జ‌గ‌న‌న్న ప‌థ‌కాలు ర‌ద్దు చేస్తాన‌ని చెప్పే ద‌మ్ము చంద్ర‌బాబుకు ఉందా?

శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ప్లీన‌రీలో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి స‌వాలు 
 

నంద్యాల‌:  ముఖ్య‌మంత్రి అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ము ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు ఉందా అని వైయ‌స్ఆర్‌సీపీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి స‌వాలు విసిరారు. శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్లీన‌రీ స‌మావేశం మంగ‌ళ‌వారం ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ముందుగా నంద్యాల ట‌ర్నింగ్‌లోని దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి నంద్యాల ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి, జిల్లా ప‌రిశీల‌కులు రామ‌సుబ్బారెడ్డిల‌తో క‌లిసి ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ప‌ట్ట‌ణంలో భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్లీన‌రీలో ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దేశంలోని ముఖ్య‌మంత్రులకే ఆద‌ర్శంగా నిలిచార‌న్నారు.  ఒక రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలతో 31 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక రికార్డని అది సీఎం వైయ‌స్‌ జగన్ ఒక్కడికే సాధ్యమైందన్నారు. తాను గడప గడపకు వెళ్లిన సమయంలో ప్రజల నుంచి వైయ‌స్ జగన్ పాలనపై 100 శాతం సంతృప్తి వస్తోందన్నారు. ఒకవైపు రాష్ట్రం ఇలా అభివృద్ధి పథంలో సాగుతుంటే మరోవైపు 40 ఏళ్ళు రాజకీయాలు అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఎల్లో మీడియాపై ఆధార పడి రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ జీవితం అని ఎద్దేవాచేశారు. చంద్రబాబు పని అయిపోయిందని ఆయనకు  ఇవే ఆఖరి ఎన్నికలని చెప్పారు. 

జగనన్న ఏం చేశాడో ..మీ ఇంట్లో అడిగి తెలుసుకోండి టీడీపీ నేత‌ల్లారా..
జగనన్న ఏం చేశాడు అని ఆరోపించే టీడీపీ నేతలారా..మీ ఇంట్లో అడిగి తెలుసుకోండి అని ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి సూచించారు. జనం కోసం పరితపించే నాయకుడు జగన్‌ ఒక్కరేనని.. ఆయనకు ఎవరూ సాటి రారని మరో 30 సంవత్సరాల పాటు వైయ‌స్‌ జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ వ్యాఖ్యానించారు. వైయ‌స్ జగన్ సంక్షేమ పథకాలు, ఆయన పాలన నేడు దేశానికే డిక్సుచిలా మారాయన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయకుండా పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. ఈ మూడేళ్ళలో లక్షా 71 వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసాడని పేర్కొన్నారు. 

వాలంటీర్ వ్యవస్థ.. దేశానికే ఆదర్శం
 సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన వాలంటీర్‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని ఎమ్మెల్యే శిల్పా అన్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో ఎక్క‌డా వివ‌క్ష లేద‌ని, లంచాల‌కు తావు లేద‌న్నారు. కులం, మ‌తం, పార్టీలు, ప్రాంతాలు చూడ‌కుండా అర్హులంద‌రికీ అందిస్తున్నామ‌ని చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి పథకాలను ఇతర రాష్ట్రాలు అమలు చేయబోతున్నాయ‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాలే వైయ‌స్ఆర్‌సీపీని మ‌ళ్లీ గెలిపిస్తాయ‌ని, రాబోయే ఎన్నికల్లో జగనన్న సరికొత్త ప్రభంజనం సృష్టిస్తార‌ని చెప్పారు. మంచి చేసాము కాబట్టే ఈరోజు తలెత్తుకుని గడప గడపకు వెళ్లి, ఇల్లిళ్ళు తిరిగి జగనన్న చేసిన మేలు చెబుతున్నామన్నారు. ప్రజలకు ఇన్ని మేలు చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేక ఎల్లో మీడియాతో తప్పుడు రాతలు రాయిస్తూ నీచ రాజకీయాల కు పాల్పడుతున్నాడని విమర్శించారు. వైయ‌స్ జ‌గ‌న్  సుపరిపాలనతో తెలుగుదేశం పార్టీ చతికిల పడిపోయిందని చెప్పారు. శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర‌రెడ్డి చెట్టుపేరు చెప్పి కాయ‌లు అమ్ముకుంటున్నార‌ని విమ‌ర్శించారు. బుడ్డా వాళ్ళు ఒరిజినల్ కాదు.. డూప్లికేట్ లు.. వాళ్ళు కూడా ఉయ్యాలవాడ నుంచి వలస వచ్చార‌ని గుర్తు చేశారు. తాను నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు పని చేస్తున్నా.. ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తాన‌ని చెప్పారు. మరోసారి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ముఖ్యమంత్రి గా చేసుకోవడమే మన ముందున్న లక్ష్యమన్నారు. ఈసారి వైయ‌స్ జగన్ గెలిస్తే మరో 30 ఏళ్ళు ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతాడని చెప్పారు. అందరూ ఆ దిశగా కృషి చేయాలని శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పిలుపునిచ్చారు.  

Back to Top