తాడేపల్లి: ఎన్ని అక్రమ కేసులు నమోదు చేసినా, ఎన్ని రౌడీ షీట్లు తెరిచినా డీఎస్సీ అక్రమాలపై చేస్తున్న పోరాటంలో వైయస్ఆర్‌సీపీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణ ద్వారా డీఎస్సీ-2025కు సంబంధించిన అక్రమాలు వెలుగులోకి వచ్చే వరకు, నిందితులకు శిక్షలు పడి నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఆదేశించడానికి ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. శాప్ కార్యాలయం వద్ద ధర్నా నేపథ్యంలో డీఎస్సీపై పోరాడుతున్న వైయస్ఆర్‌సీపీ నేతలపై ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని రమేష్ యాదవ్ ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం లబ్ధి పొందాలని ఐదేళ్ల క్రితం నమోదైన కేసులను తిరగదోడి 51 మంది వైయస్ఆర్‌సీపీ నేతలపై రౌడీ షీట్లు తెరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితులైన తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ పరిధిలోని తొమ్మిది పోలీస్ స్టేషన్లు, నలుగురు ఏసీపీల పరిధిలో వైయస్ఆర్‌సీపీ నేతలపై కేసుల నమోదుకు ప్రత్యేక వ్యవస్థ నడుస్తోందని రమేష్ యాదవ్ ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదుర్కోలేక అక్రమ కేసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో విపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రౌడీషీట్లు తెరుస్తున్నారు. వెన్నుపోటు పార్టీ గూండాలు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై లాఠీలతో దాడులు చేస్తుంటే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీగెలుపును అడ్డుకోవడం సాధ్యంకాక మా పార్టీ నాయకుల గొంతు నొక్కాలనే దురుద్దేశంతోనే ఈ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారు. ఇందులో భాగంగానే ఐదేళ్ల కిందటి పాత కేసులను తిరగదోడి ఎమ్మెల్సీ తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌లతో పాటు సుమారు 51 మంది వైయస్ఆర్‌సీపీ నాయకులపై రౌడీషీట్లు ఓపెన్ చేసి వేధిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల తొమ్మిది పోలీస్ స్టేషన్లు, నలుగురు ఏసీపీల పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును ప్రశ్నించడమే దీనికి ఉదాహరణ. అక్రమాలు చేయనప్పుడు సీబీఐ విచారణంటే భయం దేనికి ? డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ స్కామ్ జరిగిందని మేము మొదటి నుంచి చెబుతున్నాం. అభ్యర్థుల ఆందోళనలను పక్కదారి పట్టించేందుకే అక్రమ కేసుల తంతు నడుపుతున్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ-2025లో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిరూపించేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలి. సీబీఐ విచారణకు ఆదేశించిన మరుక్షణమే డీఎస్సీపై మా ఆందోళనలను నిలిపివేస్తాం. ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా, ఎన్ని దొంగ కేసులు, రౌడీషీట్లు బనాయించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. డీఎస్సీ-2025 అక్రమాలను బయటికి లాగేంత వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది. డీఎస్సీ స్కామ్‌కు సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన నివేదికను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి అందజేస్తామని రమేష్ యాదవ్ స్పష్టం చేశారు.