రైతు గోడు ప‌ట్ట‌ని కూట‌మి ప్ర‌భుత్వం 

వ‌ర్షాల‌తో రైతులు అల్లాడిపోతున్నా చ‌ల‌నం లేదు

పంట‌లు నీటమునిగి మొలకెత్తినా ఎన్యుమ‌రేష‌న్ ఊసే లేదు

ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం 

నెల్లూరులోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా పార్టీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికాకాణి గోవ‌ర్ద‌న్‌రెడ్డి

తూతూమంత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

మోంథా తుపాన్ పై వ్య‌వ‌సాయ శాఖ‌తో సీఎం స‌మీక్ష చేయ‌రా   

వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి ఉన్నాడా లేడా అన్న‌ట్టుంది

త‌క్ష‌ణం ధాన్యం, మొక్క‌జొన్న‌, ప‌త్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి  

నెల్లూరు:  నాలుగైదు రోజులుగా కురుస్తున్న అకాల వ‌ర్షాల‌తో రైతులు అల్లాడిపోతున్నా ఈ ప్ర‌భుత్వానికి చీమకుట్టిన‌ట్టు కూడా లేద‌ని, పంట‌లు నీట మునిగి మొల‌కెత్తినా ఎన్యుమ‌రేష‌న్ చేయ‌డం లేద‌ని నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మోంథా తుపాన్ ముంచుకొస్తున్నా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష చేయ‌డం లేద‌ని, అస‌లీ రాష్ట్రంలో వ్య‌వ‌సాయశాఖ మంత్రి ఉన్నాడా అనే అనుమానాలు రైతులు వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి చంద్ర‌బాబు పాల‌న చూస్తే రైతులపై ప‌గ సాధిస్తున్న‌ట్టుగా  ఉంద‌ని, ఆయ‌న ఎప్పుడు అధికారంలోకి వ‌చ్చినా అతివృష్టి అనావృష్టితో రైతులు న‌ష్ట‌పోవాల్సిందేనని మ‌రోసారి నిరూపితం అయింద‌ని కాకాణి స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

- మొక్కుబ‌డిగా ధాన్యం కొనుగోలు సెంట‌ర్లు

రాష్ట్ర‌వ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షాల‌తో రైతులు ఇబ్బందులు ప‌డుతుంటే ఈ ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్ట‌యినాలేదు. ప్ర‌తికూల ప‌రిస్థితుల మ‌ధ్య రైతులు వ్య‌వ‌సాయం చేస్తుంటే వారికి అండ‌గా నిలిచి ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం మ‌రింత న‌ష్టపోయేలా వ్య‌వ‌హరిస్తోంది. విత్త‌నాలు, యూరియా కొర‌త‌తో రైతులు మ‌రింత‌గా నష్ట‌పోతున్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో ఈ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంది. రైతులు వ‌ర్షాల‌తో పంట న‌ష్టపోయి అల్లాడిపోతుంటే తండ్రీకొడుకులు చంద్ర‌బాబు, లోకేశ్‌ విదేశాల్లో జ‌ల్సాలు చేస్తున్నారు. పెట్టుబ‌డులు పేరు చెప్పి వ్యాపారాల‌ను వృద్ది చేసుకోవ‌డానికి విదేశాల‌కు వెళ్లారు. పెట్టుబడులు తెచ్చామని వారు చెప్పేవ‌న్నీ బోగ‌స్ మాట‌లేన‌ని గ‌తంలో 2014-19 మ‌ధ్య తేలిపోయింది. సీఎం చంద్ర‌బాబు మోంథా తుపాన్ ముంచుకొస్తుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు చేస్తున్నా వ్య‌వ‌సాయశాఖతో స‌మీక్ష కూడా చేయ‌డం లేదు. అస‌లు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ఎక్క‌డున్నాడో ఎవ‌రికీ తెలియ‌దు. తూతూమంత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి త‌ర్వాత వాటి ఊసేలేకుండా చేశారు. అధికారుల వ‌ద్ద ఉన్న లెక్క‌ల ప్ర‌కారం రైతుల ద‌గ్గ‌ర 7 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం ఉంటే ప్ర‌భుత్వం కొనుగోలు చేసింది కేవ‌లం 10,800 ట‌న్నులు మాత్ర‌మే. రైతుల ద‌గ్గ‌ర క‌నీసం ఒక‌టిన్న‌ర శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయ‌లేదు. నెల్లూరు జిల్లాలో రైతుల దగ్గ‌రున్న‌ ధాన్య‌మంతా అమ్ముకున్న తర్వాత ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల ఖ‌రీఫ్ పంట కోత‌ల‌కు వ‌చ్చినా ఇప్ప‌టికీ ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయ‌నేలేదు. 

- చంద్ర‌బాబు రైతు వ్య‌తిరేకి అని మ‌రోసారి తేలిపోయింది

చంద్ర‌బాబుకి వ్యవసాయం అంటే గిట్ట‌దు, వ్య‌వ‌సాయానికి వ్య‌తిరేకం అనేది మ‌రోసారి నిరూపించుకున్నారు. ఎందుక‌నో రైతుల మీద ప‌గ సాధించిన‌ట్టుగా  చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేదు. రైతులు ఉల్లి, ట‌మాట పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేవ‌ని రోడ్డుపై పార‌బోస్తుంటే చంద్ర‌బాబు హేళ‌న‌గా మాట్లాడుతున్నాడు. యూరియా దొర‌క‌డం లేద‌ని రైతులు ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తుంటే రాజ‌కీయాలు చేస్తున్నార‌ని రైతుల్ని బెదిరిస్తున్నాడు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో ఏనాడూ యూరియా, విత్త‌నాల కొర‌త అనే మాట కూడా వినిపించ‌లేదు. విత్తనం నుంచి విక్ర‌యం వ‌ర‌కు అడుగ‌డుగునా ఆర్బీకే సెంట‌ర్ల ద్వారా రైతుల‌కు అండ‌గా నిలిచిన ప్ర‌భుత్వం మాది. వైయ‌స్ జ‌గ‌న్‌కి మంచి పేరొస్తుంద‌నే దుర్బుద్ధితో ఆర్బీకే సెంట‌ర్ల‌ను నిర్వీర్యం చేశారు. రైతు భ‌రోసా సొమ్ము రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే కొద్దిమందికి రూ.5 వేలు మాత్ర‌మే ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఉచిత పంట‌ల బీమా ఊసే లేదు. ఇన్‌పుట్ స‌బ్సిడీ గ‌గ‌న‌మైపోయింది. ఇంత‌వ‌ర‌కు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖ‌లాలు లేవు. చంద్ర‌బాబు అడుగుపెడితే రైతుల పాలిట శాప‌మేన‌ని మ‌రోసారి నిరూపితమైంది. ప్ర‌తి జిల్లాలోనూ అతివృష్టి లేదా అనావృష్టితో రైతులు న‌ష్ట‌పోతున్నారు. 

- పత్తి, మొక్కజొన్న పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం  

ఖరీఫ్‌లో వరి తర్వాత రైతులు కాస్త ఆశాజనకంగా పత్తి పంట‌ను సాగు చేస్తే దాని ప‌రిస్థితి మరీ ఘోరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షల ఎకరాల్లో సాగైతే ఒక్క కర్నూలు జిల్లాల్లోనే 5.55 లక్షల ఎకరాల్లో సాగైంది. అధికారుల లెక్క‌ల ప్ర‌కార‌మే 50వేల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికే అధిక వర్షాల కారణంగా ఆగస్టు రెండో వారంలో పూత, పింద రాలిపోగా, సెప్టెంబర్‌ నాలుగో వారంలో వర్షాలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. కనీస మద్దతు ధర రూ.8,110 కాగా మార్కెట్‌లో రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. అక్టోబర్‌ 1న సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఈ ఏడాది నాలుగో వారం వచ్చినా కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. దీంతో కొతకొచ్చిన పంటను తేమ శాతంతో కొర్రీలు వేయడంతో వ‌చ్చిన‌కాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. ఇక పత్తి తర్వాత చెప్పుకోద‌గ్గ స్థాయిలో మొక్కజొన్న 4 లక్షల ఎకరాల్లో సాగైంది. అధిక వర్షాల వల్ల 40 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి కాస్త 15–20 క్వింటాళ్లకే పరిమితమైంది. మరోవైపు కనీస మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రస్తుతం దళారీలు రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య కొంటున్నారు. ఫలితంగా ఎకరాకు రూ.17,500 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 12వేల ఎకరాలకు పైగా పంట దెబ్బతింది. 

- 2.50 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం

గ‌త నాలుగైదు రోజులుగా కురుస్తున్న అకాల వ‌ర్షాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా 1.50 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట ముంపుబారిన ప‌డిన‌ట్టు వ్య‌వసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్ర‌స్థాయిలో 2.50 ల‌క్ష‌ల ఎకరాల్లో పంట దెబ్బ‌తింద‌ని తెలుస్తోంది. ఒక్క వ‌రి పంటకు మాత్ర‌మే ల‌క్ష ఎక‌రాల్లో న‌ష్టం జ‌రిగింది. అత్యధికంగా కర్నూలు, ప్రకాశం, విజయనగరం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. ఇప్పటికీ మోంథా  తుపాన్ ముప్పు తొల‌గ‌న‌ప్ప‌టికీ కూట‌మి ప్ర‌భుత్వం నిద్ర మ‌త్తు వ‌ద‌ల‌డం లేదు. ఇప్పటికే చాలాచొట్ల పంట‌లు నీట‌మునిగి మొల‌కలెత్తినా రాష్ట్రంలో ఎక్క‌డా దెబ్బ‌తిన్న పంట‌ల‌కు ఎన్యుమ‌రేష‌న్ చేసే కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డం లేదు. మోంథా తుపాను ప్రభావం వ్యవసా­య, ఉద్యాన పంటలపై తీవ్రంగా ఉంటుందని ఇ­ప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా వ్య‌వ‌సాయశాఖ‌లో ఏమాత్రం క‌ద‌లిక క‌నిపించ‌డం లేదు. వ్య‌వ‌సాయ శాఖ‌కు అస‌లు మంత్రి ఉన్నాడా అనే అనుమానం క‌లుగుతోంది. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఎక్కువగా సాగయ్యే వరి పంట ప్రస్తుతం కోత దశలో ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో మోంథా తుపాను తీరం దాటితే కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే కృష్ణా, గోదావరి డెల్టాలో వరిపంట దాదాపు తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. గతేడాది మద్దతు ధర లేక 75 కేజీల బస్తాకు రూ.300-రూ.500 వరకు నష్టపోయిన రైతులు ఈసారి అంతకంటే దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఈపాటికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లక్ష్యాలు నిర్దేశించుకున్నారే తప్ప ఒక్క కేంద్రం కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు. కనీసం ఆ దిశగా కసరత్తు కూడా చేసే ఆనవాళ్లు కనిపించట్లేదు. ఎస్ఎంఎస్ పెడితే చాలు 24 గంట‌ల్లో పంట‌లు కొనుగోలు చేస్తామ‌ని అనుకూల మీడియాలో ప్ర‌చారం చేయించుకోవ‌డం త‌ప్పించి రైతుల బాగోగుల గురించి ఈ ప్ర‌భుత్వం అస్స‌లు ప‌ట్టించుకున్న‌పాపాన పోవ‌డం లేదు. ఇదే అదనుతో పంట రంగు మారినట్టుగా, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ద‌ళారులు ధర తగ్గించేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మొత్తుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టనట్టుగా ఉంది. ఇప్ప‌టికైనా నిర్ల‌క్ష్యం వీడి పత్తి, మొక్కజొన్నతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలి.

- యూరియాను స‌మృద్ధిగా అందుబాటులో ఉంచాలి

ప‌రిస్థితులు చూస్తుంటే మ‌ళ్లీ ఈ ఏడాది కూడా యూరియా కొర‌త వ‌చ్చే ప‌రిస్ధితులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వానికి న‌చ్చిన‌ట్టు కాకుండా రైతుల అవ‌స‌రాల మేరకు యూరియా బ‌స్తాలు పంపిణీ చేసి ఆదుకోవాలి. రేష‌న్ స‌రుకులు మాదిరిగా  మూడు బ‌స్తాలు ఇస్తామంటే కుద‌ర‌దు. రైతులు స‌మృద్దిగా కొనుగోలు చేసే విధంగా యూరియాను అందుబాటులో ఉంచాలి. లేదంటే చంద్రబాబు చ‌రిత్ర హీనుడిగా మిగిలిపోతారు. 
  
- న‌కిలీ మ‌ద్యం వ‌ల్లే క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం

క‌ర్నూలు జిల్లాలో జ‌రిగిన బస్సు ప్రమాదం ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వం చేసిన హ‌త్య‌గానే భావించాలి. ఒక యువ‌కుడు బెల్ట్ షాపులో న‌కిలీ మద్యం తాగి డివైడ‌ర్‌ను గుద్దుకుని రోడ్డుపై ప‌డి చ‌నిపోతే, ఆ బైకును ఢీకొని ట్రావెల్స్ బ‌స్సుకు మంట‌లంటుకుని ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 20 మందికి పైగా చ‌నిపోయారు. ఈ ప్ర‌మాదంలో నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి వాసులు చ‌నిపోయారు. వారి కుటుంబానికి నా సానుభూతిని ప్ర‌క‌టిస్తున్నా. అయితే ఈ బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగిన తీరును చూస్తే గ‌గుర్బొడిచే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఇష్టారాజ్యంగా మ‌ద్యం విక్ర‌యించే బెల్ట్ షాపుల్లో మ‌ద్యం సేవించిన కార‌ణంగానే ఈ ప్రమాదం జ‌రిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌కు పైగా బెల్ట్ షాపులుంటే వాటి మీద ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. బెల్ట్ షాపుల్లో 24 గంట‌లూ విచ్చ‌ల‌విడిగా విక్ర‌యిస్తున్న మ‌ద్యం కార‌ణంగానే రాష్ట్రంలో ఘోరాలు జ‌రుగుతున్నాయ‌ని మొత్తుకుంటున్నా ఈ ప్ర‌భుత్వానికి చ‌ల‌నం ఉండ‌టం లేదు. అమాయ‌కుల ప్రాణాలు ప‌ణంగా పెట్టి మ‌రీ దోచుకోవ‌డమే ల‌క్ష్యంగా ఈ ప్ర‌భుత్వం మ‌ద్యం విక్ర‌యాలు సాగిస్తోంది. వేలాపాలాలేని విచ్చ‌ల‌విడి మ‌ద్యం విక్ర‌యాల ద్వారా రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌తలు కూడా అదుపుత‌ప్పాయి. మ‌ద్యం విక్ర‌యాల ద్వారా ప్ర‌భుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా తెలుగుదేశం నాయ‌కుల జేబుల్లోకి చేరుతోంది. క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదాన్ని ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం ఒక గుణ‌పాఠంగా భావించి బెల్ట్ షాపులను ర‌ద్దు చేయాలి. 

- సోమిరెడ్డీ.. నీ పరిస్థితి చూసుకో..

డేటా సెంట‌ర్‌కి డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ కి తేడా తెలియ‌ని సోమిరెడ్డికి వైయ‌స్ జ‌గ‌న్ పేరెత్తే అర్హ‌త కూడా లేదు. నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబు.. సొమిరెడ్డి మొహం చూడ్డానికి కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో ఆయ‌న్ను ఇంప్రెస్ చేయ‌డానికి వైయ‌స్ జ‌గ‌న్ మీద ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు. రైతుల భూములు, దేవాలయ భూములు దోచుకోకుండా ఉంటే చాలు. అదృష్టం కొద్దీ గాలివాటాన గెలిచిన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి కూడా వైయ‌స్ జ‌గ‌న్ మాన‌సిక స్థితి స‌రిగా లేద‌ని మాట్లాడుతున్న ఆయ‌న శారీర‌క, మానసిక స్థితి స‌రిగ్గా చూసుకుంటే చాలు.

Back to Top