నెల్లూరు: నెల్లూరు ప్రతిష్టను టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణంగా దిగజార్చిందని, ఒకప్పుడు నిజాయితీకి నగరంగా పేరు పొందిన నెల్లూరు ఇప్పుడు నార్కొటిక్స్ హబ్‌గా మారిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాకే నెల్లూరు పరిస్థితి మారిందన్న ఆయన, హత్యలు, దోపిడిలు, గంజాయి సంస్కృతి పెరగడమే కాకుండా.. జైళ్ల నుంచే గంజాయి, రౌడీయిజం ఆపరేషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు. నెల్లూరులో బైక్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ద్వారా యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్నారని, చివరకు రూ.300కు పీకలు కోసే విష సంస్కృతి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడంచెల పద్ధతిలో గంజాయి సరఫరా అవుతుంటే, దాన్ని నియంత్రించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమంగా గంజాయి కేసులు పెడుతూ కూటమి ప్రభుత్వం కొత్త సాంప్రదాయానికి తెర లేపిందని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..: నెల్లూరులో దారుణ పరిస్థితులు: నెల్లూరు ఒకప్పుడు నిజాయితీ, నమ్మకం, ప్రేమకు పేరుపొందిన నగరం. అయితే ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నెల్లూరు ఇప్పుడు నార్కొటిక్స్ హబ్‌గా, నేరాల మయంగా మారిపోయింది. డ్రగ్స్, రౌడీయిజం నెల్లూరులో జైలు నుంచే నడుస్తున్నాయి. ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య కాదు. ఏకంగా శాంతి భద్రతలపైనే పెద్ద దాడి. వాటిని నియంత్రించడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఈ పరిస్థితి ఇంకా ఇలాగే కొనసాగితే నెల్లూరు నేరగాళ్ల కేంద్రం అవుతుంది. 2024 తర్వాతే ఈ దుస్థితి: 2024 ఎన్నికల తరువాత నెల్లూరులో గంజాయి విచ్చలవిడిగా పెరిగింది. ఇంతకు ముందు కనిపించని పీకలు కోసే సంçస్కృతి, కేవలం రూ.300 కోసం హత్యలు చేసే పరిస్థితి దాపురించింది. గంజాయి–లిక్కర్ మిక్స్‌తో ప్రమాదాలూ పెరిగాయి. అదే గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయిని దాదాపు నియంత్రించారు. ఎవ్వరినీ ఉపేక్షించకుండా నిర్దాక్షిణ్యంగా కేసులు నమోదు చేసి లక్ష కేజీల గంజాయి పట్టుకున్నారు. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, క్రిమినల్స్‌ను ఒక జోన్ నుంచి మరో జోన్‌కు మార్చడం ద్వారా సమస్య మరింత పెరిగింది. ముఖ్యంగా వైజాగ్ చుట్టుప్రక్కలున్న డ్రగ్స్ నేరస్థులను నెల్లూరు జైలుకు పంపి, వాళ్లను స్థానిక చిన్న నేరగాళ్లతో కలిపి ఛెయిన్ సిస్టమ్‌లో డ్రగ్స్ సరఫరా చేయించే పరిస్థితి వచ్చింది. ఒడిషా నుంచి నెల్లూరుకు గంజాయి: ఒడిషా నుంచి 2.25 కేజీల గంజాయితో ఒక పార్సిల్ తయారు చేసి రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నారు. ఈ సరఫరా వ్యవస్థలో నెల్లూరులో 30 మంది సప్లయర్స్, వారి కింద 300 మంది డెలివరీ బాయ్స్ ఉండగా, వారిలో చాలామంది డిగ్రీ చదివిన యువత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కో ప్యాకెట్ మీద రూ.50 కమీషన్ ద్వారా వారు రోజుకి రూ.500 వరకు సంపాదిస్తూ, గంజాయి వ్యసనానికి లోనవుతున్నారు. గంజాయి వ్యసనానికి 6 వేల మంది యువకులు బానిసలు కావడం, పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మంత్రి నారాయణకు ఇవన్నీ కనిపించడం లేదా?: నెల్లూరులో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా మంత్రి పి.నారాయణ కేవలం పెన్షన్ పంపిణీల్లోనే కనిపిస్తున్నాడు. నేను 24 గంటల్లో ఇన్ని వివరాలు సాధించగలిగితే, మంత్రికి ఎంత సమాచారం ఉంటుందో.. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. అయినా ఆయన ఈ విషయంలో ఎందుకంత సీరియస్‌గా లేరు? నెల్లూరులో గంజాయి నివారించాలని మంత్రి అనుకోవడం లేదా?. డెలివరీ బాయ్స్‌ను పట్టుకుంటే గంజాయి ఛెయిన్ పూర్తిగా బయటపడుతుంది. పెంచలయ్య ఏం చేశాడని చంపేశారు?: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న నెల్లూరుకు చెందిన పెంచలయ్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు?. రూ.300 విలువైన గంజాయి ప్యాకెట్ ఇచ్చి హత్య చేయించిన దారుణాన్ని నెల్లూరు గతంలో ఏనాడూ చూడలేదు. హైవే పోలీసింగ్, నైట్ బీట్ వ్యవస్థలు ఎందుకు సక్రమంగా పని చేయలేకపోతున్నాయి?. పెంచలయ్య మరణంపై పార్టీ తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నాం. అలాంటి ఘటనలు అధికార పార్టీ అండ లేకుండా జరిగే వీలు లేదని ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.