వైయస్‌ఆర్‌సీపీ నేతపై హత్యాయత్నం

 పరామర్శించిన ఎమ్మెల్యే విడదల రజని 

 
నాదెండ్ల : గుంటూరు జిల్లా నాదెండ్లకు చెందిన ౖవైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నల్లమోతు అమరేశ్వరరావుపై హత్యాయత్నం జరిగింది. బాధితుడు అమరేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు బుధవారం రాత్రి సుమారు 10 గంటలప్పుడు చిలకలూరిపేట నుంచి గణపవరం మీదుగా స్వగ్రామమైన నాదెండ్లకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గణపవరం సమీపంలో కుప్పగంజివాగు మలుపు వద్ద వెనుక నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై వెంబడించిన నలుగురు వ్యక్తులు అమరేశ్వరరావును ఆపి ‘ఏరా.. మా ఊళ్లో మా వాళ్లకే ఎదురొస్తున్నావంట.. నీ అంతు చూస్తాం’ అంటూ కత్తితో దాడి చేశారు. అమరేశ్వరరావు కుడి చేతికి గాయమైంది. బాధితుడు వారి నుంచి తప్పించుకుని స్థానికుల సహాయంతో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకున్న అనంతరం నాదెండ్లకు తిరిగి వెళ్లాడు. చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ చెన్నకేశవులు అమరేశ్వరరావు ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని గురువారం అమరేశ్వరరావును పరామర్శించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 

Back to Top