సుప్రీం కోర్టుకంటే పవన్‌ కల్యాణ్‌ గొప్పవాడా..?

రుషికొండపై నిర్మాణాలకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది

రుషికొండపై ఏం అక్రమాలు జరిగాయో పవన్‌ సమాధానం చెప్పాలి

విశాఖను క్రైమ్‌ సిటీగా, అక్కడి ప్రజలను అవమానించేలా పవన్‌ మాటలు

ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్‌ కల్యాణ్‌ ప్రతిపక్ష నాయకుడా..?

ప్రభుత్వ భూములను అభివృద్ధి చేస్తుంటే పవన్‌కు బాధేంటి..?

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి విషం చిమ్ముతున్నారు

పవన్, చంద్రబాబులపై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపాటు

తిరుపతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని సీఎం వైయస్‌ జగన్‌ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విషం చిమ్ముతున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. విశాఖను అంతర్జాతీయ సిటీగా తీర్చిదిద్దాలని వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. పవన్‌ మాత్రం విశాఖను క్రైమ్‌ సిటీగా, అక్కడి ప్రజలను అవమానించే విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు ఏ సబ్జెక్ట్‌ గురించి మాట్లాడితే దాన్నే రీమేక్‌ చేస్తూ పవర్‌ స్టార్‌ కాస్త.. రీమేక్‌ స్టార్‌లా మారిపోయాడని ఎద్దేవా చేశారు. రుషికొండను బోడి కొండను చేశారని, బోడి వెదవలంతా బోడి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండ పర్యటన పేరుతో పవన్‌ హడావుడి చేశాడన్నారు. తిరుపతిలో మంత్రి ఆర్కే రోజా విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రుషికొండపై నిర్మాణాలకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిందని, నిర్మాణాలు ఆపేయాలని కోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు.  కోర్టుకంటే పవన్‌ కల్యాణ్‌ గొప్పవాడా..? అని ప్రశ్నించారు. రుషికొండపై ఏం అక్రమాలు జరిగాయో పవన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉందని, ప్రభుత్వం చేసే ప్రతి డెవలప్‌మెంట్‌ ఎప్పటికప్పుడు అఫిడవిట్‌ రూపంలో అందిస్తున్నామని, కోర్టు మార్పులు చెబితే అవి ప్రభుత్వం చేస్తుంది.. పవన్‌కు మధ్యలో బాధేంటి..? అని ప్రశ్నించారు. పవన్‌ కళ్లు కల్యాణ్‌ జ్యువెలరీలో తాకట్టుపెట్టాడా..? దత్తతండ్రి చంద్రబాబు 33 వేల ఎకరాలు తీసుకుంటే నోట్లో హెరిటేజ్‌ ఐస్‌క్రీమ్‌ పెట్టుకున్నాడా..? అని ప్రశ్నించారు. 

ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్‌ కల్యాణ్‌ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతాడని మంత్రి రోజా ప్రశ్నించారు. రుషికొండపై రామానాయుడు స్టూడియో పవన్‌కు కనబడలేదా..? అని నిలదీశారు. లోకేష్‌ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు గీతం యూనివర్సిటీ కబ్జా పవన్‌కు కనబడలేదా..? అని ప్రశ్నించారు. విశాఖను పరిపాలన రాజధానిగా ఎంచుకున్న నాటి నుంచి చంద్రబాబు, పవన్‌ విషం చిమ్ముతున్నారని, ప్రభుత్వ భూములను అభివృద్ధి చేస్తుంటే పవన్‌కు బాధేంటి..? అని ప్రశ్నించారు. పనికిమాలిన పార్టీలకు చంద్రబాబు, పవన్‌ అధ్యక్షులు అని ఎద్దేవా చేశారు.  చిరంజీవి, పవన్‌ ఇళ్లు బంజారాహిల్స్‌లో కొండపైనే ఉన్నాయని చెప్పారు. 
 

Back to Top