ప్రొద్దుటూరులో పచ్చనేతల అరాచకం

స్క్రూటినీలో వైయ‌స్అర్‌సీపీ అభ్య‌ర్థుల‌ నామినేషన్ పత్రాలు చించివేత!

 మున్సిపల్ కార్యాలయం ఎదుట రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బైఠాయింపు

వైయస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు, అల్లరి మూకలు లాక్కొని చించివేశారని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆరోపించాయి. స్క్రూటినీ ప్రక్రియలో పాల్గొనేందుకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

కార్యకర్తపై లాఠీచార్జి.. కంటికి తీవ్ర గాయం

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో రాజశేఖర్ అనే కార్యకర్తకు కంటి వద్ద తీవ్ర గాయమైందని పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేయడం, అభ్యర్థులను అడ్డుకోవడం, కార్యకర్తలపై లాఠీచార్జి చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన

ఈ ఘటనను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పెద్ద సంఖ్యలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. నామినేషన్ పత్రాలు చించివేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన కార్యకర్తకు న్యాయం చేయాలని, అభ్యర్థులకు ఎన్నికల ప్రక్రియలో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరాయి. 

Back to Top