వైయస్ఆర్ జిల్లా : జిందాల్ స్టీల్స్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వైయస్ఆర్‌సీపీ నేతల బృందాన్ని పోలీసులు జమ్మలమడుగులోని వైయస్ఆర్ విగ్రహం వద్ద అడ్డుకున్నారు. ప్లాంట్ సందర్శనకు అనుమతి లేదని పేర్కొంటూ ముందుకు కదలనివ్వకపోవడంతో వైయస్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమ పరిస్థితులు, స్థానికులకు ఉపాధి అవకాశాలు, ప్లాంట్ కార్యకలాపాలపై ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైయస్ఆర్‌సీపీ బృందం పరిశీలనకు బయలుదేరింది. అయితే పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించి, బృందాన్ని జమ్మలమడుగు వైయస్ఆర్ విగ్రహం వద్దే నిలిపివేశారు. దీనిపై నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లే ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్, జిల్లా అధ్యక్షుడు సి. రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను వినియోగిస్తోందని వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు. పరిశ్రమల పరిస్థితులను తెలుసుకోవడం, ప్రజా ప్రయోజనాల కోసం పరిశీలన చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని, అలాంటి కార్యక్రమాలను కూడా అడ్డుకోవడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని విమర్శించారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని, స్థానిక యువత హక్కులు, పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు, ప్రాంతీయ అభివృద్ధి అంశాలపై వైయస్ఆర్‌సీపీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు.