తాడేపల్లి: 17 నెలల పాలనా కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారాన్ని, ప్రజలను పూర్తిగా గాలికొదిలేసిందని వైయస్ఆర్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తుపాన్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసిందని తేల్చి చెప్పారు. చంద్రబాబు విదేశాలకు, ఆయన కొడుకు లోకేష్ క్రికెట్ మ్యాచ్ లకు ప్రత్యేక విమానాల్లో చేస్తున్న షికార్లపై విమర్శలు రావడంతో... దాన్నుంచి డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా అబద్దపు కధనాలను వండివార్చుతుందని మండిపడ్డారు. మంత్రి లోకేష్ 4 గంటల్లో 4 వేల అర్జీల పరిశీలనంటూ జాకీలెత్తి ప్రచారం చేసుకోవడాన్ని ఆక్షేపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ● ప్రజల కన్నీళ్లు తుడిచిన ప్రజా సంకల్ప యాత్ర... వైయస్.జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టి నేటికి 8 ఏళ్లు పూర్తైంది. ప్రజాసంకల్పయాత్ర ద్వారా కోట్లాదిమంది ప్రజల సమస్యలను వింటూ... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిన్నింటికీ పరిష్కారం చూపించారు. మహాత్మా గాంధీ కలలు గన్న... గ్రామ స్వరాజ్యాన్ని చేసి చూపించారు. ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ ఇవాళ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అందరికీ తెలుసు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైయస్.జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్, నాడు-నేడు ద్వారా బాగు చేసిన స్కూల్లన్నీ మన కళ్లముందు కనిపిస్తున్నాయి. వైయస్.జగన్ హయాంలో 543 సేవలు గ్రామ సచివాలయం ద్వారా అందుబాటులోకి ఉండేవి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇంటికే వాలంటీర్ వచ్చి.. దాన్ని గ్రామ, వార్డు సచివాలయం ద్వారా పరిష్కరించే పరిస్థితి ఉండేది. ● ప్రజా సమస్యలను గాలికొదిలిన కూటమి ప్రభుత్వం.. ప్రస్తుత ప్రభుత్వంలోని పరిస్థితి చూస్తే... నిన్న అంటే నవంబరు 5 నాడు తెలుగుదేశం పార్టీ జాకీ పత్రిక ఆంధ్రజ్యోతిలో గ్రీవెన్స్ ను గాలికొదిలేశారు, మీకు సరిగ్గా నిర్వహిస్తే ఒక్క రోజులోనే 5 వేల మంది వస్తారా?, పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం, నియోజకవర్గంలో వారంలో ఏదో రోజు ప్రజా దర్భార్ నిర్వహించాలని చెప్పాం, దాన్ని కూడా పాటించడం లేదంటూ వార్తలు వచ్చాయి. మరో జాకీ పత్రికలో4 గంటలు, 4 వేల సమస్యలు.. మంత్రి లోకేష్ ప్రజాదర్భార్ కి పోటెత్తిన బాధ్యతలు, అండగా ఉంటామన్న యువనేత అంటూ మనిషికి కూడా సాధ్యం కాని విధంగా రాశారు. అంటే గంటకి లోకేష్ 1000 అర్జీలు, 1 నిమిషానికి 16-17 అర్జీలు పరిశీలించడం సాధ్యమా? ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే... ఇటీవల మొంథా తుపాన్ ప్రభావంతో 8 మంది చనిపోవడంతో పాటు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ అధారిత రాష్ట్రం కావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ● పాలనా వైఫల్యాను డైవర్ట్ చేస్తూ... అలాంటి రైతుకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం ఆపని చేయకపోగా... ఒకరు ఫ్యామిలీతో లండన్ టూర్ లోనూ, మరొకరు క్రికెట్ చూడ్డానికి ఫ్యామిలీతో ముంబాయి టూర్ లలో.... సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ లు బిజీగా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యం మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి మహిళా క్రికెట్ మ్యాచ్ చూసి, వాళ్లందరినీ గెలిపించి వచ్చి మరీ తుపాన్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాడని జాకీలెత్తి వార్తలు రాశారు. అసలు మీరు ప్రభుత్వం నడుపుతున్నామని భావిస్తున్నారా? ఎక్కడైనా సమస్య వస్తే స్థానికంగా ఉండే సచివాలయంలో పరిష్కారం కావాలి, అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే... మండలస్ధాయిలోనూ ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆ సమస్య వెళ్తుంది. మన రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. వైయస్.జగన్ ప్రభుత్వంలో స్పందన కార్యక్రమం నిర్వహించింది. ఆన్ లైన్ లో సమస్యలు పరిష్కరించారు. వాట్సప్ గవర్నెన్స్ వైయస్.జగన్ హయాంలో తీసుకొస్తే.. దానికి కూడా పేరు మార్చి వీళ్ల ఖాతాలో వేసుకున్నారు. మరి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మీరు సమస్యలు పరిష్కారం అయితే... ఇన్ని వేల మంది మీ ఆఫీసుకు ఎలావచ్చారు? ఒక ప్రభుత్వంలో ఒక మంత్రి దగ్గరకు పార్టీ ఆఫీసుకి గంటకి వేయిమంది వస్తున్నారంటే...రాష్ట్రంలో మిగిలిన మంత్రులు దగ్గరకు ఎంతమంది వెళ్తున్నారు? అంటే ఈ ప్రభుత్వం ప్రజాసమస్యలను పూర్తగా గాలికొదిలేసింది. లక్షలాది సమస్యలను పెండింగ్ లో ఉన్నాయి. ప్రజల నుంచి అర్జీలను తీసుకోవాల్సింది ప్రభుత్వ కార్యాలయాల దగ్గరే తప్ప.. పార్టీ కార్యాలయాల దగ్గర కాదు. పరిష్కరించాల్సిందీ ప్రభుత్వమే. పార్టీ కార్యాలయాల దగ్గరకి ప్రజలందరినీ రప్పించి మీరు నడుపుతున్నది పొలిటికల్ గవర్నెన్సే తప్ప... రియల్ టైమ్ గవర్నెన్స్ కానే కాదు. ఇంతదానికి మిమ్నల్ని విజనరీ అని, మొంథా తుపాను మోచేత్తో పక్క రాష్ట్రాలకు తరిమేశాడని గొప్పలు చెప్పుకుంటున్నారు. ● పని తక్కువ ప్రచారం ఎక్కువ... వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో సచివాలయం లోనే పెన్షన్ శాంక్షన్ అయ్యేది. అలాంటిది మీ సమక్షంలో వికలాంగుల పెన్షన్ అందడం లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి వినతిపత్రం ఇస్తున్నారంటే.. ఇలాంటి సమస్యలు ఇంకెన్ని ఉన్నాయో. అంటే ఈ 17 నెలల్లో పాలనను గాలికొదిలేసి.. పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. తండ్రిని మించి కొడుకు గొప్పలు చెప్పుకుంటున్నాడు. మంత్రి నారా లోకేష్ క్రికెట్ చూడ్డానికి వెళ్లడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వ ధనంతో ప్రత్యేక విమానాల్లో క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి వెళ్లడం తప్పు అయితే... రెండోది నారా లోకేషే భారత మహిళలు ప్రపంచ కప్ గెలవడానికి స్ఫూర్తి అంటూ సిగ్గూ శరం లేకుండా సినిమాల్లో గచ్చిబౌలి దివాకర్ లాగా ఈ కరకట్ట దివాకర్ గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నారో వీళ్లకి స్పృహ కూడా ఉండడం లేదు. లక్షలాది ప్రజా సమస్యలతో ప్రజలు వస్తుంటే... వాటిని పరిష్కరించకుండా తండ్రీ కొడుకులు విహారయాత్రలు చేస్తూ.. మరోవైపు తుపాన్ లు ఆపేశామని.. వరదలను కంట్రోల్ చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ వారానికి నాలుగు రోజులు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండడంతో పాటు ప్రతిరోజూ 300 మందిని కలుస్తారు. అలా అని ప్రచారం చేసుకుంటున్నామా? పనిచేసే వాళ్లు ప్రచారం చేసుకోరు. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లకు పనిచేసే లక్షణం లేదు కానీ ప్రచారం మాత్రం గొప్పగా చేసుకోవడం అలవాటుగా మారింది. అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటుతున్నా... ఒక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం చేసింది లేదని వెంకటరెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా బుద్దితెచ్చుకుని రానున్న మూడేళ్లలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని సూచించారు. పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ.. టీవీ 5 మూర్తి వివాదంలో వైయస్ఆర్‌సీపీ నేతలున్నారన్న ఆరోపణలతో మాట్లాడుతూ తెలంగాణాలో ఆయనపై ఎఫ్ ఐ ఆర్ నమోదైతే మా పార్టీకి ఏమిటి సంబంధం? టీవీ5 మూర్తి గురించి వైయస్ఆర్‌సీపీకి ఆలోచించాల్సిన అవసరం లేదు. తనకు తాను ఎక్కువ ఊహించుకుని మాట్లాడుతున్నాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు మూర్తి చేసిన అక్రమాలపై చర్చించే టైం మా పార్టీకి లేదు, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడమే మాకు ముఖ్యం. జర్నలిస్టునని చెప్పుకునే మూర్తి భార్యా,భర్తల మద్య గొడవల్లో బ్లాక్ మెయిల్ కి దిగి.. డబ్బులు వసూలు చేయడం అలవాటుగా మారింది. తన యజమానిని చూసి మూర్తి కూడా అదే నేర్చుకున్నట్టు ఉన్నాడు. వైయస్.జగన్ 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్వహించాం. కానీ అధికారంలో ఉన్నా కూడా టీడీపీకి సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించడం రాక.. గోదావరి పుష్కరాల్లో 29 మంది, కందుకూరులో 8 మంది ప్రజల ప్రాణాలు హరించారు. తిరుపతిలో తొక్కిసలాటలోనూ, సింహాచలంలో పట్టుకుంటే కూలిపోయే గొడ కట్టి భక్తుల ప్రాణాలను తీసింది కూడా ఈ ప్రభుత్వమే. కాశీబుగ్గ తొక్కిసలాటకు కూడా ఈ ప్రభుత్వమే కారణం. తెలుగుదేశం పార్టి ఎప్పుడు అధికారంలో ఉన్న జనాల ప్రాణాలు తీయడం వారికి అలవాటు. అది చంద్రబాబు పాద మహిమ. ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా నాశనమే. అయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు హైదరాబాద్ లో ఏం పని? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. ఇప్పటికి చంద్రబాబునాయుడు 75 సార్లు, నారా లోకేష్ 80 దఫాలుగా పైగా హైదారాబాద్ కు స్పెషల్ ప్లైట్లలో తిరిగారు. పవన్ కళ్యాణ్ అయితే మాదాపూర్ టు మంగళగిరి 120 సార్లు దాటింది. ఈయన మాదాపూర్ కి ఎమ్మెల్యేనా? ఏపీ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రా? మంత్రులైతే ప్రజల సమస్యలను గాలికొదిలేసి హైదరాబాద్ పబ్ లలో షికార్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాల్లో వెళ్లి మరీ ఎంజాయ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.