యువ వైద్యుల‌పై పోలీసుల దాడి అత్యంత దారుణం

శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ  ఫైర్‌

తాడేప‌ల్లి: పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం విజ‌య‌వాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ వ‌ద్ద‌ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ వైద్యులపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పోలీసుల‌తో దాడి చేయించ‌డం అత్యంత దారుణ‌మ‌ని శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిప‌డ్డారు.  విద్యార్థినుల పైనా భౌతిక దాడులు చేయడం అన్యాయమ‌ని త‌ప్పుప‌ట్టారు. విదేశాల్లో చదువుకున్న మెడికల్‌ గ్రాడ్యుయేట్ల విషయంలో ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరిస్తోంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏమ‌న్నారంటే..` కూట‌మి ప్ర‌భుత్వం విదేశాల్లో వైద్య విద్య‌ను అభ్య‌సించిన వాళ్లను నేరస్తుల మాదిరిగా చూస్తోంది. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. అన్ని అర్హతలున్న వారికి పీఆర్‌ నంబర్‌ ఇస్తే తప్పేంటి. పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? ఎవరి స్వలాభం కోసం ప్రభుత్వం ఈ పిల్లలను వేధిస్తోంది. లక్షలు ఖర్చు చేసి చదివించుకున్న వారి తల్లిదండ్రులకు శోకం ఎందుకు తెప్పిస్తోంది. ఇంత చదివి.. రోడ్డు మీద పోరాటాలు చేయాల్సిన పరిస్థితిని చంద్రబాబు గారు తీసుకురావడం శోచనీయం. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే వారి పోరాటాల్లో మేం కూడా భాగస్వాములు అవుతాం` అంటూ బొత్స స‌త్య‌నారాయ‌ణ హెచ్చ‌రించారు.

Back to Top