తాడేపల్లి: దక్షిణాసియా ఉపఖండంలో రెండు విభిన్న పరిస్థితులు, స్వభావాలకు ప్రతిరూపం ఇండియా, పాకిస్తాన్. లౌకిక, ప్రజాతంత్ర దేశమైన భారత్ తన 76 ఏళ్ల ప్రయాణంలో అనేక మైలురాళ్లు దాటింది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య దేశంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అంచనాలకు మించిన ఆర్థికాభివృద్ధి సాధించింది ఇండియా. మరి సోదర దేశంగా పరిగణించే పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా ఉంది. పేరుకు ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంగా ఉన్నా అక్కడ పదవీకాలం ముగిసిన చట్టసభలకు ఎన్నికలు నిర్ణీత గడువులోగా జరుగుతాయో లేదో చెప్పలేని స్థితి నెలకొని ఉంది. దివాలాకోరు ఆర్థిక విధానాలకు తోడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పుడు ఈ దేశం అంతర్జాతీయ ఆర్థికసంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతోంది. ఆరంభం నుంచీ ఆర్థిక ప్రగతిపై కన్నా సైనిక బలంపైనే దృష్టి పెట్టిన పాకిస్తాన్ ను నిలకడలేని విధానాలే నిలువునా ముంచుతున్నాయి. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ప్రపంచ బ్యాంకు కవల సంస్థ అయిన అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి పాక్ 25 సార్లు ఆర్థిక సహాయం పొందింది. ప్రజాస్వామ్య దేశంగానే గాక ఆర్థిక వ్యవస్థగా పాక్ ‘విఫల రాజ్యం’ అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద కారణం ఏదీ అవసరం లేదు. రోజు రోజుకు అప్పుల ఊబిలో దిగబడిపోతూ అత్యధిక ద్రవ్యోల్బణంతో పాక్ ముందుకు సాగుతోంది. చివరి నిమిషంలో రుణాల ఎగవేతదారు అనే ముద్రపడకుండా ఉండడానికి ఐఎంఎఫ్ నుంచి మొన్న పాక్ సర్కారు 300 కోట్ల డాలర్ల బెయిలవుట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నంగా పూర్వపు షహబాజ్ షరీఫ్ సర్కారు వస్తు సేవల పన్నును 18 శాతానికి పెంచింది. అక్కడ లీటరు పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 272, 280 పాక్ రూపాయలు పలుకుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అన్వరుల్ హక్ కాకర్ నేతృత్వంలో అధికారం చేపట్టిన కొత్త ఆపద్ధర్మ సర్కారు వెంటనే పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడంతో పెట్రోలు ధర 290 పాక్ రూపాయలైంది. 31% ద్రవ్యోల్బణం, చెల్లింపుల సంక్షోభం పాక్ ఆర్థిక వ్యవస్థ నేడు 31 శాతం ద్రవ్యోల్బణంతో కునారిల్లుతోంది. విదేశీ చెల్లింపుల సమస్య అదుపు తప్పుతోంది. పారిశ్రామిక ఉత్పత్తి బాగా తగ్గిపోతోంది. మరో పక్క రాజకీయ సంక్షోభం, సకల సమస్యలతో ప్రజాందోళనలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దేశంలో విశేష జనాదరణ ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో వేశారు. అవినీతి ఆరోపణల కేసులో న్యాయస్థానం హడావుడిగా విచారించి జైలు శిక్ష విధించడంతో ఇమ్రాన్ ఇకముందు ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోయారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ప్రజాతంత్ర దేశంగా కొనసాగిన పాకిస్తాన్ జాతిపిత మహ్మదలీ జిన్నా మరణానంతరం ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. ఫలితంగా 1947 ఆగస్టు 14 నాటికి దేశంలో 23 శాతం ఉన్న మతపరమైన మైనారిటీ వర్గాల జనాభా నేడు 3 శాతానికి పడిపోయింది. ఇటీవల తూర్పు పంజాబ్ రాష్ట్రంలో క్రైస్తవుల ఇళ్లు, చర్చీలపై జరిగిన దాడులు సభ్య ప్రపంచానికి దిగ్భాంతి కలిగించాయి. దైవదూషణ చట్టం పేరుతో మైనారిటీలను వేధించడం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి దాడులు జరిపిస్తున్నారనే ఆరోపణలకు ఆధారాలున్నాయి. దేశంలో పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉండడంతో ఈ ఏడాది జూన్ ఆఖరు వరకూ పాక్ నుంచి 8.32 లక్షల మంది పౌరులు ఇతర దేశాలకు వలసపోయారు. వారిలో 4 లక్షల మంది ఐటీ సహా ఆధునిక నైపుణ్యాలు, విద్య అభ్యసించిన యవతీయువకులు ఉన్నారు. దేశంలో పరిస్థితి ఏమాత్రం ఆశావహకంగా లేకపోవడంతో అనేక మంది పాకిస్తానీయులు చట్టవ్యతిరేకంగా పడవల్లో ఐరోపా దేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల గ్రీస్ తీరంలో మునిగిపోయిన ఇలాంటి పడవలో 209 మంది పాకిస్తాన్ పౌరులున్నారు. దేశంలో 31 శాతం విద్యావంతులైన యువత నిరుద్యోగంతో బాధపడుతుండగా, 67% యువతీయువకులు దివాలా తీస్తున్న పాక్ వదిలి విదేశాలకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు. ఇంతటి అంతర్గత సంక్షోభంతో నలిగిపోతున్న పాకిస్తాన్ ప్రజలు రాబోయే సాధారణ ఎన్నికల తర్వాతైనా కష్టాల నుంచి బయట పడతారేమో చూడాలి.