తాడేపల్లి: సాక్షిటీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఒక పథకం ప్రకారం మూడు రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనలకు పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్‌డ్‌గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టడాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు జరిగాయని అన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్‌లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడ ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలతో రాష్ట్రంను భ్రష్టుపట్టిస్తున్న చంద్రబాబు పాలనపై పౌరసమాజం, పాత్రికేయలోకం, మేధావులు స్పందించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఆయనేమన్నారంటే.. నాలుగు దశాబ్ధాలు జర్నలిజంలో అనుభవం ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షిటీవీలో డిబేట్ షో నిర్వహిస్తున్నారు. ఆ డిబేట్‌లో మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు విశ్లేషకుడుగా పాల్గొని రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి ఇతర మీడియాల్లో ప్రచురితమైన కథనాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా అమరావతి చుట్టుపక్కల వీరి సంఖ్య ఎక్కువగా ఉందని వచ్చిన కథనంను ఉటంకించారు. దానిని ఒక ప్రణాళిక ప్రకారం వివాదం చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ, కృష్ణంరాజు ఏకంగా వేశ్యల రాజధాని అని మాట్లాడటం ద్వారా అమరావతి గురించి తప్పుగా వ్యాఖ్యలు చేశారనే ప్రచారాన్ని ప్రారంభించింది. టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లో మూడు రోజుల నుంచి ప్రముఖంగా ఇదే అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. దీని కొనసాగింపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి తన ట్వీట్‌లో కృష్ణంరాజు వీడియోను పోస్ట్ చేశారు. తెలుగుదేశం, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా సంస్థలు, టీడీపీకి సంబంధించిన దాదాపు రెండువందలకు పైగా యూట్యూబ్ చానెల్స్, టీడీపీ అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులు మూడు రోజులుగా ఒక ప్రణాళిక ప్రకారం దీనిపై దుష్ప్రచారం మొదలు పెట్టాయి. ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు ఆరో తేదీ జరిగిన టీవీ చర్చలో జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇతర మీడియా సంస్థల్లో వచ్చిన అంశాలకు సంబంధించిన సబ్జెక్ట్‌పై మాట్లాడిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఆయన దానికి క్షమాపణలు చెప్పారు. తాను ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో అలా మాట్లాడలేదని కూడా వివరణ ఇచ్చారు. అంతే కాదు డిబేట్ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను అప్పుడే ప్రజంటేటర్‌గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు కూడా వారించారు. సాక్షిటీవీలో ఆ డిబేట్ అయిపోయింది. తరువాత దానిని సాక్షిటీవీలో రిపీట్ చేయడం కానీ, దాని గురించి సాక్షిపత్రికలో కానీ ఎక్కడా ఎటువంటి ప్రచురణ, కథనం రాలేదు. అలాగే కృష్ణంరాజు మాట్లాడిన దానిపై ఉటంకిస్తూ ఎవరూ కూడా మాట్లాడలేదు. డిబేట్ అనేది నలుగురిని ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రజంటేటర్ నడిపిస్తారు. దీనిలో ఏ అభిప్రాయాలు వ్యక్తం చేసినా అవి వ్యక్తిగతమైనవే. అవి హద్దులు మీరినప్పుడు ప్రజంటేటర్ దానిని ఆపే ప్రయత్నం చేస్తారు. ఆ పని కొమ్మినేని శ్రీనివాసరావు చేశారు. దానిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు కూడా తాను అన్న వ్యాఖ్యలు సరైనవేనంటూ ఎక్కడా కూడా సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. ఆ వ్యాఖ్యలపై తిరిగి ఎటువంటి ప్రస్తావన కూడా చేయలేదు. ఏబీఎన్, టీవీ-5 వంటి చానెల్స్‌లో వైయస్ జగన్, వైయస్ఆర్‌సీపీ నేతలపై వందల కొద్ది వ్యక్తిత్వ హననం చేసేలా అనేక డిబేట్లు జరిగాయి. వాటిల్లో చర్చలో పాల్గొన్న వారు తాము చేసిన వ్యాఖ్యలను పదేపదే సమర్థించుకుంటూ చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఇటువంటి డిబేట్‌లను మేం పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా వాటిని ఏనాడు మేం పరిగణలోకి తీసుకోలేదు. వాటిని ఎందుకు పట్టించుకోలేదంటే ప్రజలకు సంబంధించి జవాబుదారీతనంతో ఉండాల్సిన రాజకీయపార్టీలు ఇలాంటి అంశాలపై దృష్టి సారిస్తే, ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు పక్కకుపోతాయని భావించాం. దుర్భలులు, అసమర్థులు, పిరికివారు, సత్తాలేని వారు మాత్రమే బూతులు, అసభ్యకరమైన అంశాలతో డైవర్షన్‌కు పాల్పడతారు. వైయస్ జగన్ గారు చిల్లర విషయాలను, పాసింగ్ గా వచ్చిన మాటలను ఏనాడు సీరియస్ గా తీసుకుని వివాదం చేయలేదు. ఇలాంటివి టీడీపీకి అలవాటు. లేని వాటిని సృష్టించడం, ఎక్కడో వచ్చిన దానిని తీసుకువచ్చి దానిని జాతీయ సమస్యగా మార్చి, దానిపై విష ప్రచారం చేయడం, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడం చంద్రబాబుకు అలవాటు. ప్రణాళిక ప్రకారం వివాదాన్ని సృష్టించారు ఈనెల 7వ తేదీ ఉదయం నుంచి కుట్రపూరితంగా ఈ వ్యాఖ్యలను రాజకీయం చేయాలనే ప్రయత్నంను టీడీపీ మొదలుపెట్టింది. సాక్షిటీవీ వైయస్ జగన్ కుటుంబానికి చెందినది కాబట్టి వారిపై వ్యక్తిగత దాడి ప్రారంభించారు. ఏడో తేదీ సాయంత్రం చంద్రబాబు తనయుడు లోకేష్ ఒక ట్వీట్ పెట్టడంతోనే ఈ కుట్రపై మాకు అనుమానం కలిగింది. కావాలనే దీనిని ఒక వివాదంగా మారుస్తున్నారని గ్రహించాం. దీనిపై సాక్షిటీవీ చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేసింది. డిబేట్‌లో జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, ఇటువంటివి సాక్షిటీవీ ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించదని, దీనిని సాక్షిటీవీ అభిప్రాయంగా చూడటం సరికాదని ప్రకటించింది. దీనిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు కూడా తన వివరణను మీడియాకు రిలీజ్ చేశారు. అదే క్రమంలో వైయస్ఆర్‌సీపీ కూడా అధికారికంగా దీనిపై జర్నలిస్ట్ వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని తన ప్రకటనలో ఖండించింది. అప్పటికే వైయస్ జగన్ కుటుంబంపై చేస్తున్న దారుణమైన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదాన్ని దయచేసి వదలివేయాలని కూడా కోరడం జరిగింది. 8వ తేదీన మరింత ఉదృతంగా దీనిని పెద్దవివాదంగా మార్చారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు, ప్రదర్శనలు, దుర్భాషలు, దిష్టిబొమ్మలు దగ్ధం, సాక్షిటీవీ కార్యాలయాలపైకి వెళ్ళడం ద్వారా వారి అరాచకం పరాకాష్టకు చేరింది. నిజంగా ఏదైనా వ్యాఖ్యలు చేసిన సందర్భంలో నాది పొరపాటు అయ్యిందని అంటే, ఎవరైనా దానిని అక్కడితో వదిలేస్తారు. అలాంటిది ఎలాంటి ఉద్దేశం లేకుండా అనుకోకుండా జరిగిన దానిపైన కొమ్మినేని శ్రీనివాసరావు కూడా స్పందించి 18 ఏళ్ళుగా డిబేట్లు చాలా నిబద్దతతో నిర్వహిస్తున్నాను, ఇక్కడ కూడా కృష్ణంరాజు వ్యాఖ్యలను వారించబోయాను, మరింత గట్టిగా కూడా దానిని వారించి ఉంటే ఇంకా బాగుండేదని చెబుతూ, ఇటువంటి వ్యాఖ్యలు తన డిబేట్‌లో రావడానికి క్షమాపణలు కూడా చెప్పారు. ఇవ్వన్నీ ఆర్గనైజ్‌డ్ ఆందోళనలే ఇది కృత్రిమంగా చేస్తున్న ఆర్గనైజెడ్ ఆందోళనలే. తెలుగుదేశం పార్టీ వారు కొద్దిమందిని పోగేసి, రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆర్గనైజ్ చేసి, అధికారంలో ఉన్నామని తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి దీనిని వాడుకుంటున్నారు. దీనిపై చంద్రబాబు వీడియో పెట్టి స్టేట్‌మెంట్, తరువాత పవన్ కళ్యాణ్ స్టేట్‌మెంట్, ట్వీట్ పెట్టారు. అమరావతి పేరును ఉచ్చరించాలంటేనే అందరూ భయపడాలి, మొత్తం రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది దీనిపై స్పందిస్తారనే ఇంప్రెషన్ ఇచ్చేందుకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆందోళనలు చేయించారు. ఇవి సహజంగా జరుగుతున్నవి కావు. అమరావతి పరువును మీరు తీస్తున్నారా? కృష్ణంరాజు, కొమ్మినేని తీశారా? రాష్ట్రంలో మహిళల పరువును ఎవరు తీస్తున్నారు? రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల సంఖ్య ఎక్కువగా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక కథనంను డిబేట్‌లో ఉటంకించారు. రాష్ట్రంలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారంటే దాని అర్థం రాష్ట్రంలోని మహిళలను అవమానించడమా? కొన్ని నిర్ధిష్టమైన ప్రాంతాల్లో ఎక్కువమంది ఉన్నారంటే, ఆ ప్రాంతంలోని మహిళలను అవమానించినట్లా? అయినా కూడా మేం బాధపడ్డామని కొందరు బయటకు రావడతో ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా దానిని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించడం సమంజసమా? ఇదంతా చంద్రబాబు కావాలని చేస్తున్నారు. కోల్డ్‌బ్లడెట్‌గా ఆయనకు తెలిసిన విద్యను అమలు చేస్తున్నారు. ప్రజల మెదళ్ళో విషాన్ని నింపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కొమ్మినేనిపై చంద్రబాబుకు కక్ష కొమ్మినేని శ్రీనివాసరావు కేవలం సమస్యలపై ఆవేశంగా మాట్లాడతారే తప్ప, ఎక్కడా కూడా సంయమనం కోల్పోయి మాట్లాడరు. ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎన్టీవీ, సాక్షిటీవీల్లో పనిచేశారు. ఏన్టీవీలో నిస్పక్షపాతంగా డిబేట్లు నిర్వహించడం వల్ల గతంలో సీఎంగా ఉన్నచంద్రబాబుకు నచ్చక కక్షతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించే వరకు పట్టుబట్టారు. తరువాత ఆయన సాక్షిలో చేరి తన పాత పంథాలోనే నిస్పక్షపాతంగా డిబేట్లు చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశంకు వంతపాడే టీడీ చానెల్స్‌లో డిబేట్లు నిర్వహించే వారికి భిన్నంగా ఆయన చాలా హుందాగా నిర్వహిస్తున్నారు. టీడీపీకి పోయేకాలం దాపురించబట్టే ఇలా చేస్తున్నారు. టీడీపీకి పోయేకాలం దాపురించింది ఏడాది కాలంలోనే కూటమి పాలనపై ప్రజల్లో విపరీతమైన అసహ్యం పెరిగిపోయింది. ప్రజలు అమాయకులు, వెర్రివాళ్ళు అని చంద్రబాబు అనుకుంటున్నారు. ఏడాది పాలన వైఫల్యాలపై వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు స్పందించారు. మరోవైపు రోజూ మహిళలపై అఘాయిత్యాలు, పోలీసుల దాష్టీకం, అధికారుల దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలంటే ఇటువంటి వివాదాలు టీడీపీకి కావాలి. మీడియా మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. తన అనుచరగణం, నాయకులతో ఈ డ్రామాను ఒక పీక్‌కు తీసుకువెళ్ళారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఎక్కడైనా మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం స్పందించిన తీరు జాతీయ స్థాయిలో అభినందనలు పొందింది. అనంతపురం, సత్యసాయి జిల్లాలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. ఎందుకంటే మొత్తం పోలీస్ యంత్రాంగం కక్షసాధింపు కేసుల్లో బిజీగా ఉన్నారు. అహస్యకరంగా ఫోటోలను చెప్పులతో కొట్టడం వంటి చర్యలను ఏమనాలి? మూడు రోజుల పాటు సీఎం, పార్టీ యంత్రాంగం, అనుకూల మీడియాను ఒక జర్నలిస్ట్, విశ్లేషకులు, ఒక మాజీ సీఎం, ఒక రాజకీయ పార్టీపైన దుష్ప్రచారంకు కేటాయించారు. అరాచకత్వం, మాఫియాతత్వం, దానిలో దోపిడీని సాగించడం వారి లక్ష్యం. ఎవరు మాట్లాడినా ఇలా దాడి చేయడం. ఇవి మొత్తం మీడియాకు, జర్నలిస్ట్‌లకు ప్రమాద ఘంటికలు. ఎవరైనా బ్యాలెన్స్‌డ్ గా ఉన్నా వారికి ముప్పు తప్పదు, చంద్రబాబును పొగిడితేనే వారికి సర్వైవల్ ఉంటుందనే సందేశం ఇస్తున్నారు. దీనిని ప్రజలు గ్రహించాలి. ఎవరు తమకు వ్యతిరేకంగా గొంతు ఎత్తినా సహించమనే బెదిరింపు ఉంది. దీనిపై ప్రజలు గొంతు విప్పి దీనిని ప్రశ్నించాలి.