అబద్ధపు హామీలు ఇచ్చే చంద్రబాబు లాంటి వారిని జైల్‌కు పంపాలి

మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్‌

నెల్లూరు జైల్‌లో పిన్నెళ్లి సోదరుల‌ను ప‌రామ‌ర్శించిన రోజా

నెల్లూరు: అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసే చంద్రబాబు లాంటి నేతలను జైలుకు పంపాల్సిన అవసరం ఉందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి  ఆర్‌కే రోజా స్పష్టం చేశారు. అక్రమ కేసులు బనాయించి వైయ‌స్ఆర్‌సీపీ నేతలను, కార్యకర్తలను వేధించడం కూటమి ప్రభుత్వ విధానమైందని మండిప‌డ్డారు. పిన్నెళ్లి సోదరులను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ధ్వ‌జ‌మెత్తారు.
నెల్లూరు సెంట్రల్ జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రి ఆర్.కే. రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని రోజా అన్నారు. టీడీపీ వ్యక్తులు వాళ్లలో వాళ్లే చంపుకున్నారని స్వయంగా ఎస్పీ చెప్పారని గుర్తు చేశారు. అక్రమ కేసులు బనాయించి పిన్నెలి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిని జైలుకు పంపడం దుర్మార్గమని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో “రెడ్ బుల్ రాజ్యాంగం” నడుస్తోందని, పోలీస్ శాఖ ఖాకీ చొక్కా విప్పి పసుపు చొక్కా వేసుకుందని మండిపడ్డారు.

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో తప్పుడు కేసులు, రాజకీయ వేధింపులు లేవని స్పష్టం చేసిన రోజా, తిరిగి తమ ప్రభుత్వం వచ్చాక జరిగిన అన్యాయాలకు లెక్క తీర్చుతామని హెచ్చరించారు. అధికారులు నేతలకు, ముఖ్యంగా లోకేష్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి, మహిళలపై దాడులు, హత్యా రాజకీయాలు పెరిగాయని, నచ్చిన వారిపై తప్పుడు కేసులు మోపడం కూటమి విధానమైందన్నారు.

కేంద్ర క్రైమ్ ర్యాంకింగ్‌లో రాష్ట్రానికి 36వ స్థానం రావడం సిగ్గుచేటని, రాష్ట్ర పరువును గంగపాలు చేశారని దుయ్యబట్టారు. అభివృద్ధి శూన్యం, సంక్షేమం జీరోగా ఉందని, ఇప్పటికే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపివేయించామని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని, హైదరాబాద్‌లో చంద్రబాబు ఆస్తులు కాపాడుకోవడానికే రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఈ అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో క్రెడిట్ చోరీ జరిగిందని, ఎన్నికల ముందు శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబుకు ఇంకేమీ తెలియదన్నారు. జగన్ హయాంలోనే నిర్మాణం జరుగుతుందని GMR సంస్థ తెలిపిందని గుర్తు చేశారు. రామ్‌మోహన్ నాయుడు మాటల్లో హీరో కానీ పనిలో జీరో అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి అబద్ధపు హామీలు ఇచ్చే నేతలను జైలుకు పంపాల్సిందేనని అన్నారు. పిన్నెలి రామకృష్ణారెడ్డి కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని ఆర్.కే. రోజా స్పష్టం చేశారు.

Back to Top