అనంతపురం వైయ‌స్ఆర్‌సీపీలో నూతనోత్సాహం

మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్‌గౌడ్ ఎంపికతో పార్టీ శ్రేణుల్లో రెట్టించిన జోష్

అనంతపురం: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా చిట్లూరు రమేష్‌గౌడ్ (బీసీ రమేష్‌గౌడ్)ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేయడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో రమేష్‌గౌడ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని కలిసి తన అభ్యర్థిత్వంపై చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలందరితో కలిసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సేవలందించిన నాయకుడికి అవకాశం కల్పించడంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది.

ఉన్నత విద్యావంతుడైన రమేష్‌గౌడ్ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశారు. క్షేత్రస్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. బీసీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బహుజన వర్గాల హక్కుల కోసం పనిచేశారు. వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, జోనల్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యలపై పోరాడుతూ, సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మేయర్ అభ్యర్థిగా అవకాశం దక్కడంతో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి విజయాన్ని సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి.

Back to Top