రాయలసీమ హార్టికల్చర్ హబ్ పేరుతో చంద్రబాబు మహా దగా:

మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజం

అనంతపురం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్.

అడుగంటిన జలాలు.. ఎండిన తోటలు.. 

సీమ రైతుల బతుకులతో చంద్రబాబు వికృత పరిహాసం:

రూ.లక్ష కోట్ల హబ్ కేవలం పబ్లిసిటీ స్టంట్.. 

సీమ బిడ్డనంటూనే సంస్థలన్నీ అమరావతికి తరలించిన ద్రోహి చంద్రబాబు: 

సాకే శైలజానాథ్ ఫైర్

 అనంతపురం : రాయలసీమను రూ. లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్‌గా మార్చి, ప్రపంచానికే ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలన్నీ పచ్చి అబద్ధాలని, సీమ ప్రజలను మభ్యపెట్టేందుకు బాబు ఆడుతున్న సరికొత్త డ్రామా అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. అనంతపురం వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తాను రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూనే ఎయిమ్స్, హైకోర్టు సహా కీలక సంస్థలన్నింటినీ అమరావతికి తరలించి సీమకు తీరని ద్రోహం చేసింది చంద్రబాబేనని విమర్శించారు. ఒకవైపు సీమలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి, వేల ఎకరాల్లో తోటలు ఎండిపోతుంటే జలమట్టం పెరిగిందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చీనీ, టమోటా, అరటి, మిర్చి వంటి పంటలకు కనీస గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్లపై పారబోసుకుంటూ కన్నీరుమున్నీరవుతుంటే, కనీస మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ఆర్భాటపు ప్రకటనలతో రైతుల జీవితాలను అపహాస్యం చేస్తున్నారని గుర్తు చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...

చంద్రబాబు మాటల్లో పబ్లిసిటీ ఎక్కువ.. పనితనం తక్కువ: 
నరం లేని నాలక ఏదైనా మాట్లాడుతుంది, స్థిరం లేని బుద్ధి ఏ మాట అయినా మాట్లాడుతుంది. 
చంద్రబాబుది నరం లేని నాలుక. ఇష్టం వచ్చినట్లు అబద్దాలు చెబుతున్నారు. మదనపల్లె సభలో రాయలసీమ రైతుల గురించి ఏదో ఉద్ధరిస్తున్నట్లు నటించారు. రూ. లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ అని ఊదరగొడుతున్నారు తప్ప, అసలు ఆ నిధులు ఏ బడ్జెట్‌లో పెట్టారు? ఏ ఖాతాలో వేశారు? ఏ అనుమతులతో తెచ్చారు? కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా రైతుల ఆశలను కాలరాస్తూ వికృత పరిహాసం చేస్తున్నారు.

భూగర్భ జలాలు పెరిగాయని చెప్పడం పచ్చి అబద్ధం: 
రాయలసీమలో భూగర్భ జలాలు పెరిగాయని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025లో 7.96 మీటర్లుగా ఉన్న నీటిమట్టం, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 11.14 మీటర్ల లోతుకు పడిపోయింది. 1200 అడుగుల లోతుకు బోర్లు వేసినా అర ఇంచు నీళ్లు రాని పరిస్థితి ఉంది. అంకెలు పెరిగితే నీళ్లు పెరిగినట్లు కాదు బాబుగారూ.. నీళ్లు తగ్గిపోతున్నాయని అర్థం. ఈ ప్రాథమిక జ్ఞానం కూడా లేకుండా సీమ ప్రజలను మోసం చేయడం దుర్మార్గం.

హార్టికల్చర్ రైతును కాపాడలేని ప్రభుత్వం.. లక్ష కోట్ల మాటలెందుకు?: 
రాయలసీమలో 2025లో 7.96 మీటర్ల వద్ద ఉన్న నీటి మట్టం ఈ ఏడు సెప్టెంబర్ 20 నాటికి 11.14 మీటర్లకు పడిపోయింది. అది పెరిగిందని భావించడం లెక్కల్లో పొరపాటే. లక్ష కోట్ల పెట్టుబడులంటూ ప్రచారం చేస్తున్నారు కానీ బడ్జెట్‌లో ఆ నిధులు ఎక్కడున్నాయో, ఏ అకౌంట్‌లో పెట్టారో, ఎవరి అనుమతితో కేటాయించారో చెప్పాలి. ఈ రోజున హార్టికల్చర్ రైతును కాపాడలేకపోతే... హార్టికల్చర్ హబ్ ఎక్కడ ఉంటది? మీ అంతర్జాతీయ స్థాయి ఎక్కడ ఉంటది? ఇప్పటికే మా ప్రాంతాల్లో విదేశాలకు అరటి పండ్లు, మిగతా పండ్లు ఎగుమతి చేస్తా ఉంటారు. అందులో మీ ప్రమేయం ఏమి లేదు. మీరు వచ్చారు, రేటు పడిపోయింది, వాన తగ్గిపోయింది, పంటలు చేతిలోకి రాక నాశనం అయిపోయారు. రూపాయికి కేజీ అరటి పంట అమ్ముకున్న కాలం చూసాం ఇక్కడ. అయినా మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు.
ఇప్పటికే కష్టాల్లో ఉన్న హార్టికల్చర్ రైతులను ఆదుకోవడం ముందుగా చేయాలి. హార్టికల్చర్ హబ్, అంతర్జాతీయ స్థాయి అంటూ పెద్ద మాటలు చెప్పడం కాదు. రైతు పండించిన అరటికి కనీస ధర కూడా దక్కని పరిస్థితిని మార్చాలి. రైతును కాపాడితేనే హార్టికల్చర్ హబ్‌కు, అంతర్జాతీయ స్థాయి కలలకు అర్థం ఉంటుంది.

ఎండిన తోటలు.. రోడ్డున పడ్డ రైతాంగం..: 
సీమలో వానలు లేక చెట్లు ఎండిపోతుంటే చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే నీరు లేక 10 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఎండిపోయాయి. అనంతపురం, ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో చీనీ తోటలను బతికించుకోవడానికి రైతులు ట్యాంకర్లకు రూ. 1500 నుంచి రూ. 2000 పోసి నీళ్లు పోస్తున్నారు. పంట వస్తుందని కాదు, కన్నబిడ్డల్లా పెంచిన చెట్లను కాపాడుకోవాలనే తాపత్రయంతో రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం లేదు.

గిట్టుబాటు ధరల్లేక రోడ్లపాలైన పంటలు..: 
రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చే దిక్కు లేదు. గుంటూరులో క్వింటా మిర్చి ధర రూ. 5000కు పడిపోతే రైతులు అక్కడే పంటను తగులబెట్టారు. టమాటా, చీనీ, అరటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లపై పారబోసి పశువులకు మేతగా వేసే దుస్థితి వచ్చింది. విజ్ఞాన హబ్‌లు, హార్టికల్చర్ హబ్‌లు మా ఎండిపోయిన శరీరాల మీద, మా కొట్టేసిన చెట్ల మీద నిర్మిస్తారా బాబుగారూ?.

అమరావతి పేరుతో పబ్లిసిటీ కాదు.. ప్రజలు వచ్చేలా అభివృద్ధి చేయండి.: 
చంద్రబాబు నాయుడు గారు, సీప్లేన్, హైపర్‌లూప్, ఎయిర్‌బస్ కంపెనీలు అంటూ వరుసగా ప్రకటనలు చేయడం కాదు.. ముందుగా అమరావతిలో ప్రజలు, వ్యాపారాలు వచ్చే పరిస్థితి కల్పించాలి. ఇప్పటికీ కనీస వసతులు, మంచి హోటళ్లు కూడా లేని ప్రాంతంలో భారీ ప్రాజెక్టులు వస్తాయని ప్రచారం చేయడం ఎంతవరకు ఆచరణ సాధ్యమో ప్రజలకు వివరించాలి. అమరావతి గురించి ప్రశ్నిస్తే రాయలసీమ ప్రజలను ఉద్దేశించి బెదిరింపు ధోరణిలో మాట్లాడటం బాధాకరం. రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయకుండా, పబ్లిసిటీకి బదులుగా ప్రజలకు కనిపించే అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.

రాయలసీమను కార్పొరేట్లకు తాకట్టు పెట్టే కుట్ర..: 
ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పేరుతో రాయలసీమ రైతాంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టే కుట్ర దాగి ఉంది. గతంలో ఇజ్రాయెల్ వ్యవసాయం పేరిట రైతులను తమ సొంత భూముల్లోనే కూలీలుగా మార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా రిలయన్స్ వంటి బడా కార్పొరేట్ శక్తులకు మేలు చేసి, తమ రాజకీయ లావాదేవీలు చక్కబెట్టుకోవడానికే ఈ హబ్ డ్రామాలు ఆడుతున్నారు.

ఉచిత పంటల బీమాకు చంద్రబాబు మంగళం..: 
గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచిత పంటల బీమా అమలు చేశారు. 2022-23 ఖరీఫ్‌లో 1.18 కోట్ల దరఖాస్తులు ఉంటే, కూటమి ప్రభుత్వంలో ఆ సంఖ్య కేవలం 40 లక్షలకు పడిపోయింది. ఆ 40 లక్షల మంది స్వయంగా ప్రీమియం కట్టుకున్నా ఇప్పటివరకు పరిహారం రాలేదు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానమే ఇందుకు సాక్ష్యం.

వాటర్ మెన్ కాదు మీరు కరువు పాలకుడు..: 
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 47.63 శాతం వర్షపాతం లోటు ఉంది. అన్నమయ్య జిల్లాలో 78 శాతం, వైఎస్సార్ కడపలో 59 శాతం, సత్యసాయి జిల్లాలో 64 శాతం వర్షపాత లోటు నెలకొంది. రాష్ట్రమంతా తీవ్ర కరువుతో అల్లాడుతుంటే, కేవలం 388 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు.. సీమను కరువు కోరల్లోకి నెట్టిన పాలకుడు.

సీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు పక్క రాష్ట్రంతో కలిసి వెన్నుపోటు: 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారు. 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకునే అవకాశాన్ని రాయలసీమ కోల్పోయేలా చేసి సీమ గొంతు కోశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీళ్లున్నా రాయలసీమ ప్రాజెక్టులను నింపకుండా ఎంపీఆర్ డ్యామ్ వంటి ప్రాజెక్టులను ఖాళీగా ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లంటే గుర్తొచ్చేది దివంగత వైఎస్సార్, వైయస్ జగన్ మాత్రమే.

సంస్థలన్నీ అమరావతికే.. సీమకు మాత్రం మొండిచేయి..: 
తాను సీమ కొడుకునని చెప్పుకునే చంద్రబాబు ఈ ప్రాంతానికి చేసిన మేలేంటి?మీకు సీమకు చెడ్డ కొడుకు. అనంతపురానికి రావాల్సిన ఎయిమ్స్ ఆసుపత్రిని మంగళగిరికి తీసుకెళ్లారు. కర్నూలులో హైకోర్టు రాకుండా అడ్డుకుని అమరావతికి లాక్కుపోయారు. కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈను అమరావతికి తరలించారు.  తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీ సీట్లను సీమ విద్యార్థులకు కాకుండా చేసే ప్రయత్నం చేశారు. తిరుపతికి రావాల్సిన నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, నేషనల్ ఫొరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలను అమరావతికి తరలిస్తున్నారు.  కడప ప్రధాన కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును సైతం అమరావతికి తరలించి సీమ ద్రోహిగా మిగిలారు.

తక్షణమే రైతులను ఆదుకోవాలి..: 
ఈ నేపధ్యంలో చంద్రబాబు ఇకనైనా ఈ పబ్లిసిటీ స్టంట్లు, ప్రచార ఆర్భాటాలు మానుకోవాలని మాజీ మంత్రి శైలజానాధ్ హితవు పలికారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కరువు తీవ్రతను గుర్తించి అన్ని జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి, ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచడంతో పాటు,  ఎండిపోయిన తోటలకు తక్షణమే నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలి. ఈ చర్యలన్నింటి ద్వారా రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

Back to Top