ ఫైల్స్‌ కూడా ఉంది. 
ఈ దర్యాప్తులో భాగంగా ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు మెజిస్ట్రేట్‌ మందు 164 స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. 
ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే సీఐడీ ఈ రోజు చర్యలకు దిగింది. 

2017లోనే జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ స్కాంను బయటపెట్టింది:
2017–18లో జీఎస్టీ ఇంటలిజెన్స్‌ వారు బయటపెట్టిన తర్వాత మరో వ్యక్తి ఈ కుంభకోణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు.
నిజంగా ఏమీ లేకపోతే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబే దీనిపై విచారణ చేపట్టి ఉండాల్సింది. 
విచారణ చేపట్టకపోగా...కీలక ఆధారాలున్న ఫైళ్లను పక్కకు తప్పించారు. 
దీంట్లో పెద్ద ట్విస్ట్‌ ఏంటంటే...సీమెన్స్‌ గ్లోబల్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు దీని గురించి అసలు తెలియదు. సీమెన్స్‌ పేరు వాడుకున్నారు. 
సీమెన్స్‌ ఇండియా కింద ఇన్ఫోటెక్‌ పెట్టిన సుమన్‌ బోస్‌ అనే వ్యక్తి, సుబ్బారావు కలిసి.. డిజైన్‌ టెక్‌ వినాయక్‌ కలిసి చంద్రబాబు నేతృత్వంలో ఒక పెద్ద స్కాంకి సృష్టికర్తగా మారారు. 
ప్రాజెక్టే లేదు..దాన్ని నిధులను పక్కదారి పట్టించేందుకే ప్రాజెక్టును క్రియేట్‌ చేశారు. 
రూ.370 కోట్లు ప్రజాధనాన్ని బయటకు పంపడానికి పథకం ప్రకారం డైవర్ట్‌ చేశారు. 
ఇందులో ఈడీ ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేసింది. రూ.13 కోట్లు అటాచ్‌ చేసింది. 
సీఐడీ ఈ కేసులోకి వచ్చేటప్పటికే ఈ స్కాం గురించి జీఎస్టీ ఇంటిలిజెన్స్, ఈడీలు వద్ద విషయం ఉంది. 
సీఐడీ విచారణ చేపట్టాక తీగంతా చంద్రబాబు వద్దకు వెళ్లింది. 
ఇన్ని ఆధారాలు ఉన్నా ఆయన్ను ప్రశ్నించకూడదు అంటే ఎలా..? 
రెండేళ్లుగా జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి ఎన్నో సార్లు వివరాలు వెల్లడి అయ్యాయి. 
మాకేం నోటీసులు లేవు..ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అరెస్టు చేస్తున్నారు అని తప్పించుకోవాలని చూస్తే ఎలా..? 
తనకు ఎప్పుడు తెలిసిన విద్యను ప్రదర్శించబోతే దాన్ని ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఆయన భ్రమే. కేసు అంత బలంగా ఉంది. 

కక్షసాధించాలనుకుంటే విచారణకు రెండేళ్లెందుకు..?:
కక్షసాధింపు చేయాలనుకుంటే అమరావతి స్కాం, స్కిల్‌ స్కాం, ఫైబర్‌ గ్రిడ్‌ స్కాం..నిన్న ఇన్‌కం ట్యాక్స్‌ నోటీసులు చూస్తే చంద్రబాబు నైజం స్పష్టమవుతోంది. 
షెల్‌ కంపెనీల ద్వారా ఆయన ఎలా అక్రమాలకు పాల్పడతారో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. 
చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందనే నిగ్రహంగా ఉండటం వల్లే ఇంత టైం పడుతోంది. 
ఒక వేళ రాజకీయంగానే చేయాలనుకుంటే నిజంగా ఇది సమయం కూడా కాదు. 
రాజకీయాలు వేరు..ఈ కేసులు వేరు...
రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఆయన్ను అరెస్ట్‌ చేసి తద్వార ప్రజల్లోకి పోలేని పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ లేదు. 
అలాంటి అవసరం కూడా మా పార్టీ కూడా లేదు. ఆయన ప్లాన్‌ చేస్తున్నాడు. 
తాను ఎలాగూ అరెస్ట్‌ అవుతున్నానని గత వారం రోజులుగా ఒక గ్యాంబిల్‌ ఆడుతున్నాడు. 
అరెస్ట్‌ జరగకపోతే ఏమీ లేదు కాబట్టి చేయలేదు అంటాడు...రాజశేఖరరెడ్డి ఏమీ చేయలేకపోయాడు..జగన్‌ గారు కూడా ఏమీ చేయలేదు అని చెప్పాలని ప్రయత్నం. 
నేను అసలు తప్పే చేయలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు...
నేను అరెస్ట్‌ కాలేదు కాబట్టి నిజాయితీ పరుడిని అని చెప్పుకునే ప్రయత్నంచేస్తున్నాడు. 
ముందే చెప్పాడు కాబట్టి కక్షసాధింపుతో చేశారని ప్రజలు అనుకుంటారని, భయపడతారని ఆయన కోరిక. 
ప్రజలు అమాయకులు కాదు..వైఎస్సార్సీపీ పిరికితనంతో లేదు. 
ఇవన్నీ చంద్రబాబు భ్రమ. ఈ డొంకతిరుగుళ్లు ఎందుకు..? 

అర్ధరాత్రి అరెస్ట్‌ చేసే నైజం మాది కాదు:
అర్ధరాత్రి అంటూ ఆరోపిస్తున్నారు..బాగా తెల్లవారిన తర్వాతే ఆయన్ను అరెస్టు చేశారు. 
జగన్‌ గారికి అలాంటి అలవాట్లు లేవు..ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం కూడా ఆలా చేయదు. 
అర్ధరాత్రి వెళ్లి లేపి అరెస్ట్‌ చేయడం అనేది చంద్రబాబుకు అలవాటు. 
ప్రభుత్వానికి చెందిన ఒక దర్యాప్తు సంస్థ పూర్తి స్వతంత్రంగా, నిజాయితీగా నిబద్ధతతో చేసిన దర్యాప్తులో భాగంగా సాక్షాధారాలను బట్టి అరెస్టు చేశారు. 
ప్రధాన సూత్రదారి, పాత్రధారితో పాటు లబ్ధిదారుడు కూడా ఆయనే అని తేలింది కాబట్టే అరెస్టు చేశారు. 
కేసుకు సంబంధించిన అనుమానాలు నివృతి చేసుకునేందుకు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెడతారు. 
రాజకీయ కక్ష ఉంటే రెండేళ్ల పాటు దర్యాప్తు ఎందుకు..? 
మేం అధికారంలోకి వచ్చేసరికి జాతీయ సంస్థలు విచారణ చేశాయి. వాటిని తీసుకుని వేగవంతం చేసి ఉంటే ఎప్పుడో అయిపోయేది కదా? 
రాజకీయాల్లో చంద్రబాబు జోలికి ఎవ్వరూ వెళ్లకూడదనే రాజ్యాంగం ఏమైనా ఉంటే చెప్పండి..
ఇప్పుడు ఎక్కడకు తీసుకెళ్తున్నారు.. ఉరికంబానికి తీసుకెళ్లడం లేదు కదా..? 
ఆయనకు ఏ రోజో తెలుసు..ఇది జరుగుతుందని..
అన్ని వ్యవస్థల్లో ఆయన ఉంటాడు కదా..బహుశా అరెస్ట్‌ చేస్తారని తెలిసే రెండు రోజుల క్రితం మాట్లాడి ఉంటాడు. 
అన్నిటికీ తాను అతీతుడిని అనే భ్రమలను పక్కన పెట్టాలి. 
చట్టప్రకారం పోలీసులు వెళ్తే వీళ్లందరూ ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారు..? 
శాంతిభద్రతల సమస్య క్రియేట్‌ చేసే అవకాశం ఉంది కాబట్టే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వాళ్లు చేస్తున్న దానివల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. 

రాజకీయ పార్టీలు ఈ స్కాం గురించి తెలుసుకుని మాట్లాడాలి:
ఇతర పార్టీలకు అసలు ఈ స్కాం గురించి ఏం తెలుసని కక్షసాధింపు అంటున్నాయి..? 
బాధ్యతాయుతమైన పార్టీలు, నేతలు అయితే కేసును చదవవచ్చు కదా..? 
ఎఫ్‌ఐఆర్‌లోనే అన్నీ ఉంటే...ఇక విచారణ ఎందుకు..? 
మాట్లాడే రాజకీయ పార్టీ నేతలు ఒక వైపే చూస్తున్నారు..టీడీపీ అయితే పూర్తిగా దబాయిస్తున్నారు.
ఏ కక్ష సాధింపులైతే చంద్రబాబుకు అలవాటో దాన్ని జగన్‌ గారికి ఆపాదించాలని చూస్తున్నారు. 
లోకేశ్‌ మర్యాదగా పోతే ఎందుకు రానివ్వరు..? అయినా ఆయన వచ్చి ఏం చేస్తాడు..? 
తండ్రి వద్దకు వెళ్తానంటే ఎవరు వద్దంటారు..? 
ఏం జరిగిందని అక్కడ..? అక్కడకు వెళ్లి రచ్చ చేయాలని చూస్తేనే సమస్య. 
వాళ్లు అడగాలనుకున్న నాలుగు ప్రశ్నలు అడుగుతారు.. మిగతావన్నీ జరగాల్సిన రీతిలో జరుగుతాయి. 
మేం కానీ, మా లీడర్లను అందర్నీ సిద్ధంగా ఉంచుతాం. కేసులో వాస్తవాలేంటో సిద్ధంగా ఉంచుతాం. 
దీనిలో ఎవరికి అనుమానాలు ఉన్నా ప్రశ్నించవచ్చు. పొద్దుపోని మాటలు వద్దు. 
కక్షసాధింపు, ఇంకేదో అంటూ మాటలు అనవసరం. 
రూ.370 కోట్లలో రూ.270 కోట్లు షెల్‌ కంపెనీల ద్వారా బయటకు వెళ్లాయని నేషనల్‌ ఏజెన్సీ 2017లోనే చెప్పింది. 
దాన్ని వదిలేసి ప్రజాసమస్యలపై పోరాడుతుంటే అరెస్ట్‌ చేస్తున్నాం అనడం హాస్యాస్పదం. 
కక్షసాధింపు ఉంటే ఇలా ఉండదు..ఇంకోరకంగా ఎప్పుడో ఉండేది. 
ఏమీ లేని, వృద్ధుడుపై కక్షసాధింపు చేయాల్సిన అవసరం మాకు లేదు. 

నేరం చేస్తే ఓల్డ్, యంగ్‌ అనేమీ ఉండదు...
75 ఏళ్ల వాళ్లని ఎక్కడా అరెస్ట్‌ చేయలేదా..?లైఫ్‌ ఏమీ వేయలేదుగా..తీసుకొచ్చి ప్రశ్నిస్తారు..అవసరమైతే కస్టడీకి అడుగుతారు. 
నాకు బీపీ ఉంది అంటున్నాడు..అనారోగ్యం సడన్‌గా వస్తుందా..? 
నిన్నటి వరకూ గొంతెత్తి అరుస్తూ తిరుగుతున్నాడే...ఉదయం లేవగానే హైపర్‌ టెన్షన్‌ ఎలా వస్తుంది..? 
చౌకబారు పొలిటికల్‌ జిమ్ముక్కుల వల్ల ఉపయోగం ఉండదు..కేసును ఎదుర్కో ... దాంట్లోంచి బయటపడు. 

టీడీపీ ఎప్పుడో ప్రజలకు దూరం అయ్యింది:
తెలుగుదేశం తన ఉనికిని కోల్పోయింది. వారు ప్రజల సమస్యలు మర్చిపోయారు. 
వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడూ కూడా ప్రజల గురించి ఆలోచించలేదు..ఇప్పుడు కూడా ఆలా లేదు. 
జనాన్ని భ్రమల్లో పెట్టి అధికారంలోకి రావాలనుకున్నారు. గతంలో అధికారంలోకి వచ్చారు..మళ్లీ రావాలని చూస్తున్నారు. 
జగన్‌ గారిని, వైఎస్సార్సీపీని తిడుతూ బూతుల పార్టీగా మారింది తప్ప దానికి ఒక స్పష్టమైన అజెండా అంటూ కనిపించడం లేదు.
మాకు జగన్‌ గారు చేసిన మంచిపనులవల్లే ప్రజల్లో మంచి స్పందన ఉంది. 
ప్రజల మద్దతు మాకుంది అనేది ప్రూవ్‌ అవుతూనే ఉంది..రేపు ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది. 
ఈయన్ని అరెస్ట్‌ చేసి దాంతో మేమేదో చేసుకోవాల్సిన అవసరం లేదనేది ప్రజలకు కూడా తెలుసు. 

తాజా వీడియోలు

Back to Top