ఆలూరులో న‌ల్ల బెలూన్స్‌తో నిర‌స‌న 

ఆలూరు : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ ఆలూరులో “మోసానికి రెండేళ్లు” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మహిళలకు ప్రతి ఏటా అందిస్తామని ప్రకటించిన ‘ఆడబిడ్డ నిధి’ ఏమైందని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ముఖ్యంగా నిరుద్యోగ యువతను మోసం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుందని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన, సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం నిరాశపరిచిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు కనిపించలేదని విమర్శించారు. అమరావతి అభివృద్ధి పేరుతో చేస్తున్న ప్రచారం వాస్తవాలకు దూరంగా ఉందని, “రెండేళ్ల పాటు అమరావతిలో నీళ్లు తోడడమే చంద్రబాబు అభివృద్ధి” అంటూ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై తమ నిరసన వ్యక్తం చేశారు.
 

Back to Top