తాడేపల్లి: టీడీపీ ఐదేళ్ల ఏళ్ళ పాలన.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో దళితుల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సవాలు విసిరారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజకమైన పరిపాలన సాగిస్తూ.. దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేదలకు డీబీటీ(డైరెక్టు బెనిఫిట్ స్కీమ్) ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే సంక్షేమ పథకాల డబ్బులు వేస్తుంటే.. విమర్శించటానికి ఏమీ లేక చంద్రబాబు దళిత కార్డును బయటకు తీశారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు దళితులపై లెక్కలేనన్ని దాడులు, అఘాయిత్యాలు చేసి, ఎస్సీల్లో ఎవరు పుట్టాలనుకుంటారని మాట్లాడిన చంద్రబాబు చేయాల్సింది పశ్చాత్తాప, క్షమాపణ ర్యాలీలేగానీ, ప్రతిఘటన ర్యాలీలు కాదని హితవు పలికారు. శ్రీ జగన్ రెండేళ్ళ రెండు నెలల పరిపాలనలో నేరుగా బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా అందించిన ప్రయోజనాలు 1.04 లక్షల కోట్లు అయితే, అందులో దళితుల వాటాగా అందినది రూ. 17 వేల కోట్లకు పైమాటేనని, నాన్ డీబీటీ స్కీములైన ఆరోగ్యశ్రీ, జగనన్న తోడు, ఇళ్ళ పట్టాలు వంటివి కూడా కలుపుకుంటే.. దళితులకు అందిన ప్రయోజనాలు రూ. 24 వేల కోట్లకు పైచిలుకు అని మేరుగు నాగార్జున వివరించారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ప్రతి పథకంలో డైరెక్టు దోపిడీ జరిగితే.. నేడు వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా, ఎటువంటి సిఫార్సులు లేకుండా డైరెక్టుగా అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. అంబేడ్కరిజాన్ని భుజాన వేసుకుని నడుస్తున్న నాయకుడు వైయస్ జగన్ అని అన్నారు. చంద్రబాబు దళితుల మధ్య చిచ్చు పెట్టి, వారిని విభజించాలని చూశాడన్నారు. దళితులను చంద్రబాబు ఏనాడైనా మనుషులుగా చూశాడా అని ప్రశ్నిస్తూ, అటువంటి చంద్రబాబుకు, టీడీపీకి దళితుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని నిలదీశారు. కేవలం రెండేళ్ళ రెండు నెలల కాలంలోనే ఇంత భారీగా దళితులకు సంక్షేమ ఫలాలు అందించిన ప్రభుత్వం మీద, ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టి, దళిత కార్డు బయటకు తీసి, ఏదోఒకటి మాట్లాడించాలన్న ప్రయత్నాన్ని చంద్రబాబు చేయటం వల్ల నిజాలు మరింతగా ప్రజలకు తెలుస్తాయి తప్ప, బాబు చెప్పే అబద్ధాలను ఎవరూ నమ్మరు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు దళిత సంక్షేమానికి పెద్దపీట వేసి, అంబేద్కరిజానికి భుజాన వేసుకుని పని చేస్తున్నారు. అన్ని రంగాలలోనూ రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు. ఆయన పరిపాలనలో దళితులు అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతున్నారు. అన్నివిధాలా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారంజకమైన పాలన కొనసాగుతుంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి ఏంచేయాలో అర్థం కాక, చివరికి దళిత కార్డును బయటకు తీశాడు. ఆయనతో పాటు టీడీపీ నేతలు దళితుల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంతకాలం దళితులపై దాడులు, అరాచకాలు, అఘాయిత్యాలు చేసి, అధికారంలో నుంచి దిగిపోయాక మొసలి కన్నీరు కారుస్తున్నారు. టీడీపీ చేయాల్సింది దళిత ప్రతిఘటన ర్యాలీ కాదు. దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారు అన్నందుకు పశ్చాత్తాప ర్యాలీ చేయాలి. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల దుర్బుద్ధి ఎలా ఉందంటే, అధికారంలో ఉన్నప్పడు మీ మనుషులతో దళితులపై దాడులు చేయిస్తారు. అధికారం పోయాక దళితులపై దాడి అని గావుకేకలు పెడుతున్నారు. దళితులను ఏనాడూ మనుషులుగా చూడని చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది..?. ముందుగా దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారన్నందుకు అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి, దళితుల గురించి హేళనగా మాట్లాడానని, తప్పు చేశానని క్షమాపణ కోరాలి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దాడి జరిగినా చివరకు పోలీసులపై కూడా కేసులు నమోదు చేయించారు ముఖ్యమంత్రి జగన్ గారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఆయనది ఎప్పుడూ దళిత వ్యతిరేక నైజమే. మా భూములు లాక్కోవడం, మా స్త్రీలను వివస్త్రలను చేయడం, చివరకు అంబేద్కర్ విగ్రహం పెడుతుంటే రాజకీయాలు చేయడం, దళితుల్ని వెలివేస్తే.. చూసీచూడనట్టు వదిలేయడం, ఇవన్నీ దళితులు ఎప్పటికీ మరచిపోరు. వైయస్ జగన్ గారి నేతృత్వంలో దళితులు అన్నివిధాలు లాభపడుతుంటే చంద్రబాబు హఠాత్తుగా దళతులపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంకోవైపు మాజీ మంత్రులు జవహర్, నక్కా ఆనంద్ బాబు ప్రెస్‌మీట్‌లు పెట్టడం చూస్తుంటే.. మీరు అధికారంలో ఉన్నప్పుడు దళితులపై దాడులు, అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు ప్రశ్నించలేకపోయారు. ఈరోజు జగన్ గారి పరిపాలనలో దళితులకు మంచి జరుగుతుంటే ధర్నాలు చేస్తారా.. చంద్రబాబునాయుడు నైజం మొదటి నుంచి చూస్తే.. బలంగా ఉన్న దళితుల్ని విభజించడానికి మాల, మాదిగ అంటూ విభజించి పాలించాలని చూశాడు. మాకూ మాకూ తగాదాలు పెట్టి, దళితులను వాడుకుని వదిలేసి, గొడవలు సృష్టించాలని కుట్రలు పన్నాడు. 40 ఏళ్ల ఇండస్ట్రీ రాజకీయ అనుభవంలో ఏనాడైనా పేదల స్థితిగతుల గురించి, అంబేద్కర్ భావజాలం గురించి కనీసం ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలో జరిగిన చిన్న సంఘటనల్లో ఎలాంటి ముద్దాయి అయినా, చివరికి పోలీసులు తప్పు చేసినా, శిక్షలు అనుభవిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిగారు దళితులకు అండగా ఉండి వారికి నష్టపరిహారం అందించేలా చేశారు. వైయస్ జగన్ గారు దళితులను సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. అనాదిగా చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు కుటుంబం దళితులతో వియ్యం అందిన కుటుంబం. దళితులంటే ఆప్యాయత, కరుణ ఆ కుటుంబానికి ఉన్నాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు మీరెప్పుడైనా దళితుల్ని మనుషులగా చూశారా? అలాంటిది దళితుల గురించి మాట్లాడానికి మీకు అర్హత ఎక్కడ ఉంది?. ఒక శాసనసభ్యుడిగా, దళితుడిగా... మీరు కాకపోయినా మీ పార్టీలో ఉన్న ఎవరైనా బహిరంగ చర్చకు వస్తే.. సమయం, ప్రాంతం చెబితే చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీలా కుయుక్తులు, కుట్రలు, కప్పదాటు, దొంగ నాటకాలు ఆడి తప్పుదోవ పట్టించాలని చూస్తే.. మా దళిత సమాజం మిమ్మల్ని నమ్మదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమాజంలో గుర్తింపు ఇచ్చావా? వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చాక 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నడూ మరిచిపోరు. దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చారు. గిరిజన మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు ఏనాడు అయినా ఈపని చేశారా? చంద్రబాబు చరిత్ర చూస్తే అవినీతిమయం, అశ్రిత పక్షపాతం, దళిత ద్రోహి చంద్రబాబు. అమరావతి రాజధానిలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే మీరు కోర్టులకు ఎందుకు వెళ్లారో చెప్పాలి? అమరావతి రాజధాని ఉద్యమం పేరుతో పెయిడ్ ఆర్టిస్ట్‌లతో ధర్నాలు, బంద్‌లు, ర్యాలీలు అంటూ చివరకు పోలీసులపై దాడులకు దిగడం చూస్తుంటే మిమ్మల్ని ఏమనాలి. రాజధాని పేరు చెప్పి బెదిరించి, అన్యాయంగా భూములు కాజేసిన మీరు, మీ వాళ్లు కోట్లు గడించారే? అదే రాజధాని ప్రాంతంలో దళిత సోదరులకు 54వేల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్ వస్తాయంటూ కోర్టుకు వెళ్లడం చంద్రబాబు నీచ సంస్కృతికి నిదర్శనం. ఇంకా దళితుల గురించి ఏం మాట్లాడతారు మీరు? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. దాన్ని గమనించిన జగన్ గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే వాటి మీద కూడా కోర్టుకు వెళతారా ? మీ నైజం ఏంటి? విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతుంటే చంద్రబాబు ఎన్ని వ్యతిరేక స్టేట్‌మెంట్‌లు ఇప్పించారో అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ భూమిని మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పనంగా అమ్ముకునేందుకు ప్రయత్నించింది నిజం కాదా.. చంద్రబాబు మాట్లాడిన భాష చూస్తుంటే సభ్య సమాజాన్ని అపహాస్యం చేసేలా ఉంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు చంద్రబాబు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటే...ఆయన మంత్రివర్గంలోని పని చేసిన ఆదినారాయణరెడ్డి దళితులు శుభ్రంగా ఉండరు, మురికిగా ఉంటారని మాట్లాడి దళితులను అవమానించారు. మీ హయాంలో కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పంలో దళితులపై దాడులు జరిగితే అన్యాయం జరిగిందని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి చెప్పలేకపోయారు. అలాంటిది మిమ్మల్ని దళితులు నమ్ముతారా.. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను అప్పనంగా, అన్యాయంగా కొల్లగొట్టుకుని, మీవాళ్లకు పంచిపెట్టారు. మీ హయాంలో డైరెక్ట్ దోపిడీ జరిగితే... ఇవాళ వైయస్సార్ గారి కుమారుడి హయాంలో డైరెక్ట్‌గా ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దళితులంటే చంద్రబాబుకు ఎప్పుడూ హేళన, అపహాస్యం చేయడమే, చంద్రబాబు పరిపాలనలో ఒక్క మంచి కార్యక్రమం అయినా మా ఇంటికి వచ్చిందని చెప్పే ఒక్క వ్యక్తిని అయినా చూపించండి. అదే వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చాక, దళిత సంక్షేమానికి పెద్దపీట వేసి, అంబేడ్కరిజాన్ని భుజాన వేసుకుని పనిచేస్తున్నారు, సామాజిక విప్లవానికి నాంది పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దఎత్తున ఉద్యోగాలు ఇచ్చారు. పదవుల్లో రిజర్వేషన్లు తూ.చ తప‍్పకుండా జగన్‌గారు పాటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి మొదటి బడ్జెట్ సమావేశాల్లో 50 శాతం రిజర్వేషన్లను ఇస్తూ చట్టం తీసుకు వచ్చారు. జగన్‌గారి పరిపాలన రాజ్యాంగబద్ధంగా నడుస్తోంది. ఇలాంటి రాజకీయ నాయకుడి వెంట నడవాలనేలా జగన్‌గారు పరిపాలన చేస్తున్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చి, పక్కా ఇళ్ళ నిర్మాణం చేస్తుంటే.. అది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు అన్నింటిలోనూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకే అధిక భాగం అందుతున్నాయని మేరుగ నాగార్జున వివరించారు.