ఆ రెండు పార్టీలు క‌లిసి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాయి

టీడీపీ, బీజేపీల‌పై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్ర‌హం

పేదల కోసమే స‌ర్కారు టికెట్ రేట్లు తగ్గించింది తిరుప‌తి:  తెలుగు దేశం, బీజేపీ క‌లిసి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  నిన్న విజ‌య‌వాడ‌లో బీజేపీ నిర్వ‌హించిన జ‌నాగ్ర‌హ‌ స‌భ‌పై ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ ఆ పార్టీ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌జ‌లు తెలుగుదేశం, బీజేపీపైనే ఆగ్ర‌హంగా ఉన్నార‌ని అన్నారు. ఈ రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేసింది ఆ రెండు పార్టీలేన‌ని ఆమె మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు క‌లిసి ఈ రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాయ‌ని అన్నారు. టీడీపీ నేత‌లే బీజేపీలో చేరార‌ని, టీడీపీ నేత‌లు రాసిచ్చిన స్క్రిప్టుని బీజేపీ నేత‌లు చ‌దివి వినిపిస్తున్నార‌ని ఆమె చెప్పారు.

ఉన్న ప‌రువుని కూడా బీజేపీ నేత‌లు పోగొట్టుకుంటున్నార‌ని ఆమె అన్నారు. బీజేపీ నేత‌లు విభ‌జ‌న‌ హామీల‌ను నెర‌వేర్చ‌కుండా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. చంద్ర‌బాబు, బీజేపీ క‌లిసి రాష్ట్రాన్ని నాశ‌నం చేసి ఇప్పుడు త‌మ‌పైనే ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నార‌ని ఆమె అన్నారు. ఆగ్ర‌హిస్తే ప్ర‌జ‌లు ఆ రెండు పార్టీల‌పైనే ఆగ్ర‌హిస్తార‌ని చెప్పారు.

  ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం సినిమా టికెట్ల‌ ధరలను తగ్గించ‌డంపై రోజా మాట్లాడుతూ... ఏపీలోని పేద ప్రజల కోసమే వైయ‌స్ఆర్ సీపీ స‌ర్కారు ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. వైయ‌స్‌ జగన్‌ లాంటి స్నేహపూర్వకమైన సీఎంను మనం ఎక్కడా చూసి ఉండమ‌ని ఆమె వ్యాఖ్యానించారు. గ‌తంలో టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జునతో పాటు ఇతర సినీ పెద్దలు ఆన్‌లైన్‌ టికెట్ విధానం తీసుకురావాల‌ని చాలాసార్లు కోరార‌ని ఆమె అన్నారు.

వారి విజ్ఞ‌ప్తి మేర సీఎం జగన్‌ అందుకు త‌గ్గ చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని చెప్పారు. టాలీవుడ్ పెద్ద‌ల‌తో చర్చలు జరిపిన అనంత‌రమే నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని అన్నారు. ఈ విష‌యంపై కొంద‌రు రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. ఈ విష‌యాన్ని గ్రహిస్తోన్న‌ సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే చర్చలకు వస్తున్నారని ఆమె తెలిపారు.

Back to Top