కక్షసాధింపు చర్యల్లో భాగంగానే శ్రీకాంత్ రెడ్డి ఇంటిని కూల్చారు

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి ఫైర్‌

బ‌ద్వేల్‌లో కూల్చివేసిన ఇంటిని ప‌రిశీలించిన ఎంపీ

వైయ‌స్ఆర్ జిల్లా:  కూట‌మి ప్ర‌భుత్వంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం రోజురోజుకు తారాస్థాయికి చేరింద‌ని, క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయ‌కుడు శ్రీ‌కాంత్‌రెడ్డి ఇంటిని కూల్చార‌ని ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం బద్వేలు మండలం బయనపల్లెలో ఇటీవల కూల్చివేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఇంటిని అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి, త‌దిత‌రులు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే శ్రీకాంత్ రెడ్డి ఇంటిని కూల్చివేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎనిమిదేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటుంటే, ఇప్పుడు చెరువు భూమి అంటూ కూల్చివేయడం దారుణమ‌ని మండిప‌డ్డారు. కేవలం శ్రీకాంత్ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన‌ వ్యక్తి కావడంతోనే ఇలాంటి కక్షపూరిత చర్యలకు దిగార‌ని త‌ప్పుప‌ట్టారు. బడి, గుడి వద్దే మద్యం షాపులున్నాయని చెప్తే పట్టించుకోరు కానీ..రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం అమలు చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 8 సంవత్సరాల క్రితం టిడిపి ప్రభుత్వంలో శ్రీకాంత్ రెడ్డి ఇంటి పక్కనే సిసి రోడ్డు కూడా వేయడం జరిగింద‌ని,  అప్పుడు చెరువు స్థ‌లం అని ఈ ప్ర‌భుత్వానికి తెలియ‌దా అని ప్ర‌శ్నించారు.  కూట‌మి నేత‌లు తీరు మార్చుకోక‌పోతే రానున్న రోజుల్లో ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెప్తార‌ని వైయ‌స్ అవినాష్ రెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top